Share News

ఒంగోలులో ఎన్నికల డివిజన్‌లు పెంపు

ABN , Publish Date - Mar 24 , 2026 | 11:51 PM

ఒంగోలు కార్పొరేషన్‌ జనాభాకు అనుగుణంగా, నగర పంచాయితీలు, మునిసిపాలిటీలు, కార్పొరేషన్‌ల వార్డులు, డివిజన్‌లను పునర్విభజన చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.

ఒంగోలులో ఎన్నికల డివిజన్‌లు పెంపు
ఒంగోలు నగరం

జనాభా ఆధారంగా పునర్విభజిస్తూ ప్రభుత్వం ఉత్వర్వులు

50 నుంచి 66కు పెరగనున్న డివిజన్‌ల సంఖ్య

ఒంగోలు కార్పొరేషన్‌, మార్చి 24 (ఆంధ్రజ్యోతి) : పట్టణ ప్రాంతాల జనాభాకు అనుగుణంగా, నగర పంచాయితీలు, మునిసిపాలిటీలు, కార్పొరేషన్‌ల వార్డులు, డివిజన్‌లను పునర్విభజన చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. నగర జనాభాకు అనుగుణంగా, డివిజన్‌లలో నిర్ధిష్టమైన జనాభా ఉండే విధంగా డివిజన్‌ల పునర్విభజనపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పురపాలకశాఖ జీఎం ఎంస్‌ నెం. 358ను పురపాలక శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ఎస్‌. సురేష్‌కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఒంగోలు నగరంలో ఇప్పటి వరకు 50 డివిజన్‌లు ఉండగా, కొత్తగా విడుదలైన జీవో ప్రకారం మరో 16 డివిజన్‌లు పెరిగే అవకాశం ఉంది. వివరాల్లోకెళితే...

ఒంగోలు కార్పొరేషన్‌గా ఏర్పాటైన తర్వాత గత జనాభ లెక్కల ప్రకారం 3లక్షల 10వేల మంది ఉండగా, ఒక నిర్ధిష్టమైన సంఖ్య లేకుండా కొన్ని వార్డులో అతి తక్కువగా, మరి కొన్ని వార్డుల్లో అత్యధిక జనాభా ఉన్నారు. దాంతో యాభై డివిజన్‌లుగా ఉండగా, ఇకపై ప్రభుత్వ నూతన ఉత్వర్వులు మేరకు 3లక్షల నుంచి 4లక్షల వరకు జనాభా కలిగిన పట్టణాలు, నగరాలలో ప్రతి డివిజన్‌లోనూ 2500 మంది జనాభా ఉండేలా విభజించనుంది. ఆ ప్రాతిపదికన నగరంలో ఇకపై 66 డివిజన్‌లు ఏర్పాటు కానున్నాయి. దీంతో ఇటీవల పదవీ కాలం ముగిసిన తొలి పాలకవర్గం 50 మందితో ముగియగా, భవిష్యత్‌లో డివిజన్‌ల సంఖ్య పెంపుతో మరో పదహారు డివిజన్‌లు పెరగున్నాయి. ఒంగోలు రెండవ నగరపాలక సంస్థ కార్యవర్గం 66 మందితో మొదలు కానుండగా, ఇప్పటి వరకు ఆయా డివిజన్‌లకు కార్పొరేటర్‌లుగా ఎదురు చూస్తున్న ఆశావాహులకు ఇది వరంగా మారనుంది. వార్డులు, డివిజన్‌లు పునర్విభజనపై ఉత్వర్వులు జారీ చేసిన పురపాలక శాఖ, డివిజన్‌ల రిజర్వేషన్‌ల ప్రక్రియ, పూర్తి స్థాయి విధి, విధానాలను త్వరలోనే ప్రకటించనుంది.

Updated Date - Mar 24 , 2026 | 11:51 PM