పొగాకు కొనుగోళ్లలో జాప్యం
ABN , Publish Date - Feb 18 , 2026 | 02:13 AM
ఈ ఏడాది పొగాకు కొనుగోళ్ల ప్రారంభం జాప్యం కానుంది. గత ఏడాది మార్చి 10న దక్షిణాది ప్రాంత వేలం కేంద్రాల్లో కొనుగోళ్లు ఆరంభించగా ఈ ఏడాది ఇంతవరకు ఆ ఊసే కనిపించడం లేదు. ఇప్పటికే మూడొంతుల పంట ఇళ్లకు చేరడంతో వేలంను ఎప్పుడు ప్రారంభిస్తారా అని రైతులు ఎదురుచూస్తున్నారు.
గత ఏడాది మార్చి 10న ప్రారంభం
ఈసారి ఇంతవరకు సన్నాహక చర్యలు శూన్యం
రైతుల ఇళ్లకు చేరిన మూడొంతుల పంట
కదలిక లేని బోర్డు యంత్రాంగం
కర్ణాటకలో మార్కెట్ ఒడిదొడుకులే కారణం
అక్కడ ఇంకా రైతుల వద్దనే 40శాతం పంట
ఒంగోలు, ఫిబ్రవరి 17 (ఆంధ్రజ్యోతి) : ఈ ఏడాది పొగాకు కొనుగోళ్ల ప్రారంభం జాప్యం కానుంది. గత ఏడాది మార్చి 10న దక్షిణాది ప్రాంత వేలం కేంద్రాల్లో కొనుగోళ్లు ఆరంభించగా ఈ ఏడాది ఇంతవరకు ఆ ఊసే కనిపించడం లేదు. ఇప్పటికే మూడొంతుల పంట ఇళ్లకు చేరడంతో వేలంను ఎప్పుడు ప్రారంభిస్తారా అని రైతులు ఎదురుచూస్తున్నారు. బోర్డు అధికారులు మాత్రం అందుకు సంబంధించి ప్రాథమిక చర్యలు కూడా తీసుకోకపోవడం వారిలో ఆందోళన కలిగిస్తోంది. కర్ణాటకలో ప్రస్తుత సీజ న్ పొగాకు మార్కెట్ ఒడిదొడుకులు ఎదుర్కొంటూ ముందుకు సాగడం లేదు. ఇంకా అక్కడి రైతుల ఇళ్ల వద్ద 40 శాతం మేర పంట నిల్వ ఉంది. అది ఇక్కడ వేలం ప్రక్రియ ప్రారంభంపై ప్రభావం చూపే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ఉన్న వేలం కేంద్రాల్లో పొగాకు కొనుగోళ్లను ఎక్కువ సార్లు ఫిబ్రవరిలోనే మొదలుపెడతారు. గతేడాది మార్చి 10న ప్రారంభించారు.
ముందస్తు సమావేశాలు లేవు
గత ఏడాది కర్ణాటకలో మార్కెట్ ఆలస్యంగా ముగిసే పరిస్థితి ఉండటంతో ఇక్కడ మార్చి 10న ప్రారంభించారు. అధిక పంట ఉత్పత్తి, ధరలు సరిలేక వేలం మందగించడం ఇతరత్రా కారణాలతో నవంబరు వరకు ప్రక్రియ సాగింది. సకాలంలో అమ్మకాలు పూర్తికాక, డబ్బు అందక ఇక్కడి రైతులు ఇబ్బంది పడ్డారు. ఈఏడాది అయినా త్వరగా వేలం ప్రారంభించాలని అప్పట్లో రైతులు కోరారు. అయితే ఈ ఏడాది కొనుగోళ్ల ప్రారంభానికి మరింత ఆలస్యమయ్యే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సాధారణంగా వేలం ప్రారంభించే నాటికి కనీసం నెలరోజులు ముందే వ్యాపార, రైతు ప్రతినిధులతో వేలం కేంద్రాల వారీగా, రీజియన్ స్థాయిలో బోర్డు ఉన్నతాధికారుల సమక్షంలో సమావేశాలు నిర్వహించి వేలం నిర్వహణ షెడ్యూల్‌ను బోర్డు అధికారులు ఖరారు చేస్తారు. అలాగే ఆయా వేలం కేంద్రాల్లో ముందస్తుగా తీసుకోవాల్సిన పలు చర్యలపై దృష్టిసారిస్తారు. అయితే ఫిబ్రవరి మూడో వారం వచ్చినా అలాంటి సన్నాహక చర్యలు బోర్డు అధికారుల నుంచి కరువయ్యాయి. దీంతో వేలం ఇప్పట్లో ప్రారంభించరా? అన్న అనుమానాలు రైతుల్లో వ్యక్తమవుతున్నాయి.
