Share News

కూలీల నోట్లో మట్టి

ABN , Publish Date - Oct 10 , 2026 | 01:45 AM

సంతమాగులూరు మండలంలో వీబీ జీరామ్‌జీ పనులను పర్యవేక్షించే అధికారుల అవినీతికి అదుపు లేకుండా పోయింది. తమకు రావాల్సిన వాటాలలో భేదాభిప్రాయాలు చోటుచేసుకోవడంతో ఏకంగా కూలీలు చేసిన పనులకు సంబంధించిన బిల్లులు అప్‌ లోడ్‌ చేయకుండా డిలేట్‌ కొట్టారు.

కూలీల నోట్లో మట్టి
ఫత్తేపురంలో పనులు చేస్తున్న కూలీలు

రూ.25 లక్షలు నష్టపోయిన వైనం

అధికారులు, ఫీల్డ్‌ అసిస్టెంట్‌ల మధ్య పంపకాల్లో పేచీ

పనుల బిల్లులు అప్‌లోడ్‌ చేయకుండా డిలిట్‌ కొట్టిన అధికారి

సంతమాగులూరు (అద్దంకి), అక్టోబరు 9 (ఆంధ్రజ్యోతి) : సంతమాగులూరు మండలంలో వీబీ జీరామ్‌జీ పనులను పర్యవేక్షించే అధికారుల అవినీతికి అదుపు లేకుండా పోయింది. తమకు రావాల్సిన వాటాలలో భేదాభిప్రాయాలు చోటుచేసుకోవడంతో ఏకంగా కూలీలు చేసిన పనులకు సంబంధించిన బిల్లులు అప్‌ లోడ్‌ చేయకుండా డిలేట్‌ కొట్టారు. దీంతో పనుల వివరాలు కనిపించడం లేదు. సుమారు రూ.25 లక్షలు మట్టిపాలు అయినట్టేనని కూలీలు ఆందోళన చెందుతున్నారు.

12 పంచాయతీల్లో కనిపించని కూలీల వివరాలు

మండల కేంద్రమైన సంతమాగులూరు మినహా మిగిలిన 12 గ్రామ పంచాయతీలలో పనులు చేసిన కూలీల వివరాలు ఆన్‌లైన్‌లో కనిపించడం లేదు. అంతకు ముందు వారంలో కూడా నాలుగైదు పంచాయతీలలో చేసిన పనులకు సంబంధించిన వివరాలు కూడా డిలిట్‌ అయినట్లు తెలుస్తోంది. సుమారు రూ.25 లక్షల పనులు ఆన్‌లైన్‌లో కనిపించకపోవడంతో వాటిని చేసిన కూలీలకు డబ్బులు వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. డిలిట్‌ కొట్టడం వెనుక పెద్ద వ్యవహారమే ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

సంతమాగులూరు రూటే సప‘రేటు’

అద్దంకి నియోజకవర్గంలో సంతమాగులూరు రూటే సపరేటు అన్న విధంగా ఉంది. ఆ మండలంలో మొత్తం 20 గ్రామ పంచాయతీలు ఉండగా, 13 పంచాయతీల్లో మాత్రమే వీబీ జీరాంజీ పనులు జరుగుతున్నాయి. ఆ గ్రామాలలో ప్రతిరోజూ 1,200 నుంచి 1,500 మంది కూలీలు పనులకు హాజరువుతు న్నారు. కూలీల మస్టర్‌లను ఫీల్డ్‌ అసిస్టెంట్‌ నమోదు చేస్తారు. పనులకు సంబంధించి వారం రోజులకు అంటే సెప్టెంబరు 28 నుంచిఅక్టోబరు 3 వరకు ఆయా గ్రామాలలో చేపట్టిన పనులకు మండలస్థాయి అధికారి బిల్లు లు అప్‌లోడ్‌ చేయాల్సి ఉంది. అయితే గత వారంలో చేసిన పనులను అప్‌లోడ్‌ చేయకుండా ఏకంగా డిలిట్‌ కొట్టినట్లు తెలుస్తోంది.

పంపకాల్లో పేచీ

గతంలో పనులకు వెళ్లకపోయినా మస్టర్లు వేసి అందులో కూలీలకు కొంతమేర ఇచ్చి మిగిలిన మొత్తాన్ని క్షేత్రస్థాయి మొదలు పైస్థాయి వరకు అందరూ వాటాలు పంచుకునే వారు. ఈవ్యవహారం సంతమాగులూరు మండలంలో మరింత బరితెగించి జరిగేది. మారిన నిబంధనలతో మస్టర్‌ల నమోదులో మాయాజాలానికి అడ్డుకట్ట పడింది. దీంతో పంపకాల్లో పేచీ వచ్చినట్లు తెలుస్తుంది. పాత పద్ధతి ప్రకారమే తమకు వారంవారం మామూళ్లు ఇవ్వాల్సిందేనని అధికారి ఒత్తిడి చేయటంతో తమవల్ల కాదని క్షేత్రస్థాయి సిబ్బంది చేతులెత్తేసినట్లు తెలుస్తోంది. ఈక్రమంలో వారం రోజుల పాటు పనులు చేసిన కూలీల నోట మట్టి కొడుతూ మస్టర్‌లను అప్‌లోడ్‌ చేయకుండా ఆ అధికారి డిలీట్‌ కొట్టారన్న విమర్శలు వస్తున్నాయి. దీంతో సుమారు రూ.25 లక్షలు నష్టపోయారు. ఇప్పటికైనా ఉన్నతాఽధికారులు స్పందించి విచారణ చేపట్టి తమకు న్యాయం చేయాలని కూలీలు విజ్ఞప్తి చేస్తున్నారు. అలాగే తాము చేసిన పనుల వివరాలు అప్‌లోడ్‌ చేయకుండా డిలీట్‌ కొట్టిన అఽధికారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Updated Date - Oct 10 , 2026 | 01:45 AM