నిరీక్షణకు తెర
ABN , Publish Date - Jun 25 , 2026 | 03:22 AM
వారంతా వెలిగొండ నిర్వాసితులు. లక్షలాది మంది ప్రజల క్షేమం కోసం ఎంతోకాలంగా నివాసముంటున్న ఇళ్లు, భూములు, చివరకు గ్రామాలనే వదిలేసుకున్న త్యాగధనులు. ఎన్నో ఏళ్లుగా ప్రభుత్వం తమకు ప్రకటించిన పరిహారం కోసం ఎదురు చూశారు. వారి నిరీక్షణకు ప్రజాప్రభుత్వం తెరదించింది.
వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు
రూ. 905.56 కోట్ల పరిహారం
మంజూరు చేసిన ప్రభుత్వం
27న దోర్నాల మండలం గంటవానిపల్లిలో
సీఎం చంద్రబాబు చేతుల మీదుగా పంపిణీ
ఊళ్లను త్యాగం చేసిన వారి కళ్లలో ఆనందం
వారంతా వెలిగొండ నిర్వాసితులు. లక్షలాది మంది ప్రజల క్షేమం కోసం ఎంతోకాలంగా నివాసముంటున్న ఇళ్లు, భూములు, చివరకు గ్రామాలనే వదిలేసుకున్న త్యాగధనులు. ఎన్నో ఏళ్లుగా ప్రభుత్వం తమకు ప్రకటించిన పరిహారం కోసం ఎదురు చూశారు. వారి నిరీక్షణకు ప్రజాప్రభుత్వం తెరదించింది. పరిహారంగా చెల్లించేందుకు అవసరమైన రూ.905.56 కోట్లను మంజూరు చేసింది. వాటిని నిర్వాసితుల కుటుంబాలకు ఈనెల 27న సీఎం చంద్రబాబు నాయుడు అందజేయనున్నారు. అందుకోసం ఆయన దోర్నాల మండలం గంటవానిపల్లికి వస్తున్నారు.
మార్కాపురం, జూన్ 24 (ఆంధ్రజ్యోతి) : వెలిగొండ నిర్వాసితులు పరిహారం కోసం అనేక పోరాటాలు చేశారు. అసలు ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుందో? తమను ఏ క్షణాన వెళ్లిపొమ్మని చెబుతారో? పరిహారం మాటేమిటో? అన్న అనుమానాలతో ఆందోళన చెందుతున్నారు. వాటన్నింటికీ ప్రజా ప్రభుత్వం తెరదించింది. రూ.905.56 కోట్ల పరిహారం మంజూరు చేసింది. ఈనెల 27న సీఎం చంద్రబాబు చేతుల మీదుగా కొందరికి అందజేయనుంది. ఆతర్వాత మిగిలిన వారి బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేయనుంది. అందుకు సంబంధించి ఆయా కుటుంబాల వివరాలను అధికారులు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేస్తున్నారు. తొలి విడతగా రూ.300 కోట్లు తక్షణమే నిర్వాసితులకు అందించేందుకు చర్యలు చేపట్టినట్టు కలెక్టర్ ఎం.విజయసునీత తెలిపారు.
నాడు మోసం.. నేడు వేగిరం
గత వైసీపీ పాలకులు వెలిగొండను మేమే పూర్తి చేస్తామని ప్రగల్భాలు పలికారు. చివరకు 2024 ఎన్నికల నాటికి పూర్తికాని ప్రాజెక్ట్‌ను జాతికి అంకితం చేసి ఈ ప్రాంత ప్రజలను మోసగించారు. జగన్‌రెడ్డి నమ్మకద్రోహం చేశారన్న విషయాన్ని అందరూ తెలుసుకున్నారు. 2024 ఎన్నికల్లో కూటమికి అండగా నిలిచి అధికారం కట్టబెట్టారు. ఈ రెండేళ్లలో సీఎం చంద్రబాబు వెలిగొండ ప్రాజెక్ట్‌పై ప్రత్యేక దృష్టి సారించారు. జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు నిరంతరం పర్యవేక్షిస్తూ పనులను స్పీడుగా చేయిస్తున్నారు. కొల్లంవాగు నుంచి మరికొద్ది నెలల్లోనే నీరు నల్లమల సాగర్ రిజర్వాయర్లలో నింపే చర్యలను వేగవంతం చేశారు. ప్రాజెక్ట్‌లో భాగంగా చేపట్టాల్సిన ఫీడర్ కాలువ పనులకు అవసరమైన రూ.456 కోట్లు మంజూరు చేసి ఆ పనులను స్వయంగా సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఇదంతా చూసిన ప్రజలకు ప్రాజెక్ట్ పూర్తవుతుందనే నమ్మకం కలిగింది.
నిర్వాసితుల కోసం నిధులు
ఇంతలోనే మళ్లీ నిర్వాసితుల అంశం తెరపైకి వచ్చింది. ప్రాజెక్టు పనులు పూర్తయితే తమ పరిస్థితి ఏమిటన్న గుబులు వారిలో మొదలైంది. కానీ కొద్దిరోజులకే కీలకమైన ఆ అంశానికి ప్రభుత్వం ముగింపునిచ్చింది. నిర్వాసితుల కోసం రూ.905.56 కోట్లు మంజూరు చేసింది. వెంటనే వారి ఖాతాల్లో జమ చేసేలా చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఈనెల 27న సీఎం చంద్రబాబు దోర్నాల మండలం గంటవానిపల్లి వద్దకు వస్తున్నారు. వెలిగొండ పనుల పురోగతి తెలుసుకోవడంతోపాటు ఫీడర్ కాలువ పనులను ఆయన పరిశీలిస్తారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో మాట్లాడతారు. తరువాత నిర్వాసితులకు పరిహారం విడుదల చేసి, కొందరికి తన చేతుల మీదుగా అందజేస్తారు.
11 గ్రామాల్లో 7,270 కుటుంబాలు
వెలిగొండ ప్రాజెక్టుకు సంబంధించిన రిజర్వాయర్ల కోసం కాకర్ల, సుంకేసుల, గొట్టిపడియ వద్ద ఉన్న గ్యాప్‌లను పూడ్చి డ్యాంల నిర్మాణం పూర్తి చేశారు. వీటి పరిధిలో మొత్తం 11 గ్రామాలు, దాదాపు 7,270 నిర్వాసిత కుటుంబాలున్నాయి. సుంకేసులలో 2,901, కలనూతలలో 1,118, చింతలముడిపిలో 88, గుండంచర్లలో 1,201, కాటంరాజుతాండాలో 38, అక్కచెరువులో 158, గొట్టిపడియలో 1,420, సాయిరాంనగర్‌లో 26, రామలింగేశ్వరపురంలో 36, కృష్ణానగర్‌లో 78, లక్ష్మీపురంలో 206 నిర్వాసిత కుటుంబాలకు పరిహారం అందనుంది. ఇవికాకుండా పరిహారం జాబితాలో పేర్లు లేవంటూ కొందరు దరఖాస్తు చేసుకుంటున్నారు. వాటిని కూడా అధికారులు పరిశీలించనున్నారు.