డీకే.. దోచెయ్!
ABN , Publish Date - Aug 13 , 2026 | 02:58 AM
జీవో నంబరు 306 దళారులకు, కొందరు అధికారులకు వరంగా మారింది. పదేళ్లు పైబడి అసైన్డ్ స్థలాల్లో ఇళ్లు నిర్మించుకొని ఉంటూ పన్ను చెల్లిస్తున్న పేదలకు ప్రభుత్వం సర్వహక్కులు కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది.
కొందరికి కల్పతరువుగా మారిన 306 జీవో
అసైన్డ్ స్థలాల్లో ఉన్న ఇళ్ల రిజిస్ట్రేషన్ ప్రభుత్వం ఓకే
పదేళ్లకు పైబడి నివాసం ఉంటే సర్వహక్కులు
ఆ స్థలాల రిజిస్ర్టేషన్‌కు డిమాండ్
లక్షల్లో దండుకుంటున్న దళారులు
అదనపు పత్రాలంటూ పరోక్షంగా
ప్రోత్సహిస్తున్న అధికారులు
జీవో నంబరు 306 దళారులకు, కొందరు అధికారులకు వరంగా మారింది. పదేళ్లు పైబడి అసైన్డ్ స్థలాల్లో ఇళ్లు నిర్మించుకొని ఉంటూ పన్ను చెల్లిస్తున్న పేదలకు ప్రభుత్వం సర్వహక్కులు కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. రక్తసంబంధీకులకు, ఇతరులకు రిజిస్ట్రేషన్ చేసే వెసులుబాటు ఇచ్చింది. దీన్ని ఆసరాగా చేసుకొని దళారులు రెచ్చిపోతున్నారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా రిజిస్ట్రేషన్ చేయిస్తామంటూ లక్షలు వసూలు చేస్తున్నారు. వీరిని రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు కూడా పరోక్షంగా ప్రోత్సహిస్తూ అందిన కాడికి దండుకుంటున్నారు.
ఒంగోలు క్రైం, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి) : ప్రభుత్వం పేదలకు ఇచ్చిన నివేశన స్థలాలపై వారికి సర్వ హక్కులు కల్పించింది. ఆ మేరకు స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా రెండు నెలల క్రితం జీవో 306 జారీ చేసింది. పదేళ్లకు పైబడి ఆయా స్థలాల్లో గృహాలు నిర్మించుకొని నివాసం ఉంటున్న వారికి హక్కులు ఇచ్చింది. ఇది అటు అధికారులు, ఇటు దళారులకు కల్పతరువుగా మారింది. జిల్లాలో ప్రస్తుతం అన్ని రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ఇలాంటి డీకే పట్టాల రిజిస్ట్రేషన్‌లు జరుగు తున్నాయి. అయితే నిబంధనలకు విరుద్ధంగా అదనపు పత్రాలు కావాలని అధికారులు వేధింపులకు గురిచేస్తున్నారు. దీంతో దళారులు రంగంలోకి దిగి అంతా తాము చూసుకుంటామని చెబుతూ ఒక్కో రిజిస్ట్రేషన్‌కు రూ.30వేల నుంచి రూ.లక్ష వరకు వసూలు చేస్తున్నారు. దానిలో రిజిస్ట్రేషన్ శాఖ కార్యాలయాల్లో అధికారులకు వాటాలు వెళ్లున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. నిబంధనల ప్రకారం స్థలంలో ఇల్లు నిర్మాణం చేసి ఉండాలి. అందుకు సంబంధించిన ఇంటి పన్ను రసీదు కావాలి. అయితే అక్కడ ఇళ్ల నిర్మాణం లేకపోయినా రిజిస్ట్రేషన్‌లు చేస్తూ అధికారులు సొమ్ము చేసుకుంటున్నారు. ఇలా ప్రభుత్వం పేదల కోసం ఇచ్చిన జీవోను కొందరు తమ సంపాదన కోసం దుర్వినియోగం చేస్తున్నారు.
అదనపు పత్రాలు అడగొద్దని ఆదేశించినా..
పదేళ్లు లాక్-ఇన్ పిరియడ్ పూర్తయిన అసైన్డ్ నివేశన స్థలంలో ఇల్లు నిర్మించుకున్న వారు దాన్ని రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు ప్రభుత్వం జీవో నంబరు 306ను తీసుకొచ్చింది. సెక్షన్ 22ఏలో ఆస్తి ఉన్నప్పటికీ అలాంటి దానిని రిజిస్ట్రేషన్ చేయాలని జీవోలో పేర్కొంది. అదనపు పత్రాల పేరుతో వేధించొద్దని కూడా అధికారులకు ఆదేశాలు ఇచ్చింది. అయితే ఆ అవకాశాన్ని అందిపుచ్చుకున్న అధికారులు రిజిస్ట్రేషన్ సమయంలో రకరకాలైన ధ్రువీకరణ పత్రాలు కావాలని సాకులు చూపించి అందిన కాడికి గుంజుతున్నారు.