పొగాకు కొనుగోళ్లకు ముహూర్తం ఖరారు
ABN , Publish Date - Mar 07 , 2026 | 01:38 AM
పొగాకు కొనుగోళ్లకు ముహూర్తం ఖరారైంది. రాష్ట్రంలో రెండు విడతలుగా వేలం ప్రారంభించనున్నారు. తొలివిడత కొనుగోళ్లను ఈనెల 25వ తేదీన, రెండో విడత వచ్చేనెల 9న మరికొన్ని వేలం కేంద్రాల్లో చేపట్టనున్నారు.
రాష్ట్రంలో రెండు విడతలుగా వేలం
ఈనెల 25న తొలి దశ ప్రారంభం
వచ్చేనెల 9న రెండో విడత
ఒంగోలు, మార్చి 6 (ఆంధ్రజ్యోతి) : పొగాకు కొనుగోళ్లకు ముహూర్తం ఖరారైంది. రాష్ట్రంలో రెండు విడతలుగా వేలం ప్రారంభించనున్నారు. తొలివిడత కొనుగోళ్లను ఈనెల 25వ తేదీన, రెండో విడత వచ్చేనెల 9న మరికొన్ని వేలం కేంద్రాల్లో చేపట్టనున్నారు. ఆ మేరకు గుంటూరులోని పొగాకు బోర్డు ప్రధాన కార్యా లయంలో శుక్రవారం జరిగిన కీలక సమావే శంలో నిర్ణయించారు. గత ఏడాది రాష్ట్రంలో మార్చి 10న పొగాకు వేలంను ప్రారంభించారు. ఈ ఏడాది కూడా అలాగే త్వరగా చేపట్టాలని రైతులు కోరుతున్నప్పటికీ ప్రస్తుతం జరుగు తున్న కర్ణాటక మార్కెట్ ఒడిడొడుకులతో వ్యాపా రులు, బోర్డు అధికారులు కొంత ఆలస్యం చేశారు. రైతుల నుంచి ఒత్తిడి పెరగడంతో వివిధ స్థాయిల్లో సమావేశాలను నిర్వహించారు. రైతుల అభిప్రాయాలను సేకరించగా ఎక్కువ మంది ఈనెలలోనే కొనుగోళ్లను చేపట్టాలని కోరారు. ఈ నేపథ్యంలో పొగాకు బోర్డు ప్రధాన కార్యాలయంలో శుక్రవారం రాష్ట్రంలోని అన్ని వేలం కేంద్రాల రైతుప్రతినిధులు, పొగాకు కొనుగోళ్లు చేసే కంపెనీల ప్రతినిధులతో కీలక సమావేశం సంయుక్తంగా జరిగింది. పొగాకు బోర్డు చైర్మన్ యశ్వంత్‌కుమార్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ దివ్యశ్రీల నేతృత్వంలో నిర్వహించిన ఈ సమావేశంలో వ్యాపార ప్రతినిధులు మేలో వేలం ప్రారంభించాలని కోరారు. రైతు ప్రతినిధులు అందుకు అంగీకరించలేదు. ఇప్పటికే అత్యధిక ప్రాంతాల్లో పొగాకు గ్రేడింగ్‌లు కూడా జరుగుతున్నాయని, ఎండల తీవ్రతతో పంట నాణ్యత దెబ్బతినడంతోపాటు తూకం కూడా తగ్గుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే కొనుగోళ్లను ప్రారంభించాలని గట్టిగా కోరారు. దీంతో ఈనెల 25నుంచి పొగాకు కొనుగోళ్లను చేపట్టాలని బోర్డు అధికారులు నిర్ణయించారు. తొలివిడత దక్షిణాది రీజియన్ పరిధిలోని పొదిలి, కందుకూరు-2 కేంద్రాలు, ఉత్తరాదిలోని రాజమండ్రి రీజియన్ పరిధిలోని అన్నికేంద్రాల్లో ఈనెల 25న కొనుగోళ్లు ప్రారంభించనున్నారు. దక్షిణాదిలో మిగిలిన కేంద్రాలైన ఒంగోలు-1, 2, వెల్లంపల్లి, టంగుటూరు కొండపి, కనిగిరి, కందుకూరు-1, డీసీపల్లి, కలిగిరి కేంద్రాల్లో ఏప్రిల్ 9 నుంచి చేపట్టనున్నారు.