Share News

వైసీపీలో భగ్గుమన్న విభేదాలు

ABN , Publish Date - May 19 , 2026 | 03:16 AM

పెట్రో ధరల పెరుగుదలకు నిరసనగా వైసీపీ సోమవారం సింగరాయకొండలో చేపట్టిన నియోజకవర్గ స్థాయి నిరసన ర్యాలీలో ఆ పార్టీలోని వర్గ విభేదాలు మరోసారి బయట పడ్డాయి.

వైసీపీలో భగ్గుమన్న విభేదాలు
సింగరాయకొండలో వాదులాడుకుంటున్న వైసీపీ నాయకులు

పార్టీ టంగుటూరు, జరుగుమల్లి మండలాల అధ్యక్షులపై మైనారిటీ నాయకుల ఆగ్రహం

మా ఊరికి వచ్చి మీ పెత్తనం ఏంటంటూ వాగ్వాదం

పేలవంగా ‘పెట్రో’ నిరసన ర్యాలీ

గైర్హాజరైన కీలక నాయకులు, స్థానిక మాజీ ప్రజాప్రతినిధులు

సింగరాయకొండ, మే 18(ఆంధ్రజ్యోతి): పెట్రో ధరల పెరుగుదలకు నిరసనగా వైసీపీ సోమవారం సింగరాయకొండలో చేపట్టిన నియోజకవర్గ స్థాయి నిరసన ర్యాలీలో ఆ పార్టీలోని వర్గ విభేదాలు మరోసారి బయట పడ్డాయి. ఒకరినొకరు దుర్భాషలాడుకున్నారు. అసభ్య పదజాలంతో దూషించుకున్నారు. ఒక దశలో దాడులకు సిద్ధమయ్యారు. ఈ ఘర్షణ వాతావరణానికి తహసీల్దార్‌ కార్యాలయం వేదికైంది. వివరాల్లోకి వెళితే.. వైసీపీ అధి ష్ఠానం పిలుపు మేరకు పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెంపును నిరసిస్తూ కొండపి నియోజకవ ర్గంలోని ఆరు మండలాల నాయకులు సింగరాయకొండలో ర్యాలీ చేపట్టారు. అనం తరం వినతిపత్రం అందజేయడానికి తహ సీల్దార్‌ కార్యాలయ ప్రాంగణానికి చేరుకు న్నారు. అక్కడ నినాదాలు చేసే సమయంలో మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్‌ క్యాంపు కార్యాలయంలో పనిచేసే గంగాధర్‌ ఆరు మండలాల పార్టీ అధ్యక్షులను ముందుకు రావాలని కోరారు. దీంతో పక్కనే ఉన్న వైసీపీ మైనారిటీ సెల్‌ జిల్లా అఽధ్యక్షుడు షేక్‌ సుల్తాన్‌, పార్టీ సింగరాయకొండ టౌన్‌ అధ్యక్షుడు కరీం ఇద్దరూ గంగాధర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానికంగా మేము నాయకులం కాదా! మాకు పార్టీ పదవులు లేవా! అంటూ నిలదీశారు. ఈ దశలో టంగుటూరు, జరుగుమల్లి మండలాల అధ్యక్షులు చింతపల్లి హరిబాబు, పిన్నక శ్రీనివాసులు కలిసి సుల్తాన్‌, కరీంలతో వాగ్వా దానికి దిగారు. దీంతో మైనారిటీ నాయకులు ఇరువురూ.. మా మండలానికి వచ్చి మీ పెత్తనం ఏందంటూ ఊగిపోయారు. పార్టీలో కష్టపడుతున్న ముస్లింలను అణగ దొక్కే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఒకరికి ఒకరు వేళ్లు చూపించుకుంటూ తిట్టుకున్నారు. ఒకదశలో నెట్టుకోబోగా మిగతా నాయకులు కలుగజేసుకొని నియంత్రించారు. దీంతో తహసీల్దార్‌ కార్యాలయ ప్రాంగణం దాదాపు అర్ధగంట పాటు వైసీపీ నాయకుల అరుపులు, కేకలతో దద్దరిల్లిపోయింది. నియోజకవర్గ స్ధాయి నిరసన ర్యాలీకి మాజీ మంత్రి, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ ఆదిమూలపు సురేష్‌ రాలేదు. అలాగే ఇటీవల నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్న మాజీ ఇన్‌చార్జ్‌, వైసీపీ సెంట్రల్‌ ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌ సభ్యుడు మాదాసి వెంకయ్య, డాక్టర్‌ బత్తుల అశోక్‌కుమార్‌రెడ్డి గైర్హాజరయ్యారు. ఆరు మండలాల్లో ఇటీవల పదవీకాలం ముగిసిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులైన సర్పంచ్‌లు, ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులు, వివిధ పార్టీ పదవుల్లో ఉన్న కీలక నాయకులు డుమ్మాకొట్టారు. నియోజకవర్గ స్థాయిలో కార్యక్రమం చేపట్టినప్పటికీ పట్టుమని 60 నుంచి 70మందికి మించి కార్యక్రమానికి హాజరు కాకపోవడాన్ని బట్టి ఆ పార్టీలో ఉన్న లుకలుకలు బయటపడ్డాయని జోరుగా ప్రచారం జరుగుతోంది. దీనికితోడు వైసీపీ ఇన్‌చార్జ్‌ మాజీమంత్రి ఆదిమూలపు సురేష్‌ పార్టీ మారడానికి ప్రయత్నాలు చేస్తున్నారని వైసీపీలోని ఒకవర్గం ప్రచారం చేస్తుండటం గమనార్హం. దీని పర్యావసానంగానే సోమవారం నియోజకవర్గ స్ధాయిలో చేపట్టిన ర్యాలీ పేలవంగా కొనసాగి విభేదాలకు దారితీసిందని ఆ పార్టీ నాయకులే చర్చించుకుంటున్నారు.

Updated Date - May 19 , 2026 | 03:16 AM