Share News

విద్యా సంస్థలు బంద్‌

ABN , Publish Date - Jul 25 , 2026 | 02:31 AM

జిల్లావ్యాప్తంగా విద్యాసంస్థలు బంద్‌ అయ్యాయి. ఢిల్లీలో శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులపై కేంద్రప్రభుత్వం పోలీసుల ద్వారా లాఠీచార్జి చేయించడాన్ని నిరసిస్తూ శుక్రవారం విద్యార్థిసంఘాల ఆధ్వర్యంలో బంద్‌ నిర్వహిం చారు.

విద్యా సంస్థలు బంద్‌
ఒంగోలులోని కలెక్టరేట్‌ వద్ద బైఠాయింపునకు ప్రయత్నిస్తున్న విద్యార్థి సంఘాల నాయకులను అడ్డుకుంటున్న పోలీసులు

కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని విద్యార్థి సంఘాల నాయకుల డిమాండ్‌

కలెక్టరేట్‌ ఎదుట బైఠాయింపును అడ్డుకున్న పోలీసులు

ఒంగోలు కలెక్టరేట్‌, జూలై 24 (ఆంధ్రజ్యోతి) : జిల్లావ్యాప్తంగా విద్యాసంస్థలు బంద్‌ అయ్యాయి. ఢిల్లీలో శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులపై కేంద్రప్రభుత్వం పోలీసుల ద్వారా లాఠీచార్జి చేయించడాన్ని నిరసిస్తూ శుక్రవారం విద్యార్థిసంఘాల ఆధ్వర్యంలో బంద్‌ నిర్వహిం చారు. ముందుగా నగరంలోని పలు ప్రైవేటు పాఠశాలలను మూసి వేయించారు. దామచర్ల సక్కుబాయమ్మ పాలిటెక్నిక్‌ కళాశాల, డిగ్రీ కళాశాల, ఏబీఎం కళాశాల, ఆంధ్రకేసరి యూనివర్సిటీతోపాటు పలు ప్రైవేటు విద్యాసంస్థలను కూడా మూసివేయించారు. ప్రభుత్వ, ఎయిడెడ్‌ పాఠశాలల్లో మెగాపీటీఎంలు జరుగుతుండటంతో ఆ పాఠశాలలను మూసివేయించేందుకు ప్రయత్నాలు చేయడంతో పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం కలెక్టరేట్‌ వద్ద రోడ్డుపై బైఠాయించేందుకు విద్యార్థి సంఘాలు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకొని పక్కకు పంపారు. ఈ సందర్భంగా విద్యార్థి, యువజన సంఘాల నాయకులు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా 155 ప్రశ్నపత్రాల లీకేజీలకు కారణమైన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో ఢిల్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఢిల్లీలో శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులపై లాఠీచార్జీ చేయడం దుర్మార్గమన్నారు. కేంద్రప్రభుత్వం తీసుకువచ్చిన నూతన జాతీయ విద్యావిధానం వల్ల విద్యావ్యవస్థ నిర్వీర్యమైందని మండిపడ్డారు. ఏడాదికి కోటి ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చిన మోదీ ప్రభుత్వం ఇప్పుడు మాట తప్పిందని విమర్శించారు. ప్రముఖ పర్యావరణవేత్త సోనం వాంగ్‌చుక్‌ విద్యార్థులకు మద్దతుగా 23రోజుల నుంచి ఆమరణదీక్ష చేస్తుంటే కనీసం ఆయనతో చర్చలు కూడా జరిపే తీరిక కేంద్రప్రభుత్వానికి లేదా? అని ప్రశ్నించారు. నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీని రద్దు చేసి ప్రభుత్వమే పరీక్షలు నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో విద్యార్థి, యువజన సంఘాల నాయకులు ఎల్‌.రాజశేఖర్‌, రాయపాటి జగదీష్‌, వీరాస్వామి, ఆర్‌.కరుణానిధి. కేఎఫ్‌బాబు, ఆర్‌.మరియబాబు, రాకేష్‌, కిరణ్‌, నితీష్‌కుమార్‌, కంకణాల రమాదేవి,రాజ్యలక్ష్మీ, బి.రఘరాం, ఎం.శ్రీకాంత్‌, అభిమన్యు, సోమేష్‌, సచిన్‌, రాజీవ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 25 , 2026 | 02:31 AM