చీమకుర్తిలో డీజిల్ మాయాజాలం
ABN , Publish Date - May 06 , 2026 | 02:43 AM
డీజిల్ సమస్య సద్దుమ ణుగుతున్న సమయంలో కాసుల కోసం కక్కుర్తి పడుతున్న కొందరు పెట్రోలు బంకుల యజమానుల నిర్వాకంతో మళ్లీ కొరత వచ్చే పరిస్థితులు నెలకొంటున్నాయి. డీజిల్ సమస్యను అధిగమించేందుకు ప్రభుత్వం బంకు యజమా నులకు కొన్ని షరతులను విధించింది.
కాసుల కోసం కక్కుర్తి పడుతున్న పెట్రోలు బంకుల యజమానులు
ఆయిల్ కొరతతో ఇబ్బందిపడుతున్న పట్టణవాసులు
చీమకుర్తి, మే5 (ఆంధ్రజ్యోతి): డీజిల్ సమస్య సద్దుమ ణుగుతున్న సమయంలో కాసుల కోసం కక్కుర్తి పడుతున్న కొందరు పెట్రోలు బంకుల యజమానుల నిర్వాకంతో మళ్లీ కొరత వచ్చే పరిస్థితులు నెలకొంటున్నాయి. డీజిల్ సమస్యను అధిగమించేందుకు ప్రభుత్వం బంకు యజమా నులకు కొన్ని షరతులను విధించింది. వాటికి లోబడి మాత్రమే పెట్రోల్, డీజిల్‌ను వాహనదారులకు విక్రయించాల్సి ఉంది. కానీ పట్టణంలోని కొన్ని బంకుల యజమానులు నిబంధనలకు తిలోదకాలు ఇస్తూ ఇష్టారీతిన విక్రయాలు చేస్తున్నారు. అధికంగా డబ్బులకు ఆశపడి కొన్ని గ్రానైట్ క్వారీలకు చెందిన వాహనాలకు పెద్దమొత్తంలో డీజిల్‌ను రాత్రి పొద్దుపోయిన తర్వాత విక్రయిస్తూ చీకటి దందాకు తెరతీస్తున్నారు. భారీగా సొమ్ము చేసుకుంటు న్నారు. సోమవారం రాత్రి ఇదే తరహా ఘటన పట్టణంలోని బీవీఎస్‌ఆర్ కళాశాలకు సమీపంలో ఉన్న ఓ పెట్రోల్ బంకులో చోటుచేసుకుంది. గమనించిన కొందరు యువకులు వీడియో తీసి మీడియాకు, అధికారులకు పంపారు. గ్రానైట్ క్వారీలకు చెందిన భారీ వాహనాలకు డీజిల్ కొడుతున్న వీడియో చూసిన తహసీల్దార్ బ్రహ్మయ్య, పుడ్ ఇన్‌స్పెక్టర్ వంశీలు హుటాహుటిన బంకు వద్దకు చేరుకున్నారు. డీజిల్ విక్రయాలకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. గ్రానైట్ క్వారీలకు చెందిన ఎనిమిది డంపర్లకు 2,600 లీటర్లు విక్రయించినట్లు గుర్తించామని తహసీల్దార్ బ్రహ్మయ్య తెలిపారు. కనిబంధనల మేరకు పెద్ద వాహనాలకు ఒక్కో దానికి 200 లీటర్లు మాత్రమే విక్రయించాల్సి ఉందని, అందుకు విరుద్ధంగా జరగటంతో ఉన్నతాధికారులకు నివేదించామన్నారు. పెట్రోల్ బంక్‌ని తనిఖీ చేసి నివేదిక ఇచ్చిన తర్వాత తగు చర్యలు తీసుకుంటామన్నారు. ప్రభుత్వ నిబంధనలను అమలు చేయకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పెట్రోల్ బంక్ యజమానులకు ఆయన హెచ్చరించారు. కాగా గ్రానైట్ క్వారీల వారు వారి క్వారీలలో ఉన్న బంక్‌లకు ప్రభుత్వం ప్రత్యేకంగా సరఫరా చేసే డీజిల్‌ని వినియోగించాల్సి ఉంది. కానీ వీరికి సరఫరా చేసే డీజిల్ రేటు బహిరంగ మార్కెట్‌లో దొరికే డీజిల్ కన్నా యాభై రూపాయలకు పైగా అదనంగా ఉండటంతో ఆర్థిక భారాన్ని తగ్గించుకోవటానికి పట్టణంలో ఉన్న బంక్‌ల వద్ద నుంచి కొంతమేర అదనంగా ముట్టజెప్పి కొనుగోలు చేస్తుండటం సమస్యగా మారింది. ఈ దందాకు అడ్డుకట్ట వేసే విధంగా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని పట్టణవాసులు కోరుతున్నారు.