Share News

పాడిపరిశ్రమపై ఎల్‌నినో దెబ్బ

ABN , Publish Date - Aug 08 , 2026 | 02:50 AM

పాడి పరిశ్రమపై ఎల్‌నినో తీవ్ర ప్రభావం చూపుతోంది. పాల దిగుబడి భారీగా తగ్గింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గత ఏడాది ఆగస్టు ప్రారంభంలో పాల దిగుబడి సుమారు 2 లక్షల లీటర్లు ఉండగా, ప్రస్తుతం 1.20 లక్షల లీటర్లకు పడిపోయినట్లు తెలుస్తోంది.

పాడిపరిశ్రమపై ఎల్‌నినో దెబ్బ

భారీగా తగ్గిన పాల దిగుబడి

తీవ్రమైన గ్రాసం కొరత

భారంగా మారిన పశుపోషణ

అద్దంకి, ఆగస్టు 7(ఆంధ్రజ్యోతి) : పాడి పరిశ్రమపై ఎల్‌నినో తీవ్ర ప్రభావం చూపుతోంది. పాల దిగుబడి భారీగా తగ్గింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గత ఏడాది ఆగస్టు ప్రారంభంలో పాల దిగుబడి సుమారు 2 లక్షల లీటర్లు ఉండగా, ప్రస్తుతం 1.20 లక్షల లీటర్లకు పడిపోయినట్లు తెలుస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా పాల దిగుబడి తగ్గిపోవడంతో డెయిరీల నిర్వాహకులు ఆందోళన చెందుతున్నారు. ఎల్‌న్‌నో ప్రభావంతో ఉష్ణోగ్రతలు పెరగటంతో పాటు వాన జాడ కరువైంది. దీంతో పశుగ్రాసానికి కొరత ఏర్పడింది. బోరుబావులు ఉన్న పొలాల్లో మాత్రమే పచ్చిగడ్డి సాగు చేస్తున్నా రు. మిగిలిన ప్రాంతాలలో పచ్చిగడ్డి దొరకని పరిస్థితి నెలకొంది.

గడ్డికి గడ్డు పరిస్థితి

మార్కాపురం జిల్లాలో పశుగ్రాసం కోసం పోషకులు పడుతున్న ఇబ్బందులు వర్ణణాతీతంగా ఉన్నాయి. ఎండు గడ్డికి కూడా ఒక్కసారిగా డిమాండ్‌ ఏర్పడింది. గ్రాసం కోసం గేదెలను పొలాలకు తోలుకుపోతునప్పటికీ గడ్డి కోసం వెతుకులాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. పంట భూములన్నీ దుక్కి దున్ని ఉండటం, ఖాళీ పొలాలలో గడ్డి కూడా పూర్తిగా ఎండిపోయి ఉండటంతో గ్రాసం దొరకని పరిస్థితి నెలకొంది. పాలదిగుబడి పడిపోవవడంతో ఆదాయం భారీగా తగ్గింది. ఖర్చులు రెట్టింపయ్యాయి. దీంతో పశుపోషణ మరింత భారంగా మారిందని రైతులు ఆవేదన చెందుతున్నారు. కనీసం గేదెలకు వినియోగించే దాణా, గ్రాసం ఖర్చులు కూడా రాకపోతుండటంతో పాడి పరిశ్రమ అంటేనే రైతులు భయపడిపోతున్నారు. అయితే, వేరే ఏపనీ చేయలేక తప్పనిసరి పరిస్థితులలో పాడి పరిశ్రమను కొనసాగించాల్సి వస్తున్నదని రైతులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల నుంచి గట్టెక్కాలంటే పాల ధర పెంచడంతో పాటు ప్రభుత్వం సబ్సిడీపై గ్రాసం సరఫరా చేయాలని పశుపోషకులు కోరుతున్నారు.

Updated Date - Aug 08 , 2026 | 02:50 AM