నేటితో ముగింపు
ABN , Publish Date - Sep 23 , 2026 | 01:53 AM
మండల పరిషత్, జిల్లా పరిషత్ పాలకవర్గాల గడువు ముగింపునకు వచ్చింది. మండల పరిషత్ ప్రజాప్రతినిధుల పదవీకాలం బుధవారంతో, జిల్లాపరిషత్ పాలకవర్గం గడువు గురువారంతో ముగియనుంది.
మండల పరిషత్ పాలకవర్గాల పదవీకాలం పూర్తి
రేపటితో ముగియనున్న జడ్పీ పాలకవర్గం గడువు
ఒంగోలు కలెక్టరేట్, సెప్టెంబరు 22 (ఆంధ్రజ్యోతి) : మండల పరిషత్, జిల్లా పరిషత్ పాలకవర్గాల గడువు ముగింపునకు వచ్చింది. మండల పరిషత్ ప్రజాప్రతినిధుల పదవీకాలం బుధవారంతో, జిల్లాపరిషత్ పాలకవర్గం గడువు గురువారంతో ముగియనుంది. 2021లో జరిగిన ఎన్నికల్లో మండల పరిషత్, జిల్లా పరిషత్ పాలకవర్గాలు ఏర్పడ్డాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న 56 మండలాల ఎంపీపీలు, ఎంపీటీసీల పదవీకాలం బుధవారం సాయంత్రంతో పూర్తికానుంది. జడ్పీ పాలకవర్గం పాలన గురువారం సాయంత్రంతో ముగియనుంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పరిపాలనతోపాటు జడ్పీ, మండల పరిషత్‌ల ద్వారా అభివృద్ధి పనులను వేగవంతం చేసేందుకు చర్యలు చేపట్టింది. అయితే మండల, జిల్లా పరిషత్ పాలకవర్గాల్లో ఎక్కువ శాతం వైసీపీకి చెందిన వారే ఉండటంతో అభివృద్ధిని అనేక ప్రాంతాల్లో అడ్డుకున్న పరిస్థితి కూడా ఉంది. అభివృద్ధి పనుల తీర్మానాల ఆమోదం గురించి కూడా పాలకవర్గాలు పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో ఆయా పాలకవర్గాల సమయం ముగియడంతో మండల పరిషత్‌లకు ప్రత్యేక అధికారులను నియమించేందుకు చర్యలు చేపట్టారు. ఇప్పటికే జడ్పీ ప్రత్యేక అధికారిగా కలెక్టర్ రాజాబాబును ప్రభుత్వం నియమించింది. మండల పరిషత్‌లకు ప్రత్యేక అధికారులను నియమించేందుకు చర్యలు చేపట్టారు.