మొదలైన తాగునీటి ఇక్కట్లు
ABN , Publish Date - Apr 26 , 2026 | 02:39 AM
జిల్లాలోని మార్కాపురం, కనిగిరి, గిద్దలూరు, పొదిలి పట్టణాల్లో తాగునీటి ఇక్కట్లు మొదలయ్యాయి. వేసవి తీవ్రతతో అక్కడక్కడా బోర్లు మొరాయిస్తున్నాయి. గిద్దలూరులో మొత్తం 177 బోర్లు ఉండగా అందులో 9 పనిచేయడం లేదు.
పట్టణాల్లో ఇప్పటికే ట్యాంకర్లతో సరఫరా
మరో వారంలో పల్లెల్లోనూ ఇదే పరిస్థితి
ముందస్తు ఏర్పాట్లలో యంత్రాంగం
రూ. 64.01 లక్షలు అవసరమని ప్రతిపాదనలు
మార్కాపురం, ఏప్రిల్ 25 (ఆంధ్ర జ్యోతి): జిల్లాలోని మార్కాపురం, కనిగిరి, గిద్దలూరు, పొదిలి పట్టణాల్లో తాగునీటి ఇక్కట్లు మొదలయ్యాయి. వేసవి తీవ్రతతో అక్కడక్కడా బోర్లు మొరాయిస్తున్నాయి. గిద్దలూరులో మొత్తం 177 బోర్లు ఉండగా అందులో 9 పనిచేయడం లేదు. దీంతో శివారు కాలనీల్లోని ప్రజలకు నీటి కష్టాలు ప్రారంభమయ్యాయి. పురపాలక సంఘం ఆధ్వర్యంలో ప్రస్తుతం రాచర్ల గేటు, ఎస్టీ కాలనీ తదితర ప్రాంతాలకు రోజుకు 30 ట్రిప్పుల నీటిని ట్యాంకర్లతో సరఫరా చేస్తున్నారు. రాబోయే రోజుల్లో ట్యాంకర్ల సంఖ్యను ఇంకా పెంచాల్సి వచ్చే అవకాశం కనిపిస్తోంది. కనిగిరిలో నీటి సమస్య జటిలంగా మారుతోంది. మార్చికి ముందు దాదాపు 120 ట్రిప్పుల నీరు ట్యాంకర్లతో సరఫరా చేశారు. ప్రస్తుతం ఎండల తీవ్రత పెరుగుతున్న దృష్ట్యా ఇక్కడ తాగునీటి కోసం పురపాలక సంఘం ఆధ్వర్యంలో ఇప్పుడు ప్రతిరోజూ 160 ట్రిప్పుల నీటిని సరఫరా చేస్తున్నారు. ఈ సంఖ్య ఇంకా పెంచాల్సి వస్తుందని అధికారులు చెబుతున్నారు. భూగర్భ జలాలు తగ్గుముఖం పడుతున్న గ్రామాలు కూడా కనిగిరి ప్రాంతంలోనే ఎక్కువగా ఉన్నాయి. దీంతో ఆ గ్రామాల్లో నీటి ఎద్దడి ముప్పు పొంచి ఉందని అధికారులు భావిస్తున్నారు.
పొదిలిలో తీవ్రమవుతున్న సమస్య
పొదిలి పట్టణంలో ఇప్పటికే సాగర్ నీటిని పదిరోజులకొకసారి సరఫరా చేస్తున్నారు. నీటి అవసరం పెరిగి ప్రజలు సమీప పొలాలు, ఇతర ప్రాంతాల నుంచి ఆటోలు, బైకులపై తెచ్చుకుంటున్నారు. రోజురోజుకూ సమస్య తీవ్రమవుతోంది. ఈనేపథ్యంలో సమస్య ఉన్న ప్రాంతాలకు ట్యాంకర్లతో సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉన్నామని మునిసిపల్ అధికారులు చెబుతున్నారు. మార్కాపురంలో మాత్రం నీటి సమస్య ఉత్పన్నమయ్యే అవకాశం చాలా తక్కువగా కనిపిస్తోంది. దూపాడు ఎస్‌ఎస్ ట్యాంకులో సరిపడా సాగర్ నీరు ఉంది. బోర్లు మొత్తం పనిచేస్తుండటంతో పట్టణ ప్రజలకు అవసరం మేరకు నీరు అందుతోంది. ప్రస్తుతం సాగర్ జలాలను మూడురోజులకొకసారి సరఫరా చేస్తున్నారు. దానిని రెండు రోజులకొకసారి ఇవ్వాలని ప్రజలు కోరుతున్నారు. అందకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని, అక్కడక్కడా చేస్తున్న పైపులైను మరమ్మతులు పూర్తికాగానే రెండురోజులకొకసారి సాగర్ నీరు అందిస్తామని అధికారులు చెబుతున్నారు.
సమస్య ఉత్పన్నమవుతుందని గుర్తించిన గ్రామాలు ఇవే..
జిల్లాలో గ్రామీణ నీటిపారుదల శాఖ అధికారులు సర్వే నిర్వహించి మొత్తం 4 మండలాల్లోని 24 గ్రామాల్లో నీటి ఎద్దడి తలెత్తే అవకాశం ఉన్నట్లు గుర్తించారు. ఆ గ్రామాల్లో తాగునీటి అవసరాలు తీర్చేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్ల కోసం రాబోయే మూడు నెలలకు రూ.64.01 లక్షలు అవసరమని నివేదిక తయారు చేశారు. వాటిలో మార్కాపురం మండలంలో రాజుపాలెం, డి.యాచవరం, గజ్జలకొండ, పడమటిపల్లి ఉన్నాయి. పొదిలి మండలంలో ఈగలపాడు, జువ్వలేరు, దొండ్లేరు, కొండాయపాలెం, సలకనూతల, గురుగుపాడు, మల్లవరం, ఓబులక్కపల్లి, తుమ్మగుంట, రామాపురం, సూదనగుంట, తలమళ్ల గ్రామాల్లో నీటి ఎద్దడి ఎదురయ్యే అవకాశం ఉంది. కొనకనమిట్ల మండలంలో గనివానిపాడు, గొట్లగట్టు, బసవాపురం, మునగపాడు, నాగరాజుకుంట, నాగిరెడ్డిపల్లె, తర్లుపాడు మండలంలో పోతలపాడు, గానుగపెంట గ్రామాల్లో నీటి సమస్య ఉత్పన్నమవుతుందని అధికారులు గుర్తించారు. ఇప్పుడు కనిగిరి, ఎర్రగొండపాలెం నియోజకవర్గాల్లో కూడా కొన్నిచోట్ల సమస్య ఉత్పన్నమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అధికారులు మరోసారి సర్వే చేపట్టి సమస్య ఉన్న గ్రామాలకు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలని ప్రజలు కోరుతున్నారు.