కేజీబీవీ పోస్టుల భర్తీలో ప్రతిష్టంభన
ABN , Publish Date - Feb 03 , 2026 | 03:01 AM
జిల్లాలోని టైప్ 3, 4 కస్తూర్బా బాలికా విద్యాలయాల్లో బోధనేతర పోస్టుల భర్తీలో ప్రతిష్టంభన నెలకొంది. నోటిఫికేషన్ విడుదల చేసి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించిన అధికారులు ఆ తర్వాత ప్రక్రియను జాప్యం చేస్తున్నారు.
అర్హుల జాబితా ప్రకటనలో జాప్యం
జిల్లా విభజనతో గందరగోళం
దరఖాస్తుదారుల్లో ఆందోళన
ఒంగోలు విద్య, ఫిబ్రవరి 2 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలోని టైప్ 3, 4 కస్తూర్బా బాలికా విద్యాలయాల్లో బోధనేతర పోస్టుల భర్తీలో ప్రతిష్టంభన నెలకొంది. నోటిఫికేషన్ విడుదల చేసి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించిన అధికారులు ఆ తర్వాత ప్రక్రియను జాప్యం చేస్తున్నారు. కేజీబీవీ పోస్టులకు దరఖాస్తులు సమర్పించేందుకు ఒంగోలులోని సమగ్రశిక్ష జిల్లా ప్రాజెక్టు అధికారి కార్యాలయానికి అభ్యర్థులు పోటెత్తిన విషయం విదితమే. జనవరి 11 వరకు దరఖాస్తులు స్వీకరించారు. నోటిఫికేషన్‌లో పేర్కొన్న వివరాల మేరకు దరఖాస్తుల పరిశీలన పూర్తిచేసి అర్హులైన అభ్యర్థుల వివరాలను జనవరి 19న ప్రకటించాల్సి ఉంది. ఆ గడువు ముగిసి పక్షం రోజులు కావస్తోంది. అయితే సమగ్రశిక్ష జిల్లా ప్రాజెక్టు కార్యాలయం నుంచి ఎటువంటి స్పందన లేక లేకపోవడంతో దరఖాస్తుదారులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలోని టైప్-3 కేజీబీవీల్లో 43 పోస్టులు ప్రకటించగా 3,133 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. అదేవిధంగా టైప్ 4 ల్లో 61 పోస్టులు ప్రకటించారు. వాటి కోసం 1,885 మంది దరఖాస్తు చేసారు. మొత్తం 104 పోస్టులకు మొత్తం 5,018 మంది దరఖాస్తు చేశారు. జిల్లా పునర్విభనలో గత ప్రకాశం జిల్లా పరిధిలోని కనిగిరి, మార్కాపురం, వైపాలెం, గిద్దలూరు నియోజకవర్గాలు నూతనంగా మార్కాపురం జిల్లాను ఏర్పాటు చేశారు. అదేక్రమంలో గతంలో నెల్లూరు జిల్లా నుంచి కందుకూరును, బాపట్ల జిల్లా నుంచి అద్దంకిని వేరు చేసి ప్రకాశం జిల్లాలో కలిపారు. కేజీబీవీ పోస్టుల నోటిఫికేషన్‌లో మార్కాపురం జిల్లా పరిధిలోని నాలుగు నియోజకవర్గాల్లోని పోస్టులను చేర్చారు. అదేవిధంగా ప్రస్తుతం అద్దంకి, కందుకూరు నియోజకవర్గాలు కొత్తగా ప్రకాశం జిల్లాలో చేరాయి. ఈ క్రమంలో కొంత గందరగోళం నెలకొంది. జిల్లా విద్యాశాఖలో మాత్రం ఇప్పటివరకు టీచర్ల నియామకాలు బదిలీలు పూర్వ ఉమ్మడి జిల్లా ప్రాతిపదికగానే జరుగుతుండటంతో ఎటువంటి గందరగోళం లేకుండానే సాఫీగా సాగిపోతున్నాయి. మరి కేజీబీవీ పోస్టుల భర్తీలో ఏ విధానం పాటిస్తారో దరఖాస్తుదారుల్లో నెలకొన్న ఆందోళనకు ఎప్పటికి తెరపడుతుందో వేచిచూడాల్సిందే.