డాక్యుమెంట్ రైటర్ల పెన్‌డౌన్
ABN , Publish Date - Jul 21 , 2026 | 03:08 AM
స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలో (ఆర్‌ఎస్‌కే) సేవా కేంద్రాలు ఏర్పాటు చేయడాన్ని నిరసిస్తూ జిల్లాలోని దస్తావేజు లేఖరులు సోమవారం పెన్‌డౌన్ కార్యక్రమం చేపట్టారు. దీంతో అన్ని చోట్లా రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి.
జిల్లావ్యాప్తంగా నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు
ఒంగోలు క్రైం, జూలై 20 (ఆంధ్రజ్యోతి): స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలో (ఆర్‌ఎస్‌కే) సేవా కేంద్రాలు ఏర్పాటు చేయడాన్ని నిరసిస్తూ జిల్లాలోని దస్తావేజు లేఖరులు సోమవారం పెన్‌డౌన్ కార్యక్రమం చేపట్టారు. దీంతో అన్ని చోట్లా రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. అరకొర లావాదేవీలు మాత్రమే జరిగాయి. ఒంగోలు రిజిస్ర్టార్ కార్యాలయం వద్ద జిల్లా దస్తావేజు లేఖరుల సంఘం అధ్యక్షుడు మోపర్తి హరిబాబు ఆఽధ్వర్యంలో డాక్యుమెంట్ రైటర్లు జాయింట్ రిజిస్ర్టార్లు శ్రీనివాసరావు, రాంబాబులను కలిసి వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వం స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్లు శాఖను ప్రైవేటుపరం చేసి ఆర్‌ఎస్‌కేలు ఏర్పాటుచేయడంతో తమ జీవనోపాధి దెబ్బతింటుందని పేర్కొన్నారు. ఏళ్లతరబడి తాము డాక్యుమెంటు రైటర్ల వృత్తిలో ఉంటున్నామని ఆర్‌ఎస్‌కేల ఏర్పాటుతో తమ కుటుంబాలు వీధిన పడుతాయన్నారు. రిజిస్ట్రేషన్ శాఖలో ప్రవేశపెట్టనున్న పీపీపీ విధానంతో ప్రజలకు సంబంధించిన డేటా అంతా ప్రైవేటుపరం అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర దస్తావేజు సంఘం నాయకులు పెళ్లూరి నరసింహారావు, జిల్లా నాయకులు ఎం.నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.