Share News

యూరియాపై ఇబ్బందులు తలెత్తనివ్వొద్దు

ABN , Publish Date - Jan 20 , 2026 | 11:50 PM

: రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తనివ్వకుండా యూరియా సరఫరాపై దృష్టి సారించాలని కలెక్టర్‌ రాజాబాబు ఆదేశించారు. ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

యూరియాపై ఇబ్బందులు తలెత్తనివ్వొద్దు

కలెక్టర్‌ రాజాబాబు ఆదేశం

ఒంగోలు కలెక్టరేట్‌, జనవరి 20 (ఆంధ్రజ్యోతి) : రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తనివ్వకుండా యూరియా సరఫరాపై దృష్టి సారించాలని కలెక్టర్‌ రాజాబాబు ఆదేశించారు. ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. స్థానిక కలెక్టరేట్‌ నుంచి మంగళవారం మండల స్థాయి అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్‌ మాట్లాడారు. రైతు సేవా కేంద్రాలు, సొసైటీలు, ప్రైవేటు విక్రయదారుల ద్వారా పూర్తి స్థాయిలో రైతులకు అవసరమైన మేరకు యూరియా, ఇతర ఎరువులను ప్రభుత్వం అందుబాటులో ఉంచిందన్నారు. ఆ ఎరువులు రైతులకు చేరడంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పర్యవేక్షించాలని విలేజ్‌ అగ్రికల్చర్‌ అసిస్టెంట్లకు దిశా నిర్దేశం చేశారు. రైతులకు ఎరువులు అందించిన ఫొటోలను పంపించాలని కలెక్టర్‌ ఆదేశించారు. అధిక ధరలకు ఎక్కడైనా విక్రయించినా, కృత్రిమ కొరత సృష్టించినా సంబంధిత బాధ్యులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. పశ్చిమ ప్రకాశం ప్రాంతాన్ని(మార్కాపురంజిల్లా) హార్టికల్చర్‌ హబ్‌గా మార్చాలని ప్రభుత్వం దృష్టి సారించిందున క్షేత్ర స్థాయిలో ఆ దిశగా చర్యలను ముమ్మరం చేయాలన్నారు. పశుసంవర్థక, మత్స్యశాఖల ద్వారా ప్రభుత్వం నిర్దేశించిన అభివృద్ధి సాధించేలా ప్రత్యేక దృష్టి సారించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. విశాఖపట్నంలో పెట్టుబడిదారుల సదస్సులో కుదిరిన ఒప్పందాల మేరకు త్వరగా పరిశ్రమలు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఎన్‌టీఆర్‌ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీలో పాల్గొనే అధికారులు, సిబ్బంది ప్రవర్తనే కీలకమని, పెన్షన్‌దారులతో మర్యాదపూర్వకంగా మాట్లాడాలని హితవుపలికారు. పెన్షన్‌ ఇచ్చినందుకు లంచం తీసుకున్నట్లు తెలిస్తే బాధ్యులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం అంశాల వారీగా ఆయా శాఖల అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయశాఖ అధికారి శ్రీనివాసరావు, సీపీవో సుధాకర్‌రెడ్డి, మార్క్‌ఫెడ్‌ మేనేజర్‌ హరికృష్ణ, మర్కెటింగ్‌ శాఖ సహాయ సంచాలకులు వరలక్ష్మి, ఏపీఎంఐపీ పీడీ శ్రీనివాసులు, ప్రకృతి సేద్యం డీపీఎం సుభాషిణి, జిల్లా పరిశ్రమల కేంద్రం మేనేజర్‌ శ్రీనివాసరావు, ఉద్యానవనశాఖ అధికారి గోపీచంద్‌, జిల్లా పంచాయతీ అధికారి ఎం. వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.

Updated Date - Jan 20 , 2026 | 11:50 PM