Share News

ఇక ధర్మ‘వరమే’...!

ABN , Publish Date - Feb 01 , 2026 | 10:54 PM

రెండు దశాబ్దాల క్రితం నిర్మించారు.. ప్రజలకు గుక్కెడు నీటిని అందించలేకపోయారు. దీంతో నేటికీ నిరుపయోగంగా ఉండిపోయింది. ఈ నేపథ్యంలో విద్యుత్‌ శాఖ మంత్రి, అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ ఆ ప్రాజెక్ట్‌పై ప్రత్యేక దృష్టి సారించారు. ధర్మవరం సమ్మర్‌ స్టోరేజీ ట్యాంక్‌ పునర్నిర్మాణానికి రూ.5.70 కోట్లు నిధులు మంజూరు చేయించారు.

ఇక ధర్మ‘వరమే’...!
పునర్నిర్మాణం చేయనున్న ధర్మవరం సమ్మర్‌ స్టోరేజీ ట్యాంక్‌

ఇరవై ఏళ్ల తర్వాత గ్రామ సమ్మర్‌ స్టోరేజీకి మోక్షం

ట్యాంక్‌ పునర్నిర్మాణానికి రూ.5.70 కోట్లు విడుదల

మంత్రి రవికుమార్‌ ప్రత్యేక చొరవతో నిధుల మంజూరు

త్వరలో ప్రారంభం కానున్న పనులు

12 గ్రామాలకు తాగునీటి సరఫరాకు అవకాశం

అద్దంకి, ఫిబ్రవరి 1(ఆంధ్రజ్యోతి) : రెండు దశాబ్దాల క్రితం నిర్మించారు.. ప్రజలకు గుక్కెడు నీటిని అందించలేకపోయారు. దీంతో నేటికీ నిరుపయోగంగా ఉండిపోయింది. ఈ నేపథ్యంలో విద్యుత్‌ శాఖ మంత్రి, అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ ఆ ప్రాజెక్ట్‌పై ప్రత్యేక దృష్టి సారించారు. ధర్మవరం సమ్మర్‌ స్టోరేజీ ట్యాంక్‌ పునర్నిర్మాణానికి రూ.5.70 కోట్లు నిధులు మంజూరు చేయించారు. వివరాల్లోకెళ్తే...

అద్దంకి మండలం ధర్మవరం గ్రామ పెద్ద చెరువులో కొంత భాగాన్ని సమ్మర్‌స్టోరేజీ ట్యాంక్‌గా మార్పుచేసి అద్దంకి మేజర్‌ కాలువ నుంచి నీటిని పంపింగ్‌ చేసేవిధంగా ఏర్పాటుచేశారు. నీటి పంపింగ్‌ సామర్థ్యం తక్కువగా ఉండటం, స్టోరేజీ ట్యాంక్‌లోకి పంపింగ్‌ చేసిన నీరు ఇట్టే ఇంకిపోతుండటంతో కొద్దికాలానికే ఆ పథకం మూలన పడింది. మండలంలోని ధర్మవరం, శంఖవరప్పాడు, కలవకూరు, శింగరకొండపాలెం, గోపాలపురం, చక్రాయపాలెం, శాంతినగర్‌, చినకొత్తపల్లి, శ్రీనివాసనగర్‌, సాధునగర్‌, గోవాడ, కొత్తరెడ్డిపాలెం తదితర గ్రామాలలో ఏర్పాటు చేసిన ఓవర్‌హెడ్‌ ట్యాంక్‌ల నుంచి నీటి సరఫరా జరగాల్సి ఉంది. సమ్మర్‌స్టోరేజీ ట్యాంక్‌లో నీరు నిల్వ ఉండకపోవటంతో పథకం నీరుగారిపోయింది. దీంతో ఆయా గ్రామాలకు ఏర్పాటు చేసిన పైప్‌లైన్‌లు, కొన్ని గ్రామాలలో ఓవర్‌హెడ్‌ ట్యాంక్‌లు నిరుపయోగంగా మారాయి. అదే సమయంలో కొన్నిచోట్ల ధ్వంసమయ్యాయి. ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మంత్రి రవికుమార్‌ ధర్మవరం సమ్మర్‌ స్టోరేజీ ట్యాంక్‌ పునర్నిర్మాణంపై దృష్టి సారించి రూ.5.70 కోట్లు మంజూరు చేయించారు. ఇప్పటికే టెండర్లు కూడా పూర్తయ్యాయి. త్వరలో పనులు ప్రారంభించనున్నారు. పనులన్నీ పూర్తయితే 12 గ్రామాలకు సాగర్‌ నీరు సరఫరా చేసే అవకాశం ఏర్పడుతుంది.


పనులు చేసేది ఇలా...

సమ్మర్‌స్టోరేజీ ట్యాంక్‌ అడుగున ఉన్న లూజ్‌ సాయిల్‌ తవ్విబయటకు తరలించి, దాని స్థానంలో నీరు ఇంకకుండా ఉండే విధంగా బ్లాక్‌ సాయిల్‌ తోలి రోలింగ్‌ చేయనున్నారు.

అద్దంకి మేజర్‌ కాలువ నుంచి తక్కువ రోజులలో సమ్మర్‌ స్టోరేజీ ట్యాంక్‌కు ఎక్కువ నీటిని సరఫరా చేసేందుకు వీలుగా ఎక్కువ సామర్థ్యం మోటార్లు ఏర్పాటు చేయనున్నారు.

ధర్మవరంలో ఇంటింటికీ కుళాయి కనెక్షన్‌లు ఇచ్చేవిధంగా అంతర్గత పైప్‌లైన్‌లు ఏర్పాటు చేయనున్నారు.

మిగిలినచోట్ల ఆయా గ్రామాలకు కేటాయించిన నిధులతో అంతర్గత పైప్‌లైన్‌లు, ఇంటింటికీ కుళాయి పనులు జరగనున్నాయి.

Updated Date - Feb 01 , 2026 | 10:54 PM