టీచర్ల మీదే దాడిచేస్తారా?
ABN , Publish Date - Sep 22 , 2026 | 11:30 PM
‘ఉపాధ్యాయుల మీద దాడిచేస్తారా? ప్రజాస్వామ్యాన్ని గౌరవించి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఇన్నాళ్లు ఊరకుంది. ఖబడ్దార్... వైసీపీ నాయకులు, వారి గూండాల తోకలు కట్ చేసి లోపలేస్తాం’ అని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు హెచ్చరించారు.
ఖబడ్దార్.. తోక కట్‌చేసి లోపలేస్తాం
వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు హెచ్చరిక
కొండపి, సెప్టెంబరు 22 (ఆంధ్రజ్యోతి): ‘ఉపాధ్యాయుల మీద దాడిచేస్తారా? ప్రజాస్వామ్యాన్ని గౌరవించి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఇన్నాళ్లు ఊరకుంది. ఖబడ్దార్... వైసీపీ నాయకులు, వారి గూండాల తోకలు కట్ చేసి లోపలేస్తాం’ అని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు హెచ్చరించారు. కొండపి మండలం పెదకండ్లగుంట గ్రామంలో మంగళవారం ఆయన దివంగత ఎన్టీఆర్, దివంగత మంత్రి దామచర్ల ఆంజనేయులు విగ్రహాలను మంత్రి డోలా శ్రీబాలవీరాంజనేయస్వామితో కలిసి ఆవిష్కరించారు. ఈసందర్భంగా జరిగిన సభలో అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. వైసీపీ అధినేత దుర్మార్గాలు, నేరాలు, ఘోరాలు చేసుకుంటూ.. కులం, ప్రాంతం, వర్గాల పేరుతో రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తూ ముఖ్యమంత్రిగా వ్యవహరించాడని విమర్శించారు. ప్రతిపక్ష పార్టీగా కూడా అవే నేరాలను ప్రేరేపిస్తున్నాడని అచ్చెన్న ధ్వజమెత్తారు. ఆపార్టీ ముసుగు లేకపోతే జగన్ ఏమిటో? అందరికీ తెలుస్తుందన్నారు. దేశంలోనే అతిపెద్ద లిక్కర్ స్కాం రాష్ట్రంలో జగన్ హయాంలో జరిగిందన్నారు.
తల్లిచెల్లిని బజారుకీడ్చిందెవరు
‘రూ.3,600 కోట్లు నీవు తినేశావని నేను చెప్తున్నా. నీది రాజకీయ పార్టీ అయితే, నీవు రాజకీయ నాయకుడివి అయితే పత్రికాముఖంగా సమాధానం చెప్పాలని మంత్రి నిలదీశారు. బాబాయ్‌ను గొడ్డలితో చంపింది ఎవరు? తల్లిని, చెల్లిని బజారుకు ఈడ్చింది ఎందుకు? ఒక రాజకీయ పార్టీగా, ఆపార్టీకి అధ్యక్షుడిగా నీవు భావిస్తే సమాధానం చెప్పు’ అని అచ్చెన్న సవాల్ చేశారు. డీఎస్సీపై జగన్ అసత్య ప్రచారాలు చేస్తున్నాడని అచ్చెన్న విమర్శించారు. ‘2019 ఎన్నికల్లో మీరు ఓట్లేయండి, మద్య నిషేధం చేస్తాను అని జగన్ అన్నాడు. 2024 ఎన్నికలకు మద్య నిషేధం చేయనిదే ఓట్లు అడగనని గడచిన ఎన్నికల ముందు చెప్పాడు. దుర్మార్గంగా మద్యం వ్యాపారం చేసి అతిపెద్ద లిక్కర్ స్కాం చేశాడు. కళ్లు బైర్లు కమ్మే స్కాం చేసిన క్రిమినల్ జగన్’ అని అచ్చెన్నాయుడు అన్నారు. అబద్ధాలు, అసత్యాలతో ఎంతోకాలం పార్టీ నిలబడదన్న విషయాన్ని అందరూ గ్రహించాలని, దుర్మార్గుడి దురాగతాలను ప్రజలకు తెలియజేయాలని టీడీపీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ‘ప్రజలు కూడా గమనించాలి, చిన్నపామునైనా పెద్ద కర్రతో కొట్టాలి. గొడ్డలి పార్టీని ఏముందిలే అని వదిలేస్తే కుదరదు. వెయ్యి అడుగుల గోతిలో పూడ్చిపెట్టాలి’ అని ప్రజలకు పిలుపునిచ్చారు. గొడ్డలి పార్టీని ఆదరిస్తే రాష్ట్రానికి, భావితరాలకు నష్టం జరుగుతుందని మంత్రి అచ్చెన్న ప్రజలను వివరించారు.