నామినేషన్ల ప్రక్రియలో అలక్ష్యం వద్దు
ABN , Publish Date - Oct 15 , 2026 | 10:50 PM
పురపాలక ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో అధికారులు బాధ్యతతో విధులు నిర్వర్తించాలని ఎన్నికల అధికారైన కలెక్టర్ పీ రాజాబాబు ఆదేశించారు.
కలెక్టర్ రాజాబాబు ఆదేశం
ఒంగోలు కలెక్టరేట్, అక్టోబరు 15 (ఆంధ్రజ్యోతి) : పురపాలక ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో అధికారులు బాధ్యతతో విధులు నిర్వర్తించాలని ఎన్నికల అధికారైన కలెక్టర్ పీ రాజాబాబు ఆదేశించారు. ఎన్నికల నామినేషన్ల ప్రక్రియపై ఈర్వోలు, ఏఆర్వోల మొదటి దశ శిక్షణా కార్యక్రమం గురువారం స్థానిక కలెక్టర్ సమావేశపు హాలులో జరిగింది. సమావేశంలో కలెక్టర్ రాజాబాబు మాట్లాడుతూ ఎన్నికల ప్రక్రియలో నియమ నిబంధనలు పక్కాగా పాటించాలని చెప్పారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై క్రమశిక్షణా చర్యలు తప్పవని హెచ్చరించారు. నామినేషన్ ప్రక్రియలో ఈఆర్వోలు, ఏఈఆర్వోల విధులు, వారంతా నిర్వహించాల్సిన విధివిధానాలపై పూర్తి స్థాయిలో అవగాహన కలిగి ఉండాలన్నారు. ఇందుకోసం ఆర్వో హ్యాండ్ బుక్ను అవగాహన పెంచుకోవాలని చెప్పారు. శుక్రవారం నుంచి ఈనెల 18వ తేదీ వరకు మునిసిపాలిటీల్లో పోటీ చేసే అభ్యర్థుల నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు నామినేషన్లను స్వీకరించాలని చెప్పారు. 19న నామినేషన్ల పరిశీలన, 21న అభ్యర్థుల నామినేషన్ల ఉపసంహరణ, అదే రోజు పోటీలో ఉండే అభ్యర్థుల తుది జాబితాను ప్రకటించాలన్నారు. ఆర్వో కార్యాలయాలవద్ద వివరాలు ముందుగానే సంబంధిత వార్డుల్లోని ప్రజలకు ప్రకటన చేయాల్సి ఉంటుందని చెప్పారు. బీసీ కార్పొరేషన్ ఈడీ ఎం.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ మునిసిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియపై ఈఆర్వోలు, ఏఈఆర్వోలు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు నగర పాలక సంస్థ కమిషనర్ వెంకటకృష్ణయ్య, ఒంగోలు ఆర్డీవో చంద్రశేఖర్నాయుడు, ఈఆర్వోలు, ఏఈఆర్వోలు ఉన్నారు.