Share News

బ్యాంక్‌లకు కుచ్చుటోపీ

ABN , Publish Date - Sep 23 , 2026 | 10:58 PM

అన్ని సక్రమంగా ఉంటేనే రుణాలు ఇచ్చేందుకు సవాలక్ష ప్రశ్నలు వేస్తూ రోజుల తరబడి తిప్పుకునే బ్యాంక్‌ అధికారులు నకిలీ బంగారానికి లక్షల రూపాయలు రుణం సులువుగా ఇవ్వడం పలు అనుమానాలకు తావిస్తోంది.

బ్యాంక్‌లకు కుచ్చుటోపీ

నకిలీ బంగారంతో రుణాలు

తెలియని స్వయం సహాయక సంఘాలకు రుణాలు

సిబ్బంది, అధికారుల పాత్ర పైనే అనుమానాలు

అధికారుల విచారణతో వెలుగులోకి

అద్దంకి, సెప్టెంబరు 23(ఆంధ్రజ్యోతి) : అన్ని సక్రమంగా ఉంటేనే రుణాలు ఇచ్చేందుకు సవాలక్ష ప్రశ్నలు వేస్తూ రోజుల తరబడి తిప్పుకునే బ్యాంక్‌ అధికారులు నకిలీ బంగారానికి లక్షల రూపాయలు రుణం సులువుగా ఇవ్వడం పలు అనుమానాలకు తావిస్తోంది. అదే సమయంలో స్థానికేతర స్వయం సహాయక సంఘాల సభ్యులకు కూడా రుణాలు మంజూరు చేయటం గమనార్హం. ఈ వ్యవహారంలో సంబంధిత బ్యాంక్‌ అధికారులు, సిబ్బంది, గోల్డ్‌ అప్రైజర్‌ల పాత్ర ఉందనేది ప్రతి ఒక్కరి నుంచి వినిపించే మాట.

తాజాగా సంతమాగులూరు మండలంలోని ఓ గ్రామంలో ఉన్న జాతీయ బ్యాంక్‌లో నకిలీ బంగారం పెట్టుకొని 70 లక్షల రూపాయల రుణం ఇచ్చారు. ఇదెలా సాధ్యమైందని ఖాతాదారులు ముక్కున వేలు వేసుకుంటున్నారు. దీని వెనుక సదరు బ్యాంక్‌లో పనిచేసే అప్రైజర్‌ పాత్ర ఉండి ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. అదే సమయంలో రుణం మంజూరు సమయంలో సంబంధిత బ్యాంక్‌ అధికారులు, సిబ్బంది పాత్ర ఉందా, లేదా అన్నది విచారణలో తేలాల్సి ఉంది. ఆడిట్‌ బృందం విచారణలో బయట పడినప్పటికీ సదరు బ్యాంక్‌ అధికారులకు పోలీసులకు ఫిర్యాదు చేయకుండా ఉండడం మరింత అనుమానాలను పెంచుతోంది. గతంలో మేదరమెట్లలోని ఓ బ్యాంక్‌లో కూడా నకిలీ బంగారం పెట్టి రుణాలు తీసుకున్న సంఘటనలు వెలుగు చూశాయి. ఇటీవల అద్దంకి పట్టణంలోని ఓ బ్యాంక్‌లో రుణం తీసుకునేందుకు నకిలీ బంగారం తీసుకు రాగా సదరు బ్యాంక్‌ అప్రైజర్‌ గుర్తించటంతో అక్కడ నుంచి జారుకున్నారు.


కందుకూరు మహిళలకు ఇక్కడ రుణం

అద్దంకి పట్టణంలో గత ఏడాది మెప్మా ఆధ్వర్యంలో కొన్ని బ్యాంక్‌ల నుంచి స్థానికేతరులకు రుణాలు ఇవ్వటం, ఆ రుణాలు చెల్లింపులు లేకపోవటంతో అధికారులు విచారించనగా కందుకూరు ప్రాంత మహిళలకు అద్దంకి మెప్మాలో స్వయం సహాయక సంఘాల సభ్యులుగా చేర్పించి రుణాలను కాజేసినట్లు తెలుస్తుంది. ఇందులో మెప్మా సిబ్బందితో పాటు ఆయా బ్యాంక్‌ల సిబ్బంది పాత్ర కూడా ఉండి ఉంటుదన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ఇప్పటికైనా బ్యాంక్‌ అధికారులు బోగస్‌ సభ్యులు, నకిలీ బంగారం విషయంలో బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటే భవిష్యత్‌లో ఇలాంటివి పునరావృతం కాకుండా ఉంటాయని పలువురు అభిప్రాయపడుతున్నారు.

అప్రైజర్‌కు బంధువేనా

నకిలీ బంగారం పేరుతో బ్యాంక్‌లకు కుచ్చుటోపీలు పెడుతూనే ఉన్నారు. సంతమాగులూరు మండలంలోని ఓ గ్రామంలో ఉన్న జాతీయ బ్యాంక్‌లో నకిలీ బంగారం పెట్టి రుణం తీసుకున్న వ్యక్తులు ఆ బ్యాంక్‌ అప్రైజర్‌కు బంధువులేనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇందులో అప్రైజర్‌ ఒక్కరే చేశారా, లేక బ్యాంక్‌ సిబ్బంది, అధికారులు సహకరించారా అన్న విషయం పోలీసులు, బ్యాంక్‌ ఉన్నతాధికారుల విచారణలో తేలాల్సి ఉంది.

Updated Date - Sep 23 , 2026 | 10:58 PM