Share News

ఆర్మీ జవాన్‌కు కన్నీటి వీడ్కోలు

ABN , Publish Date - Sep 30 , 2026 | 11:58 PM

ఆర్మీ హవల్దార్‌ కువ్వారపు కిషన్‌(37) మృతదేహానికి బుధవారం స్వగ్రామమైన మార్కాపుం జిల్లా బేస్తవారపేట మండలం పందిళ్లపల్లెలో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు

ఆర్మీ జవాన్‌కు కన్నీటి వీడ్కోలు
అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తున్న సైనికులు

మార్కాపురం కలెక్టర్‌, ఎస్పీ నివాళి

ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు

బేస్తవారపేట, సెస్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): ఆర్మీ హవల్దార్‌ కువ్వారపు కిషన్‌(37) మృతదేహానికి బుధవారం స్వగ్రామమైన మార్కాపుం జిల్లా బేస్తవారపేట మండలం పందిళ్లపల్లెలో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. అరుణాచల్‌ప్రదేశ్‌లోని తావాంగ్‌ సమీపంలో సెప్టెంబరు 27న జరిగిన రోడ్డుప్రమాదంలో కిషన్‌ మృతిచెందిన విషయం విదితమే. మృతదేహాన్ని ప్రత్యేక వాహనంలో స్వగ్రామానికి తీసుకురావడంతో ఒక్కసారిగా విషాదచాయలు అలముకున్నాయి. కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్థులు శోకంలో మునిగిపోయారు. కలెక్టర్‌ ఎం.విజయసునీత, జవాన్‌ భౌతికకాయానికి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రభుత్వం తరఫున అన్నివిధాలా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. అనంతరం ఆర్మీ అధికారులు, సిబ్బంది సైనిక సంప్రదాయం, ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు పూర్తిచేశారు. కార్యక్రమంలో ఎస్పీ పంకజ్‌కుమార్‌ మీనా, ఆర్డీవో వెంకటశివరామిరెడ్డి, తహసీల్దార్‌ ఎ.జీతేంద్ర, ఎంపీడీవో ఏవీ రంగనాయకులు, మాజీ సైనికులు పాల్గొని సైనిక గౌరవవందనంతో కిషన్‌ అంత్యక్రియలను నిర్వహించారు. కిషన్‌కు భార్య సంధ్యతోపాటు కుమారుడు ఉన్నాడు.

హవల్దార్‌ కిషన్‌ మృతికి సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్‌ సంతాపం

మార్కాపురం, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి) : సైన్యంలో విధులు నిర్వర్తిస్తూ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన హవల్దార్‌ కువ్వారపు కిషన్‌కు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్‌ సంతాపం తెలిపారు. కిషన్‌ మృతి ఎంతో తీవ్రంగా కలచివేసిందని, ఆంధ్రనేల బిడ్డగా, దేశానికి ఆయన అందించిన ధైర్యవంతమైన సేవ గుర్తుండిపోతుందని సీఎం చంద్రబాబు ఎక్స్‌ వేదికగా పేర్కొన్నారు. ప్రగాఢ సానుభూతి తెలుపుతూ కుటుంబానికి అండగా నిలుస్తామని అన్నారు. కిషన్‌ మృతికి సంతాపం తెలుపుతూ ఎక్స్‌లో మంత్రి నారా లోకేష్‌ పోస్ట్‌ చేశారు. ఈ తీవ్ర విషాద సమయంలో ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలుపుతున్నానని పేర్కొన్నారు.

Updated Date - Sep 30 , 2026 | 11:58 PM