Share News

అభివృద్ధికి అడ్డంకిగా ఆక్రమణలు

ABN , Publish Date - Nov 17 , 2026 | 11:03 PM

ఒంగోలు నగర అభివృద్ధిలో భాగంగా చేపట్టిన డ్రైనేజి నిర్మాణ పనులకు ఆక్రమణల సమస్య అడ్డంకిగా మారింది. ఇందిరమ్మ కాలనీలో 9వ లైన్‌ నుంచి జర్నలిస్ట్‌ కాలనీ 2వ లైన్‌ వరకు చేపట్టిన డిస్పోజబుల్‌ డ్రైనేజి నిర్మాణ పనులు కొన్ని నెలుగా అర్ధంతరంగా నిలిచిపోయాయి.

అభివృద్ధికి అడ్డంకిగా ఆక్రమణలు
అసంపూర్తిగా నిలిచిన మురుగుకాలువ పనులు

ఒంగోలు నగరంలో కొన్ని నెలలుగా నిలిచిన డ్రైనేజి పనులు

కోట్ల విలువైన పనులకు అభ్యంతరాలతో బ్రేక్‌

ప్రజాప్రయోజనం పట్టించుకోవాలంటున్నకాలనీ వాసులు

కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన కదలని కార్పొరేషన్‌ అధికారులు

ఒంగోలు కార్పొరేషన్‌, నవంబరు 17 (ఆంధ్రజ్యోతి) : నగర అభివృద్ధిలో భాగంగా చేపట్టిన డ్రైనేజి నిర్మాణ పనులకు ఆక్రమణల సమస్య అడ్డంకిగా మారింది. ఇందిరమ్మ కాలనీలో 9వ లైన్‌ నుంచి జర్నలిస్ట్‌ కాలనీ 2వ లైన్‌ వరకు చేపట్టిన డిస్పోజబుల్‌ డ్రైనేజి నిర్మాణ పనులు కొన్ని నెలుగా అర్ధంతరంగా నిలిచిపోయాయి. ఫలితంగా ఆయా ప్రాంతాల ప్రజలు మురుగునీటి సమస్యతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ డ్రైనేజీ నిర్మా ణం చేపడుతున్న ప్రాంతం ఎన్‌ఎస్పీ పరిధిలోకి ఉందని స్థానికులు చెబుతున్నారు. ఈ స్థలాన్ని కొందరు ఆక్రమించుకుని ఉండటంతో పనులకు ఆటంకం ఏర్పడింది. తమ ఇంటి ముందు ఉన్న చెట్లను తొలగించడానికి వీల్లేదని, అవసరమైతే డ్రైనేజీ కాలువను అవతలివైపునకు మళ్లించి నిర్మించుకోవాలంటూ అభ్యంతరం వ్యక్తం చేయడంతో పనులు నిలిచిపోయినట్లు చెబుతున్నారు.

అధికారుల చొరవ ఏదీ..?

నగరానికి ఉపయోగపడే కీలకమైన డ్రైనేజి నిర్మాణం ఆక్రమణల కారణంగా నిలిచిపోయినా కార్పొరేషన్‌ అధికారులు తగిన చర్యలు తీసుకోవడంలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. సమస్యను పరిష్కరించి పనులు పూర్తి చేయాలని కాలనీవాసులు పలుమార్లు అధికారులను ఆశ్రయించడంతోపాటు కలెక్టర్‌ను కలిసి వినతిపత్రాలు కూడా అందజేసినట్లు తెలిసింది. అయినప్పటికీ ఇప్పటి వరకు సమస్యకు పరిష్కారం లభించలేదు. నగరంలో మౌలిక సదుపాయాల కల్పనకు కోట్లాది రూపాయలు వెచ్చిస్తుండగా, ప్రజలకు ఎంతో అవసరమైన డ్రైనేజీ నిర్మాణం ఆక్రమణల కారణంగా నిలిచిపోవడంపై అధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ స్థలంలో ఆక్రమణలు ఉన్నప్పటికీ వాటిని తొలగించడంతో అధికారులు వెనకడుగు వేయడంపై విమర్శలు వినిపిస్తున్నాయి.


మురుగునీటికి సమస్యకు పరిష్కారం ఎప్పడు ?

కలెక్టర్‌, నగరపాలక సంస్థ అధికారులు స్పందించి సంబంధిత స్థలాన్ని పరిశీలించాలని స్థానికులు కోరుతున్నారు. కార్పొరేషన్‌ అధికారులు స్థల వివాదం, ఆక్రమణల సమస్యను పరిష్కరించి, నిలిచిపోయిన డ్రైనేజీ పనులను వెంటనే పునఃప్రారంభించాలని వేడుకుంటున్నారు. కాలువ నిర్మాణం పూర్తయితే తమ ప్రాంతంలో మురుగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని కాలనీవాసులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Nov 17 , 2026 | 11:03 PM