Share News

అద్దంకి మీదుగా రైల్వేలైన్‌కు కృషి

ABN , Publish Date - Jan 13 , 2026 | 11:20 PM

అద్దంకి ప్రాంత ప్రజల ఆకాంక్ష మేరకు అద్దంకి మీదుగా రైల్వే లైన్‌ ఏర్పాటుకు కృషి చేస్తానని విద్యుత్‌శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ చెప్పారు.

అద్దంకి మీదుగా రైల్వేలైన్‌కు కృషి
మంత్రికి వినతిపత్రం అందజేస్తున్న సభ్యులు

మంత్రి రవికుమార్‌

అద్దంకి, జనవరి 13(ఆంధ్రజ్యోతి) : అద్దంకి ప్రాంత ప్రజల ఆకాంక్ష మేరకు అద్దంకి మీదుగా రైల్వే లైన్‌ ఏర్పాటుకు కృషి చేస్తానని విద్యుత్‌శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ చెప్పారు. అద్దంకి రైల్వే లైన్‌ సాధనసమితి సభ్యులు మంగళవారం ముప్పవరం వద్ద క్యాంప్‌ కార్యాలయంలో మంత్రి రవికుమార్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రవికుమార్‌ మాట్లాడుతూ పిడుగురాళ్ల-అద్దంకి-ఒంగోలు రైల్వేలైన్‌ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతానన్నారు. 2010-12 సంవత్సరాల మధ్య అద్దంకి మీదుగా రైల్వే లైన్‌ విషయమై ఢిల్లీ స్థాయిలో చేసిన ప్రయత్నాలను ఈ సందర్భంగా మంత్రి రవికుమార్‌ గుర్తు చేశారు. ప్రజల ఆకాంక్ష అయిన రెవెన్యూ డివిజన్‌, ప్రకాశం జిల్లాలో అంతర్భాగం చేయటం, అద్దంకి పట్టణంలో ట్రాఫిక్‌ రద్దీ తగ్గించేందుకు మినీ బైపాస్‌ రోడ్డు నిర్మాణం, దీర్ఘకాలంగా అద్దె భవనంలో ఉన్న గ్రంథాలయం నిర్మాణానికి స్థలం కేటాయింపు చేసిన రవికుమార్‌కు అద్దంకి రైల్వే సాధన సమితి సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. రైల్వేలైన్‌ సాధనసమితి సభ్యులు పట్టిల మధుసూదనరావు, మానికొండ రవిశంకర్‌ తదితరులు పాల్గొన్నారు.

నిషేధిత జాబితా నుంచి ముప్పవరం గ్రామకంఠం భూముల తొలగింపునకు చర్యలు

పంగులూరు, జనవరి 13(ఆంధ్రజ్యోతి): మండలంలోని ముప్పవరం గ్రామకంఠం భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించేందుకు చర్యలు చేపట్టినట్లు తహసీల్దార్‌ పి.సింగారావు తెలిపారు. 2012 నుంచి ముప్పవరం గ్రామకంఠం పరిధిలోని సర్వే నెంబరు 247లో 11 ఎకరాల 40 సెంట్ల విస్తీర్ణం మార్టూరు సబ్‌ రిజిస్టార్‌ కార్యాలయంలో నిషేధిత జాబితాలో చేర్చబడిందని పేర్కొన్నారు. అప్పటినుంచి ముప్పవరం గ్రామంలో క్రయ, విక్రయాలు నిలిచి ప్రజలు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. మంత్రి రవికుమార్‌ ఆదేశాల మేరకు గ్రామకంఠం భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించే చర్యల నిమిత్తం నివేదికను ఉన్నతాధికారులకు పంపామని తహసీల్దార్‌ తెలిపారు.

Updated Date - Jan 13 , 2026 | 11:20 PM