Share News

దూసుకొచ్చిన మృత్యువు

ABN , Publish Date - Jul 09 , 2026 | 02:43 AM

జాతీయ రహదారిపై లారీల్లో వెళ్తూ ఇద్దరు డ్రైవర్‌లు గొడవపడ్డారు. రెండు వాహనాలను నిలిపి వాదులాడుకుం టుండగా ట్రావెల్స్‌ బస్సు రూపంలో వారిని మృత్యువు కబళించింది. బస్సు వేగంగా వచ్చి వారు ఆపిన లారీని ఢీకొనడంతో ముందు ఉన్న డ్రైవర్‌లలో ఒకరు ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. మరొక డ్రైవర్‌ తీవ్ర గాయా లతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.

దూసుకొచ్చిన మృత్యువు
దెబ్బతిన్న ట్రావెల్స్‌ బస్సు ముందుభాగం

జాతీయ రహదారిపై లారీలను ఆపి డ్రైవర్ల వాగ్వాదం

వెనుక నుంచి వేగంగా వచ్చి ఢీకొట్టిన ట్రావెల్స్‌ బస్సు

తీవ్రగాయాలతో ఒకరు ఘటనా స్థలంలోనే దుర్మరణం

మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి

బస్సులోని నలుగురు ప్రయాణికులకు గాయాలు

క్షతగాత్రులు ఒంగోలు రిమ్స్‌కు తరలింపు

మద్దిపాడు, జూలై 8 (ఆంధ్రజ్యోతి) : జాతీయ రహదారిపై లారీల్లో వెళ్తూ ఇద్దరు డ్రైవర్‌లు గొడవపడ్డారు. రెండు వాహనాలను నిలిపి వాదులాడుకుం టుండగా ట్రావెల్స్‌ బస్సు రూపంలో వారిని మృత్యువు కబళించింది. బస్సు వేగంగా వచ్చి వారు ఆపిన లారీని ఢీకొనడంతో ముందు ఉన్న డ్రైవర్‌లలో ఒకరు ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. మరొక డ్రైవర్‌ తీవ్ర గాయా లతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. ఈ ఘటన మద్దిపాడు మండలం ఏడుగుండ్లపాడులోని హైవే ఫ్లైఓవర్‌పై బుధవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కృష్ణా జిల్లా గొల్లమూడి గ్రామానికి చెందిన డ్రైవర్‌ కనగాల వెంకటసుబ్రహ్మణ్య ప్రసాద్‌(52) విజయవాడ నుంచి తమిళనాడు రాష్ట్రంలోని చెన్నైకు లారీలో సరుకు తీసుకుని బయలు దేరాడు. ఏడుగుండ్లపాడు వద్ద ప్లైవోవర్‌ బ్రిడ్జి మీదుకు వచ్చేసరికి చెన్నైకు వెళుతున్న మరో లారీ డ్రైవర్‌ మురుగేష్‌ గౌండర్‌ (55)తో ఓవర్‌ టేకింగ్‌ విషయమై గొడవ జరిగింది. ఇద్దరు డ్రైవర్లు తమ వాహనాలను వంతెనపై ఆపి వాగ్వాదానికి దిగారు. ఈక్రమంలోనే విజయవాడ నుంచి ఓ ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు తిరుపతి వెళుతూ ఫ్లైఓవర్‌ వద్దకు రాగానే ఆగి ఉన్న లారీని వేగంగా ఢీకొట్టింది. అది కదిలి ముందువైపు గొడవ పడుతున్న డ్రైవర్లకు తగిలింది. మురుగేష్‌ గౌండర్‌కు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. వెంకట సుబ్రహ్మణ్యప్రసాద్‌కు తీవ్రగాయాలు కాగా 108 వాహనంలో ఒంగోలు జీజీహెచ్‌కు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మరణించాడు. సమాచారం అందుకున్న మద్దిపాడు ఎస్‌ఐ వెంకటసూర్య ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని రిమ్స్‌కు తరలించారు. ట్రావెల్స్‌ బస్సులో ఉన్న నలుగురు ప్రయాణికులకు గాయాలు కాగా చికిత్స నిమిత్తం రిమ్స్‌ వైద్యశాలకు తరలించారు. డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Jul 09 , 2026 | 02:43 AM