దూసుకొచ్చిన మృత్యువు
ABN , Publish Date - May 14 , 2026 | 03:14 AM
ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొనడంతో ఇద్దరు యువకు లు దుర్మరణం చెందారు. ఈ ఘటన మండలంలోని మాదాలవారిపాలెం-సలకనూతల గ్రామాల మధ్య బుధవారం చోటుచేసుకుంది.
బైక్‌ను ఢీకొన్న కారు.. ఇద్దరు యువకుల దుర్మరణం
వారు బావాబావమర్దుల కుమారులు
స్నేహితులతో కలిసి శ్రీశైలం వెళ్తుండగా ప్రమాదం
పొదిలి, మే 13 (ఆంధ్రజ్యోతి) : ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొనడంతో ఇద్దరు యువకు లు దుర్మరణం చెందారు. ఈ ఘటన మండలంలోని మాదాలవారిపాలెం-సలకనూతల గ్రామాల మధ్య బుధవారం చోటుచేసుకుంది. అందిన సమాచారం మేరకు.. పొదిలి మండలం గోగినేనివారిపాలెం, చీమకుర్తి మండలం దేవరపాలెం గ్రామాలకు చెందిన ఐదుగురు యువకులు శ్రీశైలానికి దైవదర్శనం కోసం ద్విచక్రవాహనాలపై బయల్దేరారు. వారు మాదాలవారిపాలెం-సలకనూతల మధ్యకు చేరుకునే సరికి ఎదురు మార్కాపురం వైపు నుంచి వస్తున్న కారు ఓ మోటార్ సైకిల్‌ను బలంగా ఢీకొట్టింది. దీంతో బైక్‌ను నడుపు తున్న దేవరపాలెంనకు చెందిన పుత్తూరి అనిల్ (22) అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రగాయాలైన అంకబాబు (20)ను 108లో పొదిలి వైద్యశాలకు తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం ఒంగోలుకు తీసుకెళ్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. ఘటనా స్థలాన్ని ఎస్‌ఐ రాజేష్ పరిశీలించి ప్రమాదానికి గల కారణాలను తెలుసుకున్నారు. పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాన్ని పొదిలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. వీరిద్దరూ బావబావమ్మర్దుల కుమారులు కావడం అత్యంత విషాదం. అనిల్ ఒంగోలులోని ఒక కెమికల్ ఫ్యాక్టరీలో పనిచేస్తుండగా, అంకబాబు కూలి పనులు చేస్తుంటాడని బంధువులు చెప్పారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రాజేష్ తెలిపారు. ప్రమాదం చోటుచేసుకున్న కొద్దిసేపటికి అటువైపు వెళ్తున్న కలెక్టర్ విజయసునీత ఘటనా స్థలం వద్ద ఆగారు. గాయపడిన యువకుడిని ఆసుపత్రికి తరలించడంలో దగ్గరుండి చర్యలు తీసుకున్నారు.