పొదిలి నగర పంచాయతీకి ఎన్నికలు
ABN , Publish Date - Nov 12 , 2026 | 10:54 PM
పొదిలి నగర పంచాయతీ ఎన్నికల నగారా మోగింది. రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న మున్సిపాలిటీ, నగర పంచాయతీ ఎన్నికలకు గురువారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్‌చంద్ర పునేఠా నోటిఫికేషన్ విడుదల చేశారు.
నోటిఫికేషన్ విడుదల చేసిన ఎస్‌ఈసీ
రేపటి నుంచి నామినేషన్ల స్వీకరణ.. 26వ తేదీ పోలింగ్
30న ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి
మార్కాపురం, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి) : పొదిలి నగర పంచాయతీ ఎన్నికల నగారా మోగింది. రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న మున్సిపాలిటీ, నగర పంచాయతీ ఎన్నికలకు గురువారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్‌చంద్ర పునేఠా నోటిఫికేషన్ విడుదల చేశారు. దీంతో పొదిలి నగరపంచాయతీకి కూడా ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే 28 వార్డుల రిజర్వేషన్లను అధికారులు ఖరారు చేశారు. 28 వార్డుల పరిధిలో మొత్తం 14,820 మంది పురుషులు, 14,875 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం చైర్మన్, వార్డు సభ్యుల ఎన్నికకు 14వ తేదీ నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. 16వ తేదీ నామినేషన్లకు చివరి తేదీ. 17న నామినేషన్ల పరిశీలన తరువాత 19 వరకు ఉపసంహరణ గడువు ఉంటుంది. అభ్యర్థుల తుది జాబితా ప్రకటించిన తరువాత ఈనెల 26వ తేదీన పోలింగ్ నిర్వహిస్తారు. ఎక్కడైనా రీపోలింగ్ అవసరమైతే 27న జరిపి 30వ తేదీన ఓట్ల లెక్కింపు చేపడతారు. అదే రోజు ఫలితాలు వెల్లడిస్తారు.