Share News

సూటిగా... స్పష్టంగా!

ABN , Publish Date - Jul 16 , 2026 | 02:53 AM

రెండు జిల్లాల ప్రజలు ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలపై బుధవారం ఒంగోలులో జరిగిన జిల్లా సమీక్షా మండలి సమావేశం (డీఆర్సీ)లో సూటిగా, స్పష్టంగా చర్చ సాగింది. పలు పథకాల అమలులో లోటుపాట్లు, వివిధ శాఖల పరిధిలో ఎదురవుతున్న సమస్యలు, వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై నేతలు మాట్లాడారు.

సూటిగా... స్పష్టంగా!
డీఆర్సీ సమావేశంలో మాట్లాడుతున్న ఇన్‌చార్జి మంత్రి ఆనం, వేదికపై మంత్రులు డోలా, గొట్టిపాటి, ఎంపీ మాగుంట, జడ్పీ చైర్‌పర్సన్‌ వెంకాయమ్మ, రెండు జిల్లాల కలెక్టర్లు రాజాబాబు, విజయసునీత, ఎస్పీ హర్షవర్ధన్‌రాజు

ఎనిమిది నెలల అనంతరం రెండు జిల్లాల సంయుక్త డీఆర్సీ సమావేశం

మూడున్నర గంటలు పలు అంశాలపై చర్చ

మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు హాజరు

ప్రజాప్రతినిధులు ప్రస్తావించిన సమస్యల

పరిష్కారానికి మంత్రి ఆనం ఆదేశాలు

పలు ఇతర కార్యక్రమాలకు హాజరైన మంత్రులు

ఒంగోలులో ఆంజనేయులుకు నివాళులు

రోజంతా కార్యక్రమాలతో బిజీబిజీగానేతలు

రెండు జిల్లాల ప్రజలు ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలపై బుధవారం ఒంగోలులో జరిగిన జిల్లా సమీక్షా మండలి సమావేశం (డీఆర్సీ)లో సూటిగా, స్పష్టంగా చర్చ సాగింది. పలు పథకాల అమలులో లోటుపాట్లు, వివిధ శాఖల పరిధిలో ఎదురవుతున్న సమస్యలు, వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై నేతలు మాట్లాడారు. సుమారు మూడున్నర గంటలపాటు సమావేశం జరిగింది. కీలక ప్రజాప్రతిని ధులైన ఎమ్మెల్యేలు, మరికొందరు ఇతర సభ్యులు సమావేశం దృష్టికి పలు అంశాలను తీసుకు వచ్చారు. వాటి పరిష్కారానికి ఇన్‌చార్జ్‌ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.

