Share News

శాఖల వారీ నివేదికలు

ABN , Publish Date - Sep 08 , 2026 | 02:49 AM

ప్రభుత్వం అన్ని జిల్లాల కలెక్టర్లతో ఈనెల 10, 11 తేదీల్లో సమీక్ష సమావేశం నిర్వహించనున్న నేపథ్యంలో శాఖల వారీ నివేదికలపై అధికారులు దృష్టి సారించారు. సర్కారు దృష్టికి తీసుకెళ్లాల్సిన కీలక విషయాలు, సంక్షేమ, అభివృద్ధి పనుల పురోగతి, ఇతరత్రా అంశాలపై కలెక్టర్‌ రాజాబాబు అఽధికారులతో సోమవారం సాయంత్రం చర్చించారు.

శాఖల వారీ నివేదికలు

10, 11 తేదీల్లో కలెక్టర్ల సదస్సు

కీలక అధికారులతో చర్చించిన కలెక్టర్‌ రాజాబాబు

ఒంగోలు, సెప్టెంబరు 7 (ఆంధ్రజ్యోతి) : ప్రభుత్వం అన్ని జిల్లాల కలెక్టర్లతో ఈనెల 10, 11 తేదీల్లో సమీక్ష సమావేశం నిర్వహించనున్న నేపథ్యంలో శాఖల వారీ నివేదికలపై అధికారులు దృష్టి సారించారు. సర్కారు దృష్టికి తీసుకెళ్లాల్సిన కీలక విషయాలు, సంక్షేమ, అభివృద్ధి పనుల పురోగతి, ఇతరత్రా అంశాలపై కలెక్టర్‌ రాజాబాబు అఽధికారులతో సోమవారం సాయంత్రం చర్చించారు. ఒక్కో శాఖ అధికారితో మాట్లాడి పలు ఆదేశాలను ఇచ్చారు. తదనుగుణంగా నివేదికలను సిద్ధం చేయాలని ఆదేశించారు. కూటమి ప్రభుత్వం అఽధికారంలోకి వచ్చాక క్రమం తప్పకుండా కలెక్టర్ల సదస్సులను నిర్వహిస్తోంది. ప్రతి మూడు నెలలకు ఒకసారి అమరావతిలోని సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధ్యక్షతన ఈ సమావేశాలు జరుగుతున్నాయి. అలా ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వం వచ్చాక ఏడుసార్లు జరగ్గా 8వ విడత ఈనెల 10, 11 తేదీల్లో నిర్వహిస్తున్నారు. గత సమావేశం మే 7, 8 తేదీల్లో జరగ్గా ఈసారి ఒకనెల ఆలస్యంగా ఏర్పాటు చేశారు. కాగా రెండు రోజులపాటు జరిగే కలెక్టర్ల సదస్సు అజెండాను ఇప్పటికే అన్ని జిల్లాలకు పంపారు.

పీజీఆర్‌ఎస్‌నే ప్రధానం

ఈ విడత అధికారంలోకి వచ్చాక ప్రజల నుంచి వచ్చే వినతుల పరిష్కారం (పీజీఆర్‌ఎస్‌), ఆయా పథకాల లబ్ధిపై ప్రజల్లో సంతృప్తి స్థాయిల పెంపునకు సీఎం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నారు. ఆయావర్గాల ప్రజలకు ప్రభుత్వం ద్వారా అందిస్తున్న సంక్షేమ పథకాల అమలు, అభివృద్ధి పథకాల పురోగతి, కేంద్రప్రభుత్వ భాగస్వామ్యంతో అమలవుతున్న పథకాలు, అభివృద్ధి పనులు, భూసమస్యలు, ఇతరత్రా అంశాలు అజెండాలో ఉన్నాయి. ప్రజల మధ్యకు ఉన్నత స్థాయి అధికారులు వెళ్లి వారితో మమేకం కావడం, సమస్యల పరిష్కారం, జిల్లాలో పరిస్థితులకు అనుగుణంగా ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టడంపై ఫోకస్‌ చేస్తున్నారు. ఆ మేరకు అజెండాపై స్పష్టత ఇవ్వడంతో నివేదికలను అధికారులు సిద్ధం చేస్తున్నారు. ఆయా అంశాలపై జిల్లాస్థాయి కీలక అధికారులకు కలెక్టర్‌ రాజాబాబు సోమవారం దిశానిర్దేశం చేశారు. గత సమావేశంలో ప్రభుత్వం ఆదేశించిన అంశాలపై చేపట్టిన చర్యలతోపాటు ప్రస్తుతం అజెండాకు అనుగుణంగా జిల్లాలో పరిస్థితిపై సమగ్ర నివేదికలు రూపొందించాలని ఆదేశించారు.

Updated Date - Sep 08 , 2026 | 02:49 AM