జిల్లా అంతటా కరువు
ABN , Publish Date - Sep 26 , 2026 | 03:20 AM
జిల్లా అంతటా ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌లో తీవ్ర కరువు నెలకొంది. ఎల్‌నినో ప్రభావంతో ఎక్కడా వర్షాలు పడకపోవడంతో పంటలు సాగు కాని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో జిల్లా మొత్తాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించి తగు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాజాబాబు ప్రభుత్వాన్ని కోరారు.
తీవ్రంగా ఎల్‌నినో ప్రభావం
వర్షాలు లేవు, పంటలూ లేవు
18 మండలాల్లో అధికం.. 10 మండ లాల్లో మధ్యస్థం
ప్రభుత్వానికి నివేదించిన కలెక్టర్
ఒంగోలు, సెప్టెంబరు 25 (ఆంధ్రజ్యోతి) : జిల్లా అంతటా ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌లో తీవ్ర కరువు నెలకొంది. ఎల్‌నినో ప్రభావంతో ఎక్కడా వర్షాలు పడకపోవడంతో పంటలు సాగు కాని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో జిల్లా మొత్తాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించి తగు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాజాబాబు ప్రభుత్వాన్ని కోరారు. ఆ మేరకు మండలాల వారీ ఈ సీజన్‌లో నమోదైన వర్షపాతం, పంటల సాగు వివరాలు, వ్యవసాయ, ఉద్యాన, ఇతర శాఖల అధికారులు ఇచ్చిన నివేదికలను క్రోడీకరిస్తూ ప్రభుత్వానికి నివేదించారు. జిల్లాలో ఖరీఫ్ సీజన్ ఆరంభం నుంచే ఎల్‌నినో ప్రభావం అధికంగా చూపి వర్షాలు కురవకపోవ డంతో పంటల సాగు అడుగు ముందుకుపడ లేదు. జూన్ నుంచి సెప్టెంబరు వరకు జిల్లాలో 394.10 మి.మీ వర్షపాతం నమోదు కావాలి. ఇప్పటి వరకు సుమారు 170 మి.మీ మాత్రమే నమోదు కాగా అందులోనూ దాదాను 60 మి.మీ పైగా ఈ వారం రోజుల్లోనే కురిసింది. కీలకమైన మెట్ట పంటలు సాగు చేసే జూలై, ఆగస్టుల్లో జిల్లాలో చినుకు జాడ కరువైంది. ఆ రెండు నెలల్లో సగటున 81 నుంచి 86శాతం లోటు వర్షపాతం నమోదైంది. ఖరీఫ్ సాధారణ సాగు విస్తీర్ణం 55,774 హెక్టార్లలో కేవలం 10వేల హెక్టార్లలో కూడా పంటలు సాగు కాని పరిస్థితి నెలకొంది. రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి పరిస్థితి చాలా జిల్లాల్లో ఈనెల తొలిపక్షం వరకూ నెలకొంది. ఈ నేపథ్యంలో ఆయా జిల్లాల్లో కరువు పరిస్థితులను క్షేత్ర స్థాయిలో పరిశీలించి నివేదించాలని జిల్లా అధికారులను ఆదేశిస్తూ ప్రభుత్వం ఈనెల 18న ఉత్తర్వులు ఇచ్చింది. తదనుగుణంగా జిల్లాలో అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేశారు. ప్రధానంగా ఆయా మండలాల వారీ జూన్ 1 నుంచి ఆగస్టు 31 వరకు వర్షపాతం నమోదు, సాగు విస్తీర్ణం, దిగుబడి అంచనాలు, ఇతర పలు అంశాలను పరిశీలించి జిల్లా మొత్తం కరువు వాతావరణం ఉందని తేల్చారు. జిల్లాలో మొత్తం 28 మండలాలు ఉండగా 18 మండలాల్లో తీవ్ర కరువు, 10 మండలాల్లో మధ్యస్థాయిలో ఉన్నట్లు గుర్తించారు. ఆ మేరకు వ్యవసాయ, ఉద్యాన, ప్రణాళిక, రెవెన్యూ శాఖల అధికారులు గుర్తించి కలెక్టర్‌కు నివేదించారు. వాటన్నింటినీ పరిశీలించిన రాజాబాబు ప్రభుత్వానికి నివేదించారు. జిల్లా మొత్తాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించి తగు చర్యలు తీసుకోవాలని కోరారు.