కుదుటపడిన పంపిణీ
ABN , Publish Date - Apr 30 , 2026 | 02:51 AM
జిల్లాలో నెలకొన్న ఆయిల్ సంక్షోభం నుంచి ప్రజానీకానికి ఊరట లభించింది. మూడు, నాలుగు రోజులు అస్తవ్యస్తంగా సాగిన ఆయిల్ పంపిణీ వ్యవస్థ బుధవారం నాటికి కుదుటపడింది. అత్యధిక ఆయిల్ బంకుల్లో అవసరానికి సరిపడా నిల్వలు చేయడంతో వారం క్రితం నాడు ఉన్న పరిస్థితికి చేరాయి.
ఊపిరిపీల్చుకున్న ప్రజానీకం
పూర్వస్థితికి చేరిన ఆయిల్ బంకులు
అందుబాటులో పెట్రోల్, డీజిల్
లూజు విక్రయాలపై మాత్రం ఆంక్షలు
నేడో, రేపో వాటినీ తొలగించే అవకాశం
ఒంగోలు, ఏప్రిల్ 29(ఆంధ్రజ్యోతి) : జిల్లాలో నెలకొన్న ఆయిల్ సంక్షోభం నుంచి ప్రజానీకానికి ఊరట లభించింది. మూడు, నాలుగు రోజులు అస్తవ్యస్తంగా సాగిన ఆయిల్ పంపిణీ వ్యవస్థ బుధవారం నాటికి కుదుటపడింది. అత్యధిక ఆయిల్ బంకుల్లో అవసరానికి సరిపడా నిల్వలు చేయడంతో వారం క్రితం నాడు ఉన్న పరిస్థితికి చేరాయి. వాహనాలతో బంకుల వద్దకు వెళ్లిన వారికి అడిగినంత లేదా వాహనంలోని ట్యాంకులో పట్టినంత ఆయిల్ పోస్తున్నారు. అయితే లూజ్ విక్రయాలపై మాత్రం ఆంక్షలు కొనసాగుతున్నాయి. జిల్లాలోని ఆరు నియోజకవర్గాల పరిధిలో వివిధ కంపెనీలకు చెందిన 196 ఆయిల్ బంకులు ఉన్నాయి. గత శనివారం రాత్రి నుంచి వాటికి ఆయిల్ కంపెనీల నుంచి సరఫరా సరిలేక సగం బంకుల్లో నోస్టాక్ బోర్డులు దర్శనమిచ్చాయి. మిగతా వాటిలో భారీ క్యూలైన్లలో వాహనాలతో రద్దీ ఏర్పడింది. పరిస్థితిని గుర్తించిన జిల్లా యంత్రాంగం రంగంలోకి దిగింది. ఆది, సోమవారాల్లో తీవ్ర ఇక్కట్లు వాహనదారులకు ఎదురుకాగా కలెక్టర్ రాజాబాబు నేతృత్వంలో రెవెన్యూ, పోలీస్, పౌరసరఫ రాలు, ఇతర అన్నిశాఖల అధికారులు రంగంలోకి దిగారు. క్షేత్రస్థాయిలో తనిఖీలు ముమ్మరం చేశారు. అందుబా టులో ఉన్న ఆయిల్.. వినియోగదారులకు చేరేలా కృషిచేశారు. అందులోభాగంగా డ్రమ్ములు, క్యాన్‌లు, బాటిళ్లలో ఆయిల్ తీసుకెళ్లే వారికి పోయకుండా ఆంక్షలు పెట్టి వాహనాలతో వచ్చిన వారికి తక్షణ అవసరాలు తీరేలా పరిమితంగా పోసే విధంగా చేశారు. మరోవైపు ఆయిల్ కంపెనీల ప్రతినిధులతో మాట్లాడి సరఫరా మెరుగునకు చర్యలు తీసుకున్నారు. ఈ చర్యల ఫలితాలతోపాటు ఆయిల్ కంపెనీలు మరింత సరఫరా చేయడంతో గతరాత్రి నుంచి జిల్లాలోకి ఆయిల్ సరఫరా పెరిగింది. పట్టణాల్లోనే కాక గ్రామీణ ప్రాంతాల్లోని బంకులకు సైతం అవసరమైన మేర ఆయిల్ రాకతో బుధవారం ఆయా ప్రాంతాల్లో ఆయిల్ బంకులు పూర్వస్థితికి చేరుకున్నాయి. వాహనాల రద్దీ ఎక్కడ లేకపోగా వాహనదారులు అడిగినంత ఆయిల్‌ను బంకుల నిర్వాహకులు పోస్తున్నారు. దీంతో ప్రజలకు ఊరట లభించింది. అదేసమయంలో లూజ్ విక్రయాలపై ఆంక్షలు కొనసాగుతున్నాయి. అన్నిప్రాంతాల్లో ఆయిల్ అందుబాటులో ఉండటంతో చీమకుర్తి, బల్లికురవ ప్రాంతాల్లో గ్రానైట్ క్వారీల్లో పనులు తిరిగి ప్రారంభమయ్యాయి. కాగా జిల్లాలో ఆయిల్ పంపిణీ వ్యవస్థ పూర్తిగా గాడిలో పడిందని, ఎక్కడ కొరత లేదని కలెక్టర్ రాజాబాబు తెలిపారు. లూజ్ విక్రయాలపై ఆంక్షలు ఉన్నాయన్న ఆయన మరోసారి ఆయిల్ సరఫరాపై సమీక్షించి ఆ విషయంలో నిర్ణయం తీసుకుంటామన్నారు. కాగా జాయింట్ కలెక్టర్ కల్పనాకుమారి బుధవారం ఒంగోలు నగరంలోని పలు పెట్రోల్ బంకులను పరిశీలించి అక్కడి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.