Share News

రాయితీ సాగదీత

ABN , Publish Date - Jun 20 , 2026 | 02:51 AM

వ్యవసాయ యంత్ర పరికరాల పంపిణీలో అలవిమాలిన జాప్యం నడుస్తోంది. దరఖాస్తుల స్వీకరణ పూర్తయి నెల దాటినా లబ్ధిదారుల ఎంపిక కొలిక్కిరాలేదు. రాష్ట్రవ్యాప్తంగా అన్నిచోట్లా ఇలాంటి పరిస్థితే నెలకొని ఉన్నట్లు తెలుస్తుండగా జిల్లాలో ఇప్పట్లో ప్రక్రియ కొలిక్కి వచ్చే సూచనలు కనిపించడం లేదు.

రాయితీ సాగదీత

వ్యవసాయ యంత్ర పరికరాల లబ్ధిదారుల ఎంపికలో జాప్యం

గతేడాది కేటాయింపులకు ఇప్పటికీ పూర్తికాని ప్రక్రియ

రూ.4.18 కోట్ల సబ్సిడీకి రూ.61.60 కోట్ల పరికరాలు కోరుతూ దరఖాస్తులు

ట్రాక్టర్‌ అనుబంధ యంత్ర పరికరాలకు భారీ డిమాండ్‌, సర్దుబాటుతో మరింత ఆలస్యం

వ్యవసాయ యంత్ర పరికరాల లబ్ధిదారుల ఎంపికలో తీవ్రజాప్యం జరుగుతోంది. గత నెలాఖరుకు పూర్తిచేసి ఈనెల తొలివారంలో పరికరాలను అందించాల్సి ఉండగా ఇంతవరకూ ఎంపిక ప్రక్రియే ఒక కొలిక్కి రాలేదు. రైతుల అవసరాలకు అనుగుణంగా పరికరాలు అందిస్తున్న పరిస్థితి లేకపోగా వాటిని కూడా సకాలంలో ఇవ్వడం లేదు. నిజానికి ప్రస్తుతం సాగుతున్న లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ గత ఏడాదికి సంబంధించినది. ఆ ఏడాది సాగు సీజన్‌ ముగిసిపోయి మళ్లీ ఖరీఫ్‌ ఆరంభమైనా రైతులకు వ్యవసాయ యంత్ర పరికరాలు అందకపోవడం వ్యవసాయశాఖ పనితీరును పట్టిచూపుతోంది.

ఒంగోలు, జూన్‌ 19 (ఆంధ్రజ్యోతి) : వ్యవసాయ యంత్ర పరికరాల పంపిణీలో అలవిమాలిన జాప్యం నడుస్తోంది. దరఖాస్తుల స్వీకరణ పూర్తయి నెల దాటినా లబ్ధిదారుల ఎంపిక కొలిక్కిరాలేదు. రాష్ట్రవ్యాప్తంగా అన్నిచోట్లా ఇలాంటి పరిస్థితే నెలకొని ఉన్నట్లు తెలుస్తుండగా జిల్లాలో ఇప్పట్లో ప్రక్రియ కొలిక్కి వచ్చే సూచనలు కనిపించడం లేదు. అందుకు రైతుల నుంచి డిమాండ్‌ ఉండే యంత్రాలను కాకుండా ఇతర పరికరాలను ఉన్నతాధికారులు జిల్లాకు కేటాయించడమే కారణమని తెలుస్తోంది. దరఖాస్తుల స్వీకరణ అనంతరం ఇక్కడి అవసరాలకు అనుగుణంగా కేటాయింపుల కోసం ఉన్నతస్థాయి నుంచి అనుమతులు పొందడం, తదనుగుణంగా సర్దుబాటులో ఆలస్యం వల్ల లబ్ధిదారుల ఎంపిక ముందుకు సాగడం లేదు. గత వైసీపీ ప్రభుత్వ కాలంలో గ్రామాల్లో నోరున్న వైసీపీ నేతల నేతృత్వంలో గ్రూపులకు వ్యవసాయ యంత్ర పరికరాలను కట్టబెట్టారు. అయితే వాటిని తమ ఆధీనంలో ఉంచకుని వారు సొంతానికి వాడుకున్నారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ విధానానికి స్వస్తి చెప్పింది. గత ఏడాది వ్యక్తిగతంగా రైతు వారీ వ్యవసాయ యంత్ర పరికరాలు ఇచ్చే విధంగా మార్పులు చేసింది. అలా మార్గదర్శకాల రూపకల్పనలో కొంత జాప్యం కారణంగా జిల్లాల వారీ నిధులు, పరికరాల కేటా యింపు ఆలస్యమైంది. గతేడాది జిల్లాకు రూ.4.18 కోట్ల సబ్సిడీ లభిం చేలా 1,239 యూనిట్లను కేటాయించారు. వాటికి దరఖాస్తుల స్వీకరణ చేపట్టే సరికి గత ఆర్థిక సంవత్సరం ముగిసిపోయింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మేలో వాటిని చేపట్టారు. యూనిట్ల కేటాయింపు పారదర్శ కంగా సాగేందుకు మండలాల వారీ కేటాయించి అర్హులు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకుంటే లాటరీ ద్వారా ఎంపిక చేస్తామని అధికారు లు పేర్కొన్నారు. మొత్తం దరఖాస్తులు అందాక జిల్లా ఇన్‌చార్జి మంత్రి అనుమతితో జేసీ సమక్షంలో లాటరీ తీస్తామని ప్రకటించారు. ఈ ప్రక్రియలో కూడా కొంత గందరగోళం కనిపిస్తుండగా, సరైన వివరణను ఆ శాఖ అధికారులు ఇవ్వలేకపోయారు.

