Share News

అలా వదలొద్దమ్మా!

ABN , Publish Date - Jul 18 , 2026 | 02:00 AM

అమ్మ ఒడిలో బోసినవ్వులతో ఆడుకోవాల్సిన పసికందులు అనాథలవుతున్నారు. నవమాసాలు మోసి తీరా కన్న తర్వాత కొందరు తల్లులు నిర్ధాక్షిణ్యంగా ఆ బిడ్డలను ముళ్లపొదల్లో, సైడు కాలువల్లో, శివారుల్లో వదిలేసిపోతున్నారు.

అలా వదలొద్దమ్మా!
ఒంగోలులోని బాల సదనం (ఇన్‌సెట్‌లో) ముండ్లమూరు గ్రామ శివారులో వదిలి వెళ్లిన పసికందు (ఫైల్‌)

ముళ్లపొదల్లో, నిర్జన ప్రదేశాలలో పసికందులు

అనాథలుగా శిశుగృహాలకు చిన్నారులు

జిల్లాలో ఇటీవల చోటుచేసుకుంటున్న వరుస ఘటనలు

అక్కున చేర్చుకుంటున్న చైల్డ్‌లైన్‌.. బాలల సంరక్షణ అధికారులు

పిల్లల దత్తత కోసం సంతానం లేని దంపతుల ఎదురుచూపులు

అమ్మ ఒడిలో బోసినవ్వులతో ఆడుకోవాల్సిన పసికందులు అనాథలవుతున్నారు. నవమాసాలు మోసి తీరా కన్న తర్వాత కొందరు తల్లులు నిర్ధాక్షిణ్యంగా ఆ బిడ్డలను ముళ్లపొదల్లో, సైడు కాలువల్లో, శివారుల్లో వదిలేసిపోతున్నారు. అలాంటి శిశువుల్లో కొందరు పాల కోసం ఏడ్చి ఏడ్చి ప్రాణాలు వదులుతున్నారు. మరికొందరు ఆసుపత్రులకు చేరుతున్నారు. ఆడపిల్ల పుట్టిందనో.. అనారోగ్యంతో ఉందనో, ఇతరత్రా కారణాలతోనో అర్ధంతరంగా పిల్లలను వదిలేసి వెళుతున్న సందర్భాలు ఇటీవల కాలంలో జిల్లాలో వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. అలా వదిలేయకుండా తమను సంప్రదిస్తే చిన్నారులను సంరక్షిస్తామని అధికారులు చెబుతున్నారు.

ఒంగోలు కార్పొరేషన్‌, జూలై 17 (ఆంధ్రజ్యోతి): అభం శుభం తెలియని చిన్నారులు అనాథలుగా మిగిలిపోతు న్నారు. కడుపున పుట్టిన బిడ్డలను కొందరు మానవత్వం లేకుండా నిర్ధాక్షిణ్యంగా ముళ్లపొదల్లో, కాలువల పక్కన వదిలేసి వెళుతున్నారు. చిన్నారులను చూసిన జనం అయ్యో పాపం అంటూ అక్కున చేర్చుకుంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ యంత్రాంగం ప్రత్యేక దృష్టిసారించి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా,సరైన అవగా హన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంతేకా కుండా ఆర్థికంగా స్థితిమంతులైన ఎంతోమంది దంపతు లకు సంతానయోగం లేకపోవడంతో చిన్నారుల దత్తత కోసం ఎదురుచూస్తున్నారు. అలాంటి వారికి ఆ బాలలను అప్పగిస్తే ఉజ్వల భవిష్యత్‌ఇచ్చిన వారవుతారు.

పలకరిస్తే కన్నీరే సమాధానం..

ఉమ్మడి ప్రకాశం జిల్లాలో గతేడాది మే నుంచి ఇప్పటివరకు సుమారు 11 మందికిపైగా పిల్లలను ఒంటరిగా వదిలేసి వెళ్లిన ఘటనలు చోటుచేసుకున్నాయి. ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే బాలసదన్‌, శిశుగృహంలో అధికారుల సంరక్షణలో ఉన్న చిన్నారులను పలకరిస్తే చాలు కన్నీరే సమాధానమవుతోంది. కనీసం లోకం తెలియని వయస్సు, కన్నవారెవరో తెలియని దీనస్థితిలో ఉన్న ఆ చిన్నా రులు అక్కున చేర్చుకునే వారి కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు.

ఏడాదిలో ఎనిమిది ఘటనలు

2025 మే 29న కొత్తపట్నం మండలం పల్లెపాలెంకు చెందిన పొన్న పోలయ్య భార్య చనిపోవడంతో నాలుగేళ్ల బాబును ఒంగోలు రిమ్స్‌లో వదిలి వెళ్లిపోయాడు.

2025 ఆగస్టు 21న కొత్తపట్నం మండలానికి చెందిన మైనర్‌ బాలిక గర్భం దాల్చి మగశిశువుకు జన్మనిచ్చింది. శిశును రోడ్డు పక్కన పడవేసి వెళ్లిపోయింది.

