Share News

అధికారులు తెచ్చిపెట్టిన తాగునీటి ఎద్దడి

ABN , Publish Date - Mar 12 , 2026 | 11:02 PM

దొనకొండ మండలంలో తాగునీటి సమస్య తీవ్రమైంది.. కాదు తీవ్రతరం చేశారు అనడం కరెక్టమో..! దాదాపు రెండు నెలలుగా మంచినీటి సరఫరా జరగకపోవటంతో గ్రామాల్లో ప్రజలు మంచినీళ్లు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

అధికారులు తెచ్చిపెట్టిన తాగునీటి ఎద్దడి
చందవరం-1 మంచినీటి పథకం

దొనకొండ మండలంలో రెండు నెలలుగా ఇబ్బందులు

ఆందోళన చెందుతున్న ప్రజలు

దొనకొండ, మార్చి 12(ఆంధ్రజ్యోతి) : మండలంలో తాగునీటి సమస్య తీవ్రమైంది.. కాదు తీవ్రతరం చేశారు అనడం కరెక్టమో..! దాదాపు రెండు నెలలుగా మంచినీటి సరఫరా జరగకపోవటంతో గ్రామాల్లో ప్రజలు మంచినీళ్లు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సమ్మర్‌ స్టోరేజీ ట్యాంక్‌ మరమ్మతుల పేరుతో అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా ఉన్న ఫళంగా తాగునీటి సరఫరాను నిలిపేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

దొనకొండ మండలంలో చందవరం-1, చందవరం-2, లక్ష్మీపురం మూడు మంచినీటి స్టోరేజీలు ఉన్నాయి. సొంత మండలంతోపాటు ఇతర మండలాల్లోని దాదాపు 190 గ్రామాల ప్రజలకు సైతం ఇక్కడ నుంచే మంచినీటి సరఫరా చేస్తున్నారు. ప్రజల దాహార్తి తీర్చేందుకు సాగర్‌ జలాలే ఆధారం. రోజూ నీటి సరఫరా కోసం ఎదురుచూస్తుంటారు. మండలంలోని 29 గ్రామాల ప్రజలకు సాగర్‌ జలాలు సరఫరా చేసే చందవరం-1 స్టోరేజీ నిర్మించి దాదాపు 44 ఏళ్లు పూర్తయ్యింది. దీంతో మంచినీటి పథకం స్టోరేజీ, సంపులు, పైప్‌లైన్లు, మోటార్లు మరమ్మతులతో నీటి సరఫరాకు తరచూ ఇబ్బందులు ఏర్పడుతున్నాయి.

ఈ ఏడాది జనవరి 20 నుంచి బంద్‌

ఇటీవల ప్రజాప్రభుత్వం చందవరం-1 మంచినీటి పథకం మరమ్మతులకు రూ.2.50 కోట్లు మంజూరు చేసింది. అధికారులు ఆ పనులు చేపట్టేందుకు జనవరి 20 నుంచి ఎటువంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా గ్రామాలకు మంచినీటి సరఫరాను పూర్తిగా నిలిపివేశారు. దొనకొండ మండల పరిషత్‌లో రూ.1.30 కోట్లు నిధులు మూలుగుతున్నా సంబంధిత అధికారి గ్రామాల్లో ప్రజల దాహార్తిని గుర్తించి ట్యాంకర్లు ఏర్పాటు చేయలేదు. చందవరం-1 స్టోరేజీ పరిధిలో ఇంకా ఎన్ని రోజులు పనులు జరుగుతాయి, యుద్ధప్రాతిపదికన పనులు జరుగుతున్నాయా, మంచినీటి సరఫరా ఎప్పుడు జరుగుతుంది, తమ సమస్య ఎప్పుడు తీరుతుందోననే ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ట్యాంకర్లు ద్వారా దొనకొండకు సాగర్‌ జలాలు సరఫరా జరిగేలా తక్షణ చర్యలు చేపట్టి తాగునీటి సమస్యను నివారించాలని ప్రజలు కోరుతున్నారు.


అధికారుల నిర్లక్ష్యంతో ఇబ్బందులు

షేక్‌ రసూల్‌, దొనకొండ

అధికారుల నిర్లక్ష్యంతో ఇప్పటికే రెండు నెలలుగా సాగర్‌ జలాలు సరఫరా కావడంలేదు. ఈక్రమంలో ప్రజలు తాగునీటికి ఇబ్బందులు పడుతున్నారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా దొనకొండ ప్రజలకు మంచినీటి కష్టాలు తప్పటం లేదు. అధికారులు మరో రెండు రోజుల్లో మంచినీటి సరఫరాను పునరుద్ధరించకుంటే ఆందోళన చేస్తాం.

సొంత నిధులతో ట్యాంకర్లు ఏర్పాటుచేశా

బొందల రాజు, వార్డు మెంబర్‌, దొనకొండ

మంచినీటి సరఫరా జరగక ప్రజలు ఇబ్బందులు పడుతుండటంతో నా సొంత నిధులతో దొనకొండలో ట్యాంకర్‌ ఏర్పాటుచేశా. నీటి సరఫరాను పునరుద్ధరించే వరకు ట్యాంకర్ల ద్వారా సాగర్‌ నీరు సరఫరా చేపట్టేలా అధికారులు చర్యలు చేపట్టాలి.

పది రోజుల్లో పనులు పూర్తవుతాయి

నారాయణస్వామి, ఆర్‌డబ్ల్యూఎస్‌, డీఈ, దర్శి

దొనకొండ మండలంలోని చందవరం-1 మంచినీటి స్టోరేజీలో మరమ్మతులు చేపట్టాం. మరో పది రోజుల్లో పూర్తిస్థాయిలో పనులు పూర్తిచేసి ప్రజలకు మంచినీటి ఇబ్బందులు లేకుండా చూస్తాం. నీటి సరఫరాను కొనసాగించేందుకు యుద్ధప్రాతిపదికన పనులు చేస్తున్నాం.

Updated Date - Mar 12 , 2026 | 11:02 PM