Share News

‘అన్న ఎన్టీఆర్‌’ స్ఫూర్తితో అభివృద్ధి

ABN , Publish Date - Jan 18 , 2026 | 10:49 PM

అభివృద్ధికి స్ఫూర్తి ప్రదాత, తెలుగు ప్రజల కీర్తిని నలుదిశలా చాటిన మహానాయకుడు దివంగత ఎన్టీఆర్‌ యుగపురుషుడు అని, ఆయన స్ఫూర్తితో అభివృద్ధే లక్ష్యంగా ముందుకెళుతున్నామని రాష్ట్ర మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, డాక్టర్‌ డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి చెప్పారు.

‘అన్న ఎన్టీఆర్‌’ స్ఫూర్తితో అభివృద్ధి
సభలో మంత్రులు రామనారాయణరెడ్డి, స్వామి, ఎంపీ మాగుంట, ఎమ్మెల్యేలు జనార్దన్‌, ఉగ్ర

మంత్రులు స్వామి, ఆనం

స్వర్గీయ నందమూరి తారకరామారావుకు ఘన నివాళి

రక్తదాన శిబిరం, అన్నదానం ఏర్పాటు

నగరంలో పలుచోట్ల కార్యక్రమాలు

ఘనంగా ఎన్టీఆర్‌ 29వ వర్ధంతి

ఒంగోలు, కార్పొరేషన్‌, జనవరి 18 (ఆంధ్రజ్యోతి) : అభివృద్ధికి స్ఫూర్తి ప్రదాత, తెలుగు ప్రజల కీర్తిని నలుదిశలా చాటిన మహానాయకుడు దివంగత ఎన్టీఆర్‌ యుగపురుషుడు అని, ఆయన స్ఫూర్తితో అభివృద్ధే లక్ష్యంగా ముందుకెళుతున్నామని రాష్ట్ర మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, డాక్టర్‌ డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి చెప్పారు. టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్‌ ఆధ్వర్యంలో ఎన్టీఆర్‌ 30 వర్ధంతిని ఆదివారం ఒంగోలులో ఘనంగా నిర్వహించారు. జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి జిల్లా ప్రధాన కార్యదర్శి కొఠారి నాగేశ్వరరావు అధ్యక్షత వహించగా, ముఖ్య అతిఽథులుగా మంత్రులతోపాటు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఒంగోలు పార్లమెంట్‌ నియోజకవర్గ టీడీపీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్‌ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలోనే తెలుగుల ప్రజల కీర్తిని చాటడమే కాకుండా, సినీ నటుడుగా, రాజకీయనాయకుడుగా అన్నీ వర్గాల ప్రజల కోసం అహర్శిలు కృషి చేశారన్నారు. ఆనాడే మహిళలకు ఆస్తి హక్కులో సమానం హక్కు, కిలో బియ్యం రూ.2లకు, జనతా వస్త్రాలు, ఎస్సీ కాలనీల్లో పక్కా గృహాల నిర్మాణం, రహదారుల నిర్మాణం, అభివృద్ధి అన్నీ ప్రాంతాలకు చేరువ కావాలనే లక్ష్యంతో మండల వ్యవస్థను ఏర్పాటు చేశారన్నారు. ఎన్టీఆర్‌ ఆశయాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నిరంతరం కృషి చేస్తున్నారన్నారు. గత వైసీపీ పాలనలో రాష్ట్రాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేయగా, మళ్లీ గాడిలో పెట్టేందుకు చంద్రబాబు నిరంతరం పనిచేస్తున్నారని చెప్పారు. ఈకార్యక్రమంలో మేయర్‌ గంగాడ సుజాత, ఏఎంసీ మాజీ చైర్మన్‌ కామేపల్లి శ్రీనివాసరావు, మునిసిపల్‌ మాజీ చైర్మన్‌ మంత్రి శ్రీనివాసరావు, పీడీసీసీ బ్యాంక్‌ చైర్మన్‌ డాక్టర్‌ కామేపల్లి శీతారామయ్య, మైనార్టీ బోర్డు రాష్ట్ర మాజీ డైరెక్టర్‌ షేక్‌ కపిల్‌బాషా, వైవీ సుబ్బారావు, తెలుగు మహిళ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఆర్ల వెంకటరత్నం, రాష్ట్ర కార్యనిర్వాక కార్యదర్శి నాళం నరసమ్మ, పెద్దిశెట్టి వరలక్ష్మి, తేళ్ల అరుణ, బీరం అరుణ, పసుపులేటి సునీత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన శిబిరంలో పలువురు రక్తాన్ని దానం చేశారు. ముందుగా ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళుల అర్పించారు. అనంతరం పార్టీ ఆధ్వర్యంలో అన్నదానం చేశారు.


వేడుకగా అద్దంకి బస్టాండ్‌లో ఎన్టీఆర్‌ విగ్రహావిష్కరణ

స్థానిక అద్దంకి బస్టాండ్‌లో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్‌ విగ్రహావిష్కరణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. గతంలో ఉన్న విగ్రహాన్ని ఆధునీకరించి, వాటర్‌ ఫౌంటెయిన్‌లతోపాటు, మరింత సుందరంగా, ముస్తాబు చేశారు.ఈ విగ్రహాన్ని మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలు ఆవిష్కరించారు. తొలుత స్థానిక బాపూజీ మార్కెట్‌ కాంప్లెక్స్‌ ముందు దివంగత దామచర్ల ఆంజనేయులు విగ్రహానికి నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పార్టీ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.

మంత్రులకు ఘన స్వాగతం

ఒంగోలు వచ్చిన మంత్రులకు స్థానిక రామనగర్‌లోని ఎంపీ మాగుంట కార్యాలయంలో వద్ద ఘన స్వాగతం పలికారు. అనంతరం మాగుంట అతిథులందరికీ అల్పాహారం విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ పరిశీలకుడు వినుకొండ సుబ్రహ్మణ్యంతోపాటు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Updated Date - Jan 18 , 2026 | 10:49 PM