ఆలస్యమైతే ఇబ్బందులే..
ఇదే విషయమై కొందరు రైతు ప్రతినిధులు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా తగు స్పందన లేదని సమాచారం. గతేడాది వలే ఈసారి కూడా పంట ఉత్పత్తి అధికంగానే కనిపిస్తోంది. కొనుగోళ్ల ప్రారంభం జాప్యమైతే అమ్మకాలు పూర్తికి ఇంకా ఎక్కువ సమయం పడుతుందని, అలాగైతే ఆర్థికంగా ఇబ్బంది పడతామన్న ఆందోళన రైతుల్లో వ్యక్తమవుతోంది. అయితే ఇక్కడ కొనుగోళ్లకు అధికారులు ఇంకా చర్యలు చేపట్టక పోవడానికి కర్ణాటకలో మార్కెట్ మందగమనంగా సాగడమే కారణమని తెలుస్తోంది. వాస్తవానికి కర్ణాటకలో ప్రస్తుత సీజన్ పంట ఉత్పత్తి ఎక్కువ ఏమీ లేదు. అక్కడ 100 మిలియన్ కిలోల ఉత్పత్తికి అనుమతిస్తే 85 మిలియన్ కిలోలు మించి పండిన దాఖలాలు లేవు. వేలం ప్రక్రియను కూడా గత ఏడాది అక్టోబరులోనే ప్రారంభించారు. అంటే ఈ సమయానికి అక్కడ కొనుగోళ్లు పూర్తి కావాలి. అయితే ఇప్పటివరకు 60శాతం మాత్రమే కొనుగోళ్లు జరగ్గా ఇంకా రైతుల ఇళ్ల వద్ద 40శాతం వరకు పంట ఉన్నట్లు సమాచారం. ఆరంభంలో కొంత మార్కెట్ నిలకడగా కొనసాగినప్పటికీ ఆతర్వాత ఒడిదొడుకులను ఎదుర్కొంది. ప్రస్తుతం కూడా అలాగే ఉంది.
మందకొడిగా మార్కెట్
కర్ణాటకలో వేలంను గరిష్ఠ ధర కిలో రూ.320తో వ్యాపారులు ప్రారంభించగా తర్వాత ధరలు పెరుగుతాయని అక్కడి రైతులు ఆశించారు. అందుకు భిన్నంగా గరిష్ఠ ధర రూ.300 నుంచి రూ.310లోపుగానే ఉండటంతోపాటు నాణ్యమైన లోగ్రేడ్‌ను అసలు కొనకపోతుండటంతో బేళ్లను రైతులు తీసుకురావడం తగ్గించారు. దానికితోడు సిగరెట్లపై జీఎస్‌టీ పెంపు కారణంగా జనవరిలో దాదాపు రెండువారాలు వేలం నిలిచిపోయింది. ప్రస్తుతం కూడా మార్కెట్ మందకొడిగా సాగుతోంది. ఈ పరిణామాలతో వేలం ప్రక్రియ పూర్తికి ఏప్రిల్ ఆఖరు వరకు సమయం పడుతుందనే అంచనా వేస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఇక్కడ తొందరపడి వేలం ప్రారంభిస్తే కంపెనీలు ఏ మేరకు అదనంగా బయ్యర్లను ఏర్పాటు చేసుకొని ఇక్కడ కొనుగోళ్లకు వస్తారు, ధరలు ఎలా ఉంటాయన్న మీమాంసలో బోర్డు అధికారులు ఉండిపోయారు. దీంతో ఇక్కడ కొనుగోళ్లపై ఒక నిర్ణయానికి రాలేకపోతున్నట్లు తెలుస్తోంది. అయితే రైతులు మాత్రం ఈసారి నాణ్యమైన పంట అధికంగా ఉత్పత్తి అవడంతో త్వరితగతిన కొనుగోళ్లను ప్రారంభించాలని కోరుతున్నారు.