2025 సెప్టెంబరు 24న ఒంగోలు జీజీహెచ్‌లో ఐదు రోజుల పసికందును అమ్మడానికి ప్రయత్నించడంతో అక్కడ ఉన్న వారు అడ్డుకొన్నారు. పాపను శిశుగృహానికి అప్పగించారు.

ఫ 2025 అక్టోబరు 23న మద్దిపాడు మండలంలో మూడేళ్ల ఆడపిల్లను గుర్తుతెలియని వ్యక్తులు రోడ్డు పక్కన వదిలి వెళ్లిపోయారు. అధికారులు ఆ పాపను ఒంగోలు శిశుగృహానికి తరలించారు

2026 మే 1న మర్రిపూడిలో తల్లిదండ్రులు ఇద్దరు మరణించడంతో ఇద్దరు మగపిల్లలు, ఒక ఆడపిల్ల ప్రస్తుతం బాలసదన్‌లో అధికారుల సంరక్షణలో ఉన్నారు.

ఫ 2026 జూన్‌ 15న ఒంగోలు రైల్వే స్టేషన్‌లో నాలుగేళ్ల బాబును వదిలి వెళ్లిపోయారు. సమాచారం అందుకున్న డీసీపీవో ఆధ్వర్యంలో శిశుగృహకు తరలించారు.

2026 జూన్‌ 26న సంతమాగులూరు మండలం, కొప్పరామ గ్రామం వద్ద రెండేళ్ల వయస్సు కలిగిన ఆడపిల్లను తల్లిదండ్రులే వదిలి వెళ్లిపోవడంతో ప్రస్తుతం శిశుగృహంలో అధికారుల సంరక్షణలో ఉంది.

2026 జూలై 12న ముండ్లమూరు గ్రామ శివారుల్లో ఒక నెల వయస్సు కలిగిన పాపన ముళ్లపొదల్లో వదిలి వెళ్లిపోయారు. స్థానికులు గుర్తించి అధికారులకు సమాచారం ఇచ్చారు. ఆ పాపకు ఒంగోలు జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందింది.

తల్లిదండ్రులు ఒకసారి ఆలోచించాలి

బీవీ సాగర్‌, చైల్డ్‌లైన్‌ ప్రతినిధి

ఇలాంటి ఘటనలు బాధాకరం. చైల్డ్‌లైన్‌ సంస్థ ద్వారా అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా అనారోగ్య సమస్యలతో పుట్టిన పిల్లల ఆరోగ్యం బాగు చేయించే స్థోమత లేక నిర్మానుష్య ప్రదేశాలలో వదిలేస్తున్నట్లు మేము గుర్తించా. కొందరు పెళ్లి కాకముందు గర్భం దాల్చి పుట్టినబిడ్డను సమాజానికి చూపించలేక వదిలేస్తున్నారు. మరికొంతమంది తల్లిదండ్రులు తమ ఆరోగ్య, ఆర్ధిక పరిస్థితి బాగా లేక వదిలి వెళ్లిపోతున్న సందర్భాలు ఉన్నాయి ఏమైనప్పటికీ పసిబిడ్డలను ఇలా నిర్దాక్షిణ్యంగా వదిలేయడం సరికాదు.

అలా చేయవద్దు.. నేరుగా మాకు అప్పగించండి

పి. దినేష్‌కుమార్‌, జిల్లా బాలల సంరక్షణ అధికారి

కారణాలు ఏవైనా పసిపిల్లలను నిర్జన ప్రదేశాలలో వదిలి వేయవద్దు. మీకు భారం అనిపించినప్పుడు ఒంగోలులోని రామగనర్‌ 3వ లైన్‌లోని శిశుగృహానికి తెలియజేయండి. మేమే స్వయంగా వారిని తీసుకుని సంరక్షిస్తాం. అనారోగ్యంతో ఉన్న శిశువులకు అవసరమైన వైద్యం అందిస్తాం. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతాం. ఎవరికీ ఎలాంటి ఇబ్బంది ఉండదు. అలా నిర్లక్ష్యంగా, కఠినంగా వ్యవహరించి చిన్నారులను ముళ్లపొదల్లోనో, రోడ్డు పక్కన పడవేయవద్దు. బాలల సంరక్షణ ఆధ్వర్యంలో రైల్వేస్టేషన్‌లు, బస్టాండ్‌లలో అవసరమైన కేంద్రాలను ఏర్పాటుచేశాం. వాటిని ఉపయోగించుకోండి. అలాగే దత్తత తీసుకోవాలనుకునేవారు సంప్రదిస్తే ప్రభుత్వ నిబంధనల ప్రకారం, వారి స్థితిగతులు, ఆర్ధిక పరిస్థితులను పరిశీలించి ఇచ్చే అవకాశ ఉంది.

Updated Date - Jul 18 , 2026 | 02:00 AM