ఉద్యోగుల సమస్యలు పరిష్కారానికి కృషి
ABN , Publish Date - Jul 09 , 2026 | 11:23 PM
జిల్లాలో ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని జిల్లా రెవెన్యూ అధికారి పీ వెంకటరమణ హామీ ఇచ్చారు.
డీఆర్వో వెంకటరమణ
ఒంగోలు కలెక్టరేట్, జూలై 9 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని జిల్లా రెవెన్యూ అధికారి పీ వెంకటరమణ హామీ ఇచ్చారు. స్థానిక కలెక్టర్ సమావేశపు హాలులో గురువారం మధ్యాహ్నం గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాల నాయకులతో జాయింట్ కౌన్సిల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్‌జీవో జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కూచిపూడి శరత్‌బాబు, ఆర్‌సీహెచ్ కృష్ణారెడ్డి, ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు చిన్నపురెడ్డి కిరణ్‌కుమార్‌రెడ్డి, వీఆర్వోల సంఘం జిల్లా అధ్యక్షుడు ఆదిరెడ్డితో పాటు పలు ఉద్యోగ సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయా ఉద్యోగ సంఘాల నాయకులు ఉద్యోగులు ఎదుర్కొంటున్న పలు రకాల సమస్యలను వివరించారు. జిల్లా స్థాయిలో పెండింగ్‌లో ఉన్న ఉద్యోగోన్నతులను పూర్తి చేయడంతో పాటు సచివాలయ ఉద్యోగులను అత్యవసర పరిస్థితుల్లో మినహా ప్రభుత్వసెలవు రోజుల్లో విధులకు పిలువకూడదని, ఐవీఆర్‌ఎస్ కాల్స్ ఆధారంగా లక్ష్యాలను నిర్దేశించి ఉద్యోగులపై ఒత్తిడీ పెంచే విధానాలను ఉపసంహరించుకోవాలని కోరారు. బూత్‌లెవల్ అధికారులు(బీఎల్వో) విధులకు సంబంధించి ఇటీవల కొంత మంది సస్పెన్షన్‌కు గురైన విషయాన్ని ఉద్యోగ సంఘాల నాయకులు డీఆర్వో దృష్టికి తెచ్చారు. సంబంధిత ఉద్యోగులపై జారీ చేసిన సస్పెన్షన్ ఉత్తర్వులను విచారణ పూర్తయ్యే వరకు నిలిపివేసి మానవతాదృక్పథంతో విధుల్లోకి చేర్చుకునే విధంగా చూడాలని కోరారు. ఆయా అంశాలపై స్పందించిన డీఆర్వో మాట్లాడుతూ జిల్లా పరిధిలో ఉండే ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.