Share News

అందుబాటులో అత్యవసర మందు

ABN , Publish Date - Jul 16 , 2026 | 02:51 AM

ఒకప్పుడు పాముకాటుకు గురైన వ్యక్తి సమీపంలోని వైద్యశాలకు వచ్చి ఇంజక్షన్‌ వేయించుకోవాలి. అది కొన్ని ప్రభుత్వ ఆసుపత్రు ల్లో అందుబాటులో ఉందో లేదో కూడా తెలియని పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు అదే మందు (ఇంజక్షన్‌)ను బాధితుని దగ్గరకు నేరుగా వచ్చి ఇచ్చి ప్రాణం కాపాడేలా ప్రజా ప్రభుత్వం చర్యలు తీసుకుంది.

అందుబాటులో అత్యవసర మందు

108లో పాముకాటు ఇంజక్షన్‌

వాహనంలో ఫ్రీజర్‌ బాక్సుల ఏర్పాటు

సమాచారం ఇవ్వగానే ప్రాథమిక చికిత్స

ప్రాణరక్షణ చర్యలు చేపట్టిన ప్రజా ప్రభుత్వం

మార్కాపురం, జూలై 15 (ఆంధ్రజ్యోతి) : ఒకప్పుడు పాముకాటుకు గురైన వ్యక్తి సమీపంలోని వైద్యశాలకు వచ్చి ఇంజక్షన్‌ వేయించుకోవాలి. అది కొన్ని ప్రభుత్వ ఆసుపత్రు ల్లో అందుబాటులో ఉందో లేదో కూడా తెలియని పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు అదే మందు (ఇంజక్షన్‌)ను బాధితుని దగ్గరకు నేరుగా వచ్చి ఇచ్చి ప్రాణం కాపాడేలా ప్రజా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. పాముకాటు ఇంజక్షన్‌ (స్నేక్‌ వీనమ్‌ యాంటీ సిరమ్‌)ను 108 వాహనంలోనే అందుబా టులో ఉంచింది. అందుకు అవసరమైన ఫ్రీజర్‌ బాక్స్‌ను కూడా ఏర్పాటు చేయించింది. జిల్లాలో 108 వాహనాలు మొత్తం 22 ఉండగా అన్నింటిలోనూ ఇంజక్షన్‌ను ఉంచారు. ఎక్కడైనా పాము కాటుకు గురైన వ్యక్తి 108కు సమాచారం ఇస్తే వాహన సిబ్బంది తక్షణమే అక్కడకు చేరుకుని ఇంజక్షన్‌ వేస్తారు. అనంతరం ప్రథమ చికిత్స చేసి సమీపంలో ఉన్న వైద్యశాలకు తరలిస్తారు. దీనివల్ల ప్రాణ గండం తప్పుతుంది. ఎక్కువగా పొలం పనుల్లో రైతులు ఇబ్బందులకు గురవుతుంటారు. ఉష్ణ వాతావరణం తగ్గి వర్షాలు, పంటల సాగు సమయంలో విషపురుగులు బయటకు వస్తుంటాయి. పాము కాటుకు గురైన వ్యక్తిని గంటలోపు వైద్యశాలకు తీసుకురావాల్సి ఉంటుంది. దీనిని గోల్డెన్‌ అవర్‌గా నిర్ధారించిన ప్రభుత్వం 108లోనే ఇంజక్షన్‌ను అందుబాటులో ఉంచి ప్రాణాలను కాపాడేందుకు కృషి చేస్తోంది. గత రెండు నెలలుగా ఈ సౌకర్యం 108 వాహనంలో అందుబాటులోకి వచ్చింది. ప్రభుత్వ వైద్యశాలల్లోనూ ఈ మందును ఉంచారు.

Updated Date - Jul 16 , 2026 | 02:51 AM