ఒంగోలు, జూలై 15 (ఆంధ్రజ్యోతి) : రెండు జిల్లాల సంయుక్త డీఆర్సీ సమావేశం దాదాపు ఎనిమిది మాసాల అనంతరం బుధవారం ఒంగోలులో జరిగింది. ఇన్‌చార్జ్‌ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అధ్యక్షత వహించారు. జిల్లాకు చెందిన మంత్రులు డాక్టర్‌ డీఎస్‌బీవీ స్వామి, గొట్టిపాటి రవికుమార్‌, జెడ్పీ చైర్‌పర్సన్‌ బూచేపల్లి వెంకాయమ్మ, ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, రెండు జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు దామచర్ల జనార్దన్‌, బీఎన్‌.విజయ్‌కుమార్‌, ఉగ్రనరసింహారెడ్డి, ఇంటూరి నాగేశ్వరరావు, కందుల నారాయణరెడ్డి, ఎం.అశోక్‌రెడ్డి, తాటిపర్తి చంద్రశేఖర్‌, రాష్ట్రస్థాయి కార్పొరేషన్‌ల చైర్మన్లు దామచర్ల సత్యనారాయణ, నూకసాని బాలాజీ తదితరులు పాల్గొన్నారు. పలు అంశాలను ప్రస్తావించారు. ఉదయం పదకొండు న్నర నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు సమావేశం సాగింది. తాగునీటి సరఫరా, వ్యవ సాయ అనుబంధ శాఖలు, పంచాయతీరాజ్‌, అటవీ, జాతీయ రహదారులు, ఇరిగేషన్‌ వంటి కీలక శాఖలపై చర్చించారు. ఈ సీజన్‌లో ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో ఎదురయ్యే తాగునీటి సమస్య, పంటల సాగుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మంత్రి ఆనంతోపాటు ఇతర మంత్రులు అధికారులకు పలు సూచనలు చేశారు. అటవీశాఖ ద్వారా ఎదురవుతున్న ఇబ్బందులు, చేపల కోసం చెరువులలో నీరు బయటకు పెట్టడం, గ్రామాలలో భూసంబంధ సమస్యలు, రోడ్డుప్రమాదాలు ఇతరత్రా అంశాలను ప్రజాప్రతినిధులు సమావేశంలో ప్రస్తావించారు. అధికారుల స్పందనపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఆయా అంశాలపై ఇన్‌చార్జ్‌ మంత్రి ఆనం జోక్యం చేసుకొని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలుతోపాటు స్థానికంగా ప్రజలకు ఆయా శాఖల ద్వారా ఎదురయ్యే సమస్యల పరిష్కారానికి జిల్లా యంత్రాంగం సకాలంలో స్పందించాలన్నారు. ఈ విషయంలో స్థానిక ప్రజాప్రతినిధుల సూచనలు, సలహాలకు ప్రాధాన్యత ఇచ్చి వారితో సమన్వయంతో సాగాలని సూచించారు. రెండు జిల్లాల కలెక్టర్‌లు రాజాబాబు, విజయసునీతల నేతృత్వంలో అధికారులు పాల్గొన్నారు. ప్రజాప్రతినిధులు ప్రస్తావించిన పలు అంశాలపై వారు సమాధానం ఇచ్చారు.

రోజంతా ఉత్సాహంగా..

చాలారోజుల తర్వాత మంత్రులు, ఇతర కీలక ప్రజాప్రతినిధులు, వివిధ సంస్థల చైర్మన్లు ఇలా అధికారపక్షానికి చెందిన ముఖ్యమైన వారు బుధవారం రోజంతా కలిసి వివిధ కార్యక్రమాలలో పాల్గొని సందడి చేశారు. పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపారు. ఉదయం 10 గంటలకు తొలుత ఎంపీ మాగుంట నివాసానికి చేరుకున్న వారు అక్కడ అల్పాహారం అనంతరం నగరంలోని బాపూజీ కాంప్లెక్స్‌ వద్ద ఉన్న ఉమ్మడి రాష్ట్ర మాజీ మంత్రి దామచర్ల ఆంజనేయులు విగ్రహానికి ఆయన జయంతిని పురస్కరించుకొని ఘనంగా నివాళులర్పించారు. ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌ నేతృత్వంలో జరిగిన కార్యక్రమంలో టీడీపీ శ్రేణులు అధికసంఖ్యలో పాల్గొన్నారు. రాత్రికి నేతివారిపాలెంలో ఏర్పాటు చేసిన స్వర్గీయ ఎన్టీఆర్‌, దామచర్ల ఆంజనేయులు విగ్రహాలను మంత్రులు ఆవిష్కరించారు. టీడీపీ నేత గోనుగుంట పున్నయ్య ఆధ్వర్యంలో అక్కడ కార్యక్రమం భారీగా సాగింది. కొండపి నియోజకవర్గంలోని పలుప్రాంతాల పార్టీ ముఖ్య నేతలు కూడా పాల్గొన్నారు. మొత్తం మీద అధికారపక్ష ముఖ్యులు అంతా వివిధ అధికారిక, పార్టీ కార్యక్రమాలలో విరామం లేకుండా రాత్రి వరకు పాల్గొన్నారు.

Updated Date - Jul 16 , 2026 | 02:53 AM