రైతుల నుంచి భారీ స్పందన

జిల్లాలో వ్యవసాయ యంత్ర పరికరాలకు భారీ డిమాండ్‌ వచ్చింది. రూ.4.18 కోట్ల సబ్సిడీ లభించే 1,239 యూనిట్లు కేటాయిస్తే రూ.61.60 కోట్ల సబ్సిడీ అవసరం అయ్యేలా 4,525 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో కేటాయింపులు తక్కువగా ఉన్న ట్రాక్టర్లు, అలాగే వాటికి అనుబంధంగా ఉండే ట్రాలీలు, దున్నకం చేసే పరికరాలు, ఇతరత్రా పరికరాలకు అధికంగా డిమాండ్‌ వచ్చింది. కొన్ని రకాల పరికరాలకు అంతగా డిమాండ్‌ లేదు. దీంతో డిమాండ్‌ అధికంగా ఉన్న వాటికి ఉన్న నిధులు సర్దుబాటు చేయాల్సి రావడంతో గత నెలలోనే పూర్తిచేయాల్సిన ప్రక్రియ నిలిచిపోయింది. ప్రస్తుతం ఖరీఫ్‌ సీజన్‌ ఆరంభమై పక్షంరోజులు గడిచినా లబ్ధిదారుల ఎంపిక ముందుకు సాగడం లేదు.

డిమాండ్‌ ఉంది.. సర్దుబాటు చేస్తాం

ఈవిషయమై జిల్లా వ్యవసాయశాఖ అధికారి ఎస్‌.శ్రీనివాసరావు స్పందిస్తూ జిల్లాలో వ్యవసాయ యంత్ర పరికరాల కోసం భారీ డిమాండ్‌ ఉన్నమాట వాస్తవమేనన్నారు. అయితే ప్రభుత్వం ముందుగా కేటాయించిన దాని ప్రకారం రూ.4.18 కోట్ల సబ్సిడీ మాత్రమే అందుతుందన్నారు. అందువల్ల స్థానికంగా ఉన్న డిమాండ్‌కు అనుగుణంగా పరికరాల సర్దుబాటు అవసరమైందన్నారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని, వారి సూచనలకు అనుగుణంగా సర్దుబాటు చేస్తామన్నారు. దీనిపై శాఖాపరంగా కొంత స్పష్టత కూడా వచ్చిందని తదనుగుణంగా లబ్ధిదారుల గుర్తింపు పూర్తిచేసి త్వరలో అందజేస్తామని తెలిపారు.

Updated Date - Jun 20 , 2026 | 02:51 AM