Share News

దూసుకొచ్చిన మృత్యువు

ABN , Publish Date - Jul 26 , 2026 | 03:16 AM

ఉంగరం కొనేందుకు చీమకుర్తి వచ్చిన తల్లీకుమారుడు తిరిగి సొంతూరు వెళుతుండగా రోడ్డు ప్రమాదం రూపంలో వారిని మృత్యువు కబళించింది. మండల పరిధిలో యల్లయ్యనగర్‌ సమీపాన కర్నూల్‌ రోడ్డుపై శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది.

దూసుకొచ్చిన మృత్యువు
శివకృష్ణ (ఫైల్‌), మల్లీశ్వరి (ఫైల్‌)

తల్లీకొడుకు వెళ్తున్న బైక్‌ను ఢీకొట్టిన మరో బైక్‌

కిందపడిన వారిపై నుంచి వెళ్లిన గ్రానైట్‌ ట్రాలీ

ఇద్దరూ అక్కడికక్కడే మృతి

యల్లయ్యనగర్‌ సమీపంలో ఘటన

చీమకుర్తి, జూలై 25 (ఆంధ్రజ్యోతి) : ఉంగరం కొనేందుకు చీమకుర్తి వచ్చిన తల్లీకుమారుడు తిరిగి సొంతూరు వెళుతుండగా రోడ్డు ప్రమాదం రూపంలో వారిని మృత్యువు కబళించింది. మండల పరిధిలో యల్లయ్యనగర్‌ సమీపాన కర్నూల్‌ రోడ్డుపై శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. మర్రిపూడి మండలం చిమట గ్రామానికి చెందిన వెలుతుర్ల సుబ్బారెడ్డి, భార్య మల్లీశ్వరి (52), ఆమె కుమారుడు శివకృష్ణ (22) ఇంటి నుంచి రెండు బైక్‌లపై చీమకుర్తికి వచ్చారు. బంగారం దుకాణంలో ఉంగరం కొనుగోలు చేసిన అనంతరం తిరిగి స్వగ్రామానికి బయల్దేరారు. ఒక బైక్‌పై సుబ్బారెడ్డి, వెనుక మరోబైక్‌పై తల్లీకుమారుడు వెళ్తున్నారు. రామతీర్థం దాటిన తర్వాత యల్లయ్యనగర్‌ సమీపాన కంకరమిల్లు వద్ద ఎదురుగా రాంగ్‌రూట్‌లో వచ్చిన మోటార్‌ బైక్‌ తల్లీకొడుకు వెళ్తున్న ద్విచక్రవాహనాన్ని ఢీకొంది. దీంతో అదుపుతప్పి తల్లీకొడుకు రోడ్డుపై పడిపోయారు. అదేసమయంలో వేగంగా వస్తున్న గ్రానైట్‌ రాళ్ల లోడు ట్రాలీ వీరిద్దరిపై నుంచి వెళ్లడంతో మల్లీశ్వరి, శివకృష్ణ అక్కడికక్కడే మృతిచెందారు. శివకృష్ణ పైనుంచి వెళ్లిన ట్రాలీ మల్లేశ్వరిని మాత్రం కొద్దిదూరం ఈడ్చుకెళ్లడంతో ఆమె దేహం గుర్తుపట్టలేని విధంగా నుజ్జునుజ్జయ్యింది. సీఐ దాసరి ప్రసాద్‌ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. భర్త సుబ్బారెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నారు.

--------------------------------------

Updated Date - Jul 26 , 2026 | 03:16 AM