ఏమార్చారు!
ABN , Publish Date - Nov 12 , 2026 | 02:32 AM
దొనకొండ మండలంలో వెబ్‌ల్యాండ్ రికార్డుల ట్యాంపరింగ్ రాష్ట్రంలోనే సంచలనంగా మారింది. రెండు గ్రామాల్లో తహసీల్దార్ కార్యాలయంతో ఎటువంటి ప్రమేయం లేకుండా భూములకు చెందిన వెబ్‌ల్యాండ్ రికార్డులను ట్యాంపరింగ్ చేశారు.
సంచలనం సృష్టిస్తున్న దొనకొండ మోసం
వెబ్‌ల్యాండ్‌లో దర్జాగా భూముల
రికార్డులు ట్యాంపరింగ్
తహసీల్దార్ కార్యాలయంతో ప్రమేయం లేకుండా అక్రమాలు
సీఐడీ విచారణలో వెలుగులోకి వ్యవహారాలు
లోతుగా దర్యాప్తు చేస్తే మరిన్ని వచ్చే అవకాశం
దొనకొండ మండలంలో వెబ్‌ల్యాండ్ రికార్డుల ట్యాంపరింగ్ రాష్ట్రంలోనే సంచలనంగా మారింది. రెండు గ్రామాల్లో తహసీల్దార్ కార్యాలయంతో ఎటువంటి ప్రమేయం లేకుండా భూములకు చెందిన వెబ్‌ల్యాండ్ రికార్డులను ట్యాంపరింగ్ చేశారు. బాధిత రైతులు టీడీపీ ఇన్‌చార్జి లక్ష్మికి ఫిర్యాదు చేయడంతో మోసం గుట్టురట్టు అయ్యింది. లక్ష్మి జాయింట్ కలెక్టర్‌ను కలిసి ఫిర్యాదు చేయడంతో సీసీఎల్‌ఏ దృష్టికి తీసుకెళ్లారు. ఆ మేరకు సీఐడీకి కేసు అప్పగించారు. వారు విచారణ చేపట్టి నిందితులను పట్టుకున్నారు. ఈ వ్యవహారంలో భారీగా డబ్బులు చేతులు మారాయి. దీనిపై లోతైన దర్యాప్తు చేస్తే అనేక అక్రమాలు వెలుగులోకి వచ్చే అవకాశముంది.
దొనకొండ, నవంబరు 11 (ఆంధ్రజ్యోతి) : ఇదో రకం భూమోసం. స్థానికం కన్నా రాష్ట్రస్థాయిలో అయితే ఎవరూ గుర్తించరన్న దురాలోచనతో ఏకంగా వెబ్‌ల్యాండ్ ట్యాంపరింగ్‌కే పాల్పడ్డారు. ఈ ఘటన ప్రస్తుతం అంతటా చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వం రైతుల భూరికార్డులను డిజిటలైజ్ చేసి వెబ్‌ల్యాండ్‌లో పొందుపర్చి, దానికి చట్టబద్ధత కల్పించింది. ఇందులోని రికార్డులనే ప్రామాణికంగా తీసుకోవాలని దిశానిర్దేశం చేసింది. అయితే మండలంలోని లక్ష్మీపురం గ్రామానికి చెందిన వడ్లమూడి ఏడుకొండలు తన కుటుంబ సభ్యులకు చెందిన భూమిని అక్రమంగా తన పేరు మీద ఆన్‌లైన్ చేయించుకోవాలని భావించాడు. అందుకు స్నేహితుడి సహకారంతో విజయవాడ ఎన్‌ఐసీలో ఔట్‌సోర్సింగ్ పద్ధతిపై వెబ్‌ల్యాండ్ జూనియర్ డెవలపర్‌గా పనిచేసే ఆర్.సాయికుమార్, విజయవాడ సీడీఎంఏలో ఔట్‌సోర్సింగ్ డేటా ఎంట్రీ ఆపరేటర్‌గా పనిచేస్తున్న వి.వెంకటరావు, అన్న క్యాంటీన్ ప్రాజెక్టు టెక్నికల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న షేక్ బాషాలను సంప్రదించాడు. వెబ్‌ల్యాండ్‌లో రికార్డులు ట్యాంపరింగ్ చేసేందుకు లక్షలు ముట్టజెప్పేలా ఒప్పందం కుదుర్చుకున్నారు.
