పీహెచ్‌సీలు డిజిటలైజేషన్
ABN , Publish Date - Feb 22 , 2026 | 02:30 AM
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు డిజిటలైజేషన్ (కంప్యూటరీకరణ) చేస్తున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఆ మేరకు కొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల డిజిటలైజేషన్‌కు చర్యలు తీసుకోవాలని ఆదేశించడంతో తదనుగుణంగా వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
మద్దిపాడు, కొత్తపట్నం కేంద్రాల్లో అమలు
దశలవారీగా అన్ని సెంటర్‌లలో ఏర్పాటు
రోగులకు పారదర్శకంగా వైద్యసేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యం
ఒంగోలు కలెక్టరేట్, ఫిబ్రవరి 21(ఆంధ్రజ్యోతి): ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు డిజిటలైజేషన్ (కంప్యూటరీకరణ) చేస్తున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఆ మేరకు కొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల డిజిటలైజేషన్‌కు చర్యలు తీసుకోవాలని ఆదేశించడంతో తదనుగుణంగా వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అందులో భాగంగా ప్రస్తుత ప్రకాశం జిల్లాలోని రెండు పీహెచ్‌సీల్లో పూర్తిగా డిజిటలైజేషన్‌కు చర్యలు తీసుకున్నారు. మొదటి దశలో మద్దిపాడు, కొత్తపట్నం పీహెచ్‌సీల్లో ఈ కంప్యూటరీకరణ ప్రక్రియ అమలుకు చర్యలు తీసుకున్నారు. తద్వారా ఆయా కేంద్రాలకు వచ్చే రోగుల నమోదు నుంచి మందులు పంపిణీ, రోగులకు నిర్వహించే వైద్య పరీక్షలు, ఇతర పలు రకాలన్నింటిని కంప్యూటరీకరణ చేయనున్నారు. రోగి వైద్యశాలకు వెళ్లిన తర్వాత ఓపీ నుంచి మరలా బయటకు వచ్చేంతవరకు మొత్తం ప్రక్రియ అంతా డిజిటలైజేషన్‌లోనే ఉంటుంది. ఆ వైద్యశాలలో చూపించుకున్న నివేదిక(రిపోర్టు)లు కూడా సంబంధిత రోగి ఇచ్చే సెల్ నెంబర్‌కు సమాచారం వస్తోంది. తద్వారా రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించడమే కాకుండా ఆ వైద్యశాలలో ఏ రోజుకారోజు ఎన్ని ఓపీలు వచ్చాయి, ఎంతమందికి ట్రీట్‌మెంట్ చేశారు. ఎంతమందికి వైద్య పరీక్షలు నిర్వహించారు, ఎంతమందికి ఏఏ రకాల మందులు ఇచ్చారు, మరలా వైద్యశాలకు ఎప్పుడు వైద్యులు రమ్మని చెప్పారు తదితర వివరాలన్నింటిని కూడా నమోదు చేస్తారు. ఇక ఆ వైద్యశాలలకు సంబంధించిన సమాచారం మొత్తం కూడా కంప్యూటర్‌లో నిక్షిప్తమవుతుంది. ప్రభుత్వ కార్యాలయాల్లో ఏ విధంగా అయితే ఈ ఆఫీసు విధానం అమలు జరుగుతుందో అదేతరహాలో పీహెచ్‌సీల్లో డిజిటలైజేషన్ జరగనుంది. ఇప్పటికే మొదటగా ఎంపికచేసిన రెండు పీహెచ్‌సీల్లో అమలు చేసే దిశగా చర్యలు తీసుకున్నారు. ఇప్పటికే ఆ వైద్యశాలకు సంబంధించిన డాక్టర్ల వివరాలు, ఇతర ఉద్యోగుల వివరాలన్నింటిని డిజిటలైజేషన్ చేసే ప్రక్రియను ప్రారంభించారు. అక్కడ పూర్తయిన తర్వాత మిగిలిన 37 పీహెచ్‌సీల్లో అమలు చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది.