జిల్లా పరిషత్ విభజన
ABN , Publish Date - Sep 06 , 2026 | 03:07 AM
జిల్లా పరిషత్‌ల పునర్‌వ్యవస్థీకరణకు లైన్‌క్లియర్ అయింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం ఉన్న ఉమ్మడి జిల్లా పరిషత్‌లను నూతన జిల్లాలకు అనుగుణంగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
పునర్‌వ్యవస్థీకరణపై ప్రభుత్వం ఉత్తర్వులు
27 మండలాలతో ప్రకాశం, 21 మండలాలతో మార్కాపురం
24తో ముగియనున్న ప్రస్తుత జడ్పీ గడువు
అనంతరం ఉనికిలోకి కొత్తవి
జిల్లా పరిషత్‌ల పునర్‌వ్యవస్థీకరణకు లైన్‌క్లియర్ అయింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం ఉన్న ఉమ్మడి జిల్లా పరిషత్‌లను నూతన జిల్లాలకు అనుగుణంగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మేరకు అధికారికంగా శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ప్రకారం ప్రస్తుతం 56 మండలాలతో ఒంగోలు కేంద్రంగా ఉన్న ఉమ్మడి ప్రకాశం జిల్లా పరిషత్ ఇక నుంచి మూడుగా మారనుంది. ఒంగోలు కేంద్రంగా 27 మండలాలతో ప్రకాశం జిల్లా పరిషత్ కొనసాగనుంది. 21 మండలాలతో మార్కాపురం జిల్లా పరిషత్ నూతనంగా ఏర్పాటు కానుంది. అలాగే ఉమ్మడి జిల్లాలోని 8 మండలాలు బాపట్ల జిల్లా పరిషత్‌లోకి వెళ్లిపోనున్నాయి.
ఒంగోలు, సెప్టెంబరు 5 (ఆంధ్రజ్యోతి) : ప్రభుత్వం చేసిన జడ్పీల పునర్‌వ్యవస్థీకరణతో 50 ఏళ్లకుపైగా ఉన్న ప్రకాశం జడ్పీ ఇక కనుమరుగు కానుంది. గతంలో ఉన్న సమితిల వ్యవస్థతో కూడిన ఉమ్మడి జిల్లా జడ్పీ... మండలాల వ్యవస్థ ఏర్పాటు అనంతరం 56 మండలాలతో కొనసాగుతూ వచ్చింది. 2021లో జడ్పీ ఎన్నికలు జరిగినప్పుడు 56 మండలాలు ఒంగోలు కేంద్రంగా ఉన్న ప్రకాశం జిల్లాలోనే ఉండగా అవన్నీ కలిపి ప్రస్తుత పాలకవర్గం ఏర్పడింది. అనంతరం ఉమ్మడి జిల్లా తొలుత 2022లో ఒకసారి, గత ఏడాది డిసెంబరులో మరోసారి పునర్ వ్యవస్థీకరణ జరిగినా జడ్పీ మాత్రం ఉమ్మడి జిల్లా ప్రాతిపదికనే కొనసాగుతూ వస్తోంది. ఈనెల 24తో జడ్పీ పాలకవర్గాలు, అంతకు ఒక రోజు ముందుగా 23తో మండల పరిషత్ పాలకవ ర్గాల పదవీకాలం ముగుస్తుంది. దీంతో ఈసారి ఎన్నిక లను కొత్త జిల్లాల ప్రాతిపదికన జిల్లా పరిషత్‌లు ఏర్పా టు చేసి ఆ ప్రకారమే నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణ యించింది. అందుకు వీలుగా నూతన జడ్పీల ఏర్పా టుపై శనివారం అధికారికంగా ఉత్తర్వులు ఇచ్చింది.
