Share News

ఎన్నికల కోడ్‌ సడలింపు

ABN , Publish Date - Nov 10 , 2026 | 02:32 AM

జిల్లాలో ఎన్నికల ప్రవర్తన నియమావళి (ఎలక్షన్‌ కోడ్‌) అమలులో పాక్షిక సడలింపు జరిగింది. అర్బన్‌ స్థానిక సంస్థలకు సంబంధించి మొత్తం ఎన్నికల ప్రక్రియ రాష్ట్రంలో ముగియడంతో ఆ ప్రాంతాల్లో కోడ్‌ను రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ (ఎస్‌ఈసీ) తొలగించింది.

ఎన్నికల కోడ్‌ సడలింపు

పట్టణ ప్రాంతాల్లో ఎత్తివేత

పంచాయతీ ఎన్నికలు ఉన్న చోట్ల కొనసాగింపు

ఒంగోలు, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో ఎన్నికల ప్రవర్తన నియమావళి (ఎలక్షన్‌ కోడ్‌) అమలులో పాక్షిక సడలింపు జరిగింది. అర్బన్‌ స్థానిక సంస్థలకు సంబంధించి మొత్తం ఎన్నికల ప్రక్రియ రాష్ట్రంలో ముగియడంతో ఆ ప్రాంతాల్లో కోడ్‌ను రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ (ఎస్‌ఈసీ) తొలగించింది. అయితే పంచాయతీ ఎన్నికలు జరగాల్సి ఉండటంతో గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం కోడ్‌ కొనసాగనుంది. రాష్ట్రవ్యాప్తంగా పట్టణ, గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు అక్టోబరు 14న రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ షెడ్యూల్‌ను ప్రకటించింది. తొలుత మున్సిపల్‌, అనంతరం పరిషత్‌, ఆ తర్వా త పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించిన ఎస్‌ఈసీ పంచాయతీ ఎన్నికల తుది పోలింగ్‌ డిసెంబరు 2గా నిర్ణయించింది. దీంతో షెడ్యూల్‌ ప్రకారం అక్టోబరు 14 నుంచి డిసెంబరు 2 వరకు ఎన్నికల కోడ్‌ అమలులో ఉంటుందని ప్రకటించింది. కాగా పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తిస్థాయిలో కౌంటింగ్‌తో సహా ఈనెల 6తో, పరిషత్‌ ఎన్నికల కౌంటింగ్‌ 7వతేదీ రాత్రితో ముగిశాయి. దీంతో పట్టణ ప్రాంతాల్లో అమలులో ఉన్న ఎన్నికల కోడ్‌ను ఈనెల 7 నుంచి తొలగిస్తూ ఎస్‌ఈసీ శనివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ 6వతేదీతో పూర్తవ డంతో ఆ ప్రాంతంలో కోడ్‌ తొలగించినట్లుఆ ఉత్తర్వుల్లో ఎస్‌ఈసీ అనిల్‌చంద్ర పునేఠ పేర్కొన్నారు. పరిషత్‌ ఎన్నికల ప్రక్రియ పూర్తయినప్పటికీ పంచాయతీ ఎన్నికలు జరగాల్సి ఉండటంతో గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్‌ అమలులోనే ఉన్నట్లు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా మరికొన్ని మున్సిపాలిటీల ఎన్నికలు జరగాల్సి ఉండగా వాటికి ఎన్నికలు నిర్వహించేటప్పుడు ఆ పరిధి వరకు ఎన్నికల కోడ్‌ అమలు చేసే అవకాశం ఉన్నట్లు అధికారవర్గాల సమాచారాన్ని బట్టి తెలుస్తోంది.

Updated Date - Nov 10 , 2026 | 02:32 AM