ప్రతి సభ్యుడికీ ఒక్కో మండల పార్టీ బాధ్యత
ABN , Publish Date - Jan 25 , 2026 | 11:16 PM
టీడీపీ సంస్థాగత నిర్మాణంలో భాగంగా ఇటీవల నియమించిన పార్లమెంట్ నియోజకవర్గ కమిటీ కార్యాచరణ ప్రారంభించింది. ఆదివారం కనిగిరిలో పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు, శాసనసభ్యుడు డాక్టర్ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి తొలి సమావేశాన్ని నిర్వహించారు.
రే పు పార్లమెంట్ నియోజకవర్గ టీడీపీ కమిటీతో చంద్రబాబు భేటి
ముందస్తుగా కనిగిరిలో సమావేశం నిర్వహించిన అధ్యక్షుడు ఉగ్ర
క్రమంతప్పకుండా సమావేశాలు ఏర్పాటు చేయాలని నిర్ణయం
ఒంగోలు, జనవరి 25 (ఆంధ్రజ్యోతి) : టీడీపీ సంస్థాగత నిర్మాణంలో భాగంగా ఇటీవల నియమించిన పార్లమెంట్ నియోజకవర్గ కమిటీ కార్యాచరణ ప్రారంభించింది. ఆదివారం కనిగిరిలో పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు, శాసనసభ్యుడు డాక్టర్ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి తొలి సమావేశాన్ని నిర్వహించారు. రాష్ట్రంలోని అన్ని పార్లమెంట్ నియోజకవర్గ కమిటీలతో ఈ నెల 27న పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమావేశం కానున్నారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ సమావేశం జరగనుంది. ఆ రోజున ఒక్కొక్క కమిటీతో విడివిడిగా చంద్రబాబు మాట్లాడతారని సమాచారం. ఒంగోలు పార్లమెంట్ కమిటీ సభ్యులందరూ ఈనెల 27వ తేదీ ఉదయం 8.30 గంటలకు కేంద్ర కార్యాలయంలో అందుబాటులో ఉండాలన్న ఆదేశాలు నేతలకు వచ్చాయి. ఈ నేపథ్యంలో ముందస్తుగా కమిటీతో సమావేశాన్ని కనిగిరిలో అధ్యక్షుడు ఉగ్ర నిర్వహించారు. ఎక్కువ మం ది సభ్యులు కొత్తవారు కావడంతో సమావేశంలో పరిచయ కార్యక్రమానికి ప్రాధాన్యత ఇచ్చారు. అనంతరం భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. తన పనివిధానాన్ని సభ్యులకు స్పష్టంచేసిన డాక్టర్ ఉగ్ర తదనుగుణంగా ఆయా ప్రాంతాల్లో పార్టీ కార్యక్రమాల నిర్వహణపై ఇతర సభ్యులకు దిశానిర్దేశం చేశారు. వివిధ అంశాలపై చర్చించిన అనంతరం ప్రతి నెలాసమావేశం, మూడునెలలకు ఒకసారి జనరల్ బాడీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. అలాగే మండల పార్టీ కమిటీలను సమన్వయం చేసేందుకు ప్రతి సభ్యుడు ఒక మండల బాధ్యతను తీసుకోవాలని, త్వరలో ఎవరెవరు ఏ మండలం అనేది నిర్ణయించాలని తీర్మానించారు. కాగా పార్టీ నేతలను క్షేత్ర స్థాయిలో సమన్వయం చేస్తూ ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడం, పార్టీ బలోపేతం లక్ష్యంగా ప్రతి సభ్యుడు పనిచేయాలని ఉగ్ర స్పష్టంగా చెప్పారు. చంద్రబాబుతో జరగనున్న సమావేశానికి అందరూ హాజరుకావాలని నిర్ణయించారు. జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి కొఠారి నాగేశ్వరరావుతో పాటు పార్లమెంట్ కమిటీ సభ్యులు ఇంచుమించు అందరూ ఈ సమావేశంలో పాల్గొన్నారు.