మూడుగా ఉమ్మడి జడ్పీ
గత ఏడాది జరిగిన జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ ప్రకారం రాష్ట్రంలో ప్రస్తుతం 28 జిల్లాలు ఉన్నాయి. ఇప్పటి వరకు 13గా ఉన్న జిల్లా పరిషత్‌లను 28గా విభజిస్తూ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండే శనివారం ఉత్తర్వులు ఇచ్చారు. అందులో ఏ జిల్లా పరిషత్ పరిధిలోకి ఏయే మండలాలు వెళ్తాయన్న దానిపై కూడా స్పష్టత ఇచ్చారు. ఆ ఉత్తర్వుల ప్రకారం చూస్తే ఉమ్మడి ప్రకాశం జడ్పీ మూడుగా మారింది. ఒంగోలు కేంద్రంగా ఉన్న ప్రకాశం, మార్కాపురం కేంద్రంగా ఉన్న మార్కాపురం జడ్పీలు పూర్తిస్థాయిలో ఏర్పాటు కానున్నాయి. ఉమ్మడి జిల్లాలోని మరో 8 మండలాలు బాపట్ల జిల్లాలోకి వెళ్లాయి.
పునర్‌వ్యవస్థీకరణ ప్రకారం ఉమ్మడి జిల్లాలో
మండలాల విభజన వివరాలు
ప్రకాశం జడ్పీ (27) : ఒంగోలు, కొత్తపట్నం, సంతనూతలపాడు, చీమకుర్తి, మద్దిపాడు, ఎన్‌జీపాడు, అద్దంకి, జె.పంగులూరు, కొరిశపాడు, సంతమాగులూరు, బల్లికురవ, దర్శి, తాళ్లూరు, కురిచేడు, దొనకొండ, ముండ్లమూరు, మర్రిపూడి, కొండపి, పొన్నలూరు, టంగుటూరు, సింగరాయకొండ, జరుగుమల్లి, కందుకూరు. వలేటివారిపాలెం, గుడ్లూరు, లింగసముద్రం, ఉలవపాడు మండలాలు.
మార్కాపురం జడ్పీ (21) : మార్కాపురం, తర్లుపాడు, కొనకనమిట్ల, పొదిలి, కనిగిరి, హనుమంతునిపాడు, సీఎస్‌పురం, పీసీపల్లి, వెలిగండ్ల, ఎర్రగొండపాలెం, దోర్నాల, పెద్దారవీడు, పుల్లలచెరువు, త్రిపురాంతకం, గిద్దలూరు, కొమరోలు, రాచర్ల, బేస్తవారపేట, కంభం, అర్థవీడు మండలాలు
బాపట్ల జడ్పీ పరిధిలోకి (8) : చీరాల, వేటపాలెం, చినగంజాం, పర్చూరు, ఇంకొల్లు, కారంచేడు, మార్టూరు, యద్దనపూడి మండలాలు.
అధికారుల నియామకానికి సిద్ధం
జడ్పీల పదవీ కాలం ఈనెల 24తో ముగియనుండగా అనంతరం కొత్త జడ్పీలు ఉనికిలోకి రానున్నాయి. జడ్పీ పర్యవేక్షణాధికారులు సీఈవో, డిప్యూటీ సీఈవోలు కాగా ప్రస్తుతం ఉమ్మడి జిల్లా జడ్పీలకు అనుగుణంగా 13 మంది సీఈవోలు, 13మంది డిప్యూటీ సీఈవోలు ఉన్నారు. నూతన జడ్పీల ఏర్పాటుతో మొత్తం 28 జడ్పీలు కానుండటంతో మరో 15 సీఈవో, డిప్యూటీ సీఈవో పోస్టులను ప్రభుత్వం మంజూరు చేసింది. కొత్త జడ్పీలు ఏర్పాటు లోపే వారి నియామకాలు కూడా జరగనున్నట్లు తెలుస్తోంది. ఆయా నూతన జడ్పీలకు నియమితులయ్యే సీఈవో, డిప్యూటీ సీఈవోలు నూతన జడ్పీల పాలనకు అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాల్సి ఉంటుంది. అదే సమయంలో జడ్పీ కార్యాలయంలో సెక్షన్ల సూపరింటెండెంట్లు, ఇతర సిబ్బందిని మాత్రం కొత్తగా నియామకం చేయలేదు. ఉమ్మడి జడ్పీ కార్యాలయంలో ఉన్న అధికారులు సిబ్బందిని దామాషా పద్ధతిలో కొత్త జడ్పీలకు విభజించనున్నట్లు సమాచారం.