ట్యాంపరింగ్ చేసి రిజిస్ర్టేషన్లు పూర్తి
ఈ ముఠా సభ్యులు విజయవాడ నేషనల్ ఇన్‌ఫర్మేషన్ సెంటర్ (ఎన్‌ఐసీ) అధికారి లాగిన్ క్రెడెన్షియల్‌ను అక్రమంగా ఉపయోగించి దర్జాగా భూముల డేటాబే్‌సను ట్యాంపరింగ్ చేశారు. ఈ నెట్‌వర్క్ ద్వారా ఇండ్లచెరువు గ్రామంలోని ఎల్‌పీఎం నెం.139, పాత సర్వేనెంబర్ 30-2లో 2.63 ఎకరాలు, ఎల్‌పీఎం నెం. 140, పాత సర్వేనెంబర్ 30-3లో 0-79 సెంట్లు, ఎల్‌పీఎం నెం.215, పాత సర్వేనెంబర్ 32-4లో 2.09 ఎకరాలు, లక్ష్మీపురంలో ఎల్‌పీఎం నెం. 86, పాత సర్వేనెంబర్ 165లో 1.03 ఎకరాలు మొత్తం 6.55 ఎకరాలకు చెందిన భూముల వెబ్‌ల్యాండ్ డేటాబేస్ ట్యాంపరింగ్ చేసి రికార్డుల్లో పేర్లు మార్పులు చేసి ఆపై రిజిస్ర్టేషన్లు సైతం చేసినట్లు సమాచారం.
30మంది పేర్లు మార్పు
ఈ వెబ్‌ల్యాండ్ ట్యాంపరింగ్ అంతటితో ఆపకుండా ఆన్‌లైన్‌లో ఇతరులు, ఇబ్బందికర భూములుగా ఉన్న దాదాపు 30మంది వరకు పేర్లు మార్పులు చేశారు. ఇదే విషయాన్ని నిందితుడు ఏడుకొండలు సీఐడీ దర్యాప్తులో వెల్లడించారు. వెబ్‌ల్యాండ్ ట్యాంపరింగ్‌పై లోతుగా దర్యాప్తు చేపడితే అనేక గ్రామాల్లో పట్టాభూములతో పాటు అసైన్‌మెంట్ భూముల్లో సైతం జరిగిన అక్రమాలు భారీగా వెలుగులోకి వస్తాయని, ఉన్నతాధికారులు ఆ దిశగా దర్యాప్తు చేపట్టి బాధితులకు న్యాయం చేయాలని ప్రజలు కోరుతున్నారు.
డాక్టర్ లక్ష్మి చొరవతో అక్రమాలు వెలుగులోకి...
కుటుంబానికి ఆధారంగా ఉన్న భూమిని అక్రమం గా కాజేశారని, తమకు న్యాయం చేయాలని ఇండ్లచెరువుకు చెందిన గోరా అంకమ్మ కుటుంబ సభ్యులు రెండు నెలల క్రితం ఆ గ్రామానికి వెళ్లిన టీడీపీ దర్శి నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే స్పందించిన డాక్టర్ లక్ష్మి బాధితులను స్వయంగా జాయింట్ కలెక్టర్ వద్దకు తీసుకెళ్లి వెబ్‌ల్యాండ్‌లో చోటుచేసుకున్న అక్రమాలను వివరించి న్యాయం చేయాలని కోరారు. స్పందించిన జేసీ చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ర్టేషన్(సీసీఎల్‌ఏ) దృష్టికి తీసుకెళ్లారు. వెబ్‌ల్యాండ్ ట్యాంపరింగ్‌పై పూర్తి విచారణ చేపట్టాలని సీసీఎల్‌ఏ కమిషనర్ సీఐడీకి ఉత్తర్వులు జారీచేశారు. రంగంలోకి దిగిన సీఐడీ పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి రికార్డుల ట్యాంపరింగ్‌కు పాల్పడిన ఏడుకొండలు, ఆర్.సాయికుమార్, వెంకటరావు, షేక్ బాషలను అరెస్టు చేసింది.