డెడ్‌లైన్..!
ABN , Publish Date - Aug 06 , 2026 | 11:24 PM
వెలిగొండ ప్రాజెక్ట్ మొదటి టన్నెల్ ద్వారా నీరివ్వాలనే ధృడ సంకల్పంతో ఉన్న ప్రజా ప్రభుత్వం ఈ నెలాఖరు నాటికి పెండింగ్ పనులు లేకుండా చేసి సిద్ధం కావాలని అధికారులకు సంకేతాలు పంపింది. ఈ నేపథ్యంలో ఇరిగేషన్ అధికారులు టన్నెల్ అంతర్భాగంలో పెండింగ్ పనులన్నీ పూర్తి చేయిస్తూ నీటి విడుదలకు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈ నెలాఖరు నాటికి వెలిగొండ పనులు పూర్తి
ఆ దిశగా అధికారులకు ఆదేశాలిచ్చిన ప్రభుత్వం
పెండింగ్ వర్క్స్ పూర్తి చేసేలా సన్నాహాలు
నిర్వాసితుల సమస్యపై కలెక్టర్ సమీక్ష
ఆర్‌అండ్‌ఆర్ ఇవ్వగానే ఖాళీ చేయాలని ఆదేశాలు
పలు సమస్యలు ఏకరువు పెట్టిన నిర్వాసితులు
పరిశీలిస్తామన్న ప్రజాప్రతినిధులు
మార్కాపురం, ఆగస్టు 6 (ఆంధ్రజ్యోతి) : వెలిగొండ ప్రాజెక్ట్ మొదటి టన్నెల్ ద్వారా నీరివ్వాలనే ధృడ సంకల్పంతో ఉన్న ప్రజా ప్రభుత్వం ఈ నెలాఖరు నాటికి పెండింగ్ పనులు లేకుండా చేసి సిద్ధం కావాలని అధికారులకు సంకేతాలు పంపింది. ఈ నేపథ్యంలో ఇరిగేషన్ అధికారులు టన్నెల్ అంతర్భాగంలో పెండింగ్ పనులన్నీ పూర్తి చేయిస్తూ నీటి విడుదలకు ఏర్పాట్లు చేస్తున్నారు. అదే సమయంలో ప్రధానంగా ఉన్న ముంపు గ్రామాల సమస్య పరిష్కారంపై జిల్లా అధికార యంత్రాంగం దృష్టి సారించింది. ఇప్పటికే పునరావాస కాలనీల్లో మౌలిక వసతులు పూర్తి చేసేందుకు వేగంగా చర్యలు చేపట్టారు. కలెక్టర్ ఎం. విజయసునీత, జాయింట్ కలెక్టర్ పి. శ్రీనివాసులు పునరావాస కాలనీల్లో లే అవుట్‌లను పరిశీలిస్తూ నిర్వాసితుల నివాసానికి అనువుగా మార్చేందుకు ఏమి చేయాలనే అంశాలపై చర్యలు చేపట్టారు.
నిర్వాసితుల ఖాతాల వివరాలు ఆన్‌లైన్‌లోకి
ప్రధాన సమస్యగా ఉన్న ఆర్‌అండ్‌ఆర్ సమస్యను ప్రభుత్వం పరిష్కరించేందుకు చర్యలు చేపట్టింది. అందుకోసం రూ.905.56 కోట్లు కేటాయించి తొలివిడతగా రూ.300 కోట్లు నిర్వాసితుల ఖాతాల్లో జమ చేసింది. ఇటీవల స్వయంగా సీఎం చంద్రబాబునాయుడు వెలిగొండ వద్దకు వచ్చి 2,351 మందికి నగదు జమ చేయటంతో నిర్వాసితుల్లో కూడా నమ్మకం కలిగింది. ఇక మిగిలిన రూ.605 కోట్లు మంజూరుకు కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉండటంతో వారి ఖాతాల వివరాలు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేసే పనిలో కూడా అధికారులు నిరంతరం పనిచేస్తూ దాదాపు 90 శాతం పూర్తి చేశారు.
నిర్వాసితులతో కలెక్టర్ సమావేశం
మొదటి టన్నెల్ ద్వారా నీరిచ్చేందుకు మొదట ముంపు గ్రామాలు ఖాళీ చేయాల్సి ఉంది. దీంతో అధికారులు ఆ దిశగా చర్యలు చేపట్టారు. గురువారం కలెక్టరేట్‌లో ముంపు గ్రామాల ప్రతినిధులు, ఇరిగేషన్ అధికారులతో కలిసి కలెక్టర్ విజయసునీత సమావేశమయ్యారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి, ఎర్రగొండపాలెం నియోజకవర్గ ఇన్‌చార్జి గూడూరి ఎరిక్షన్‌బాబు హాజరయ్యారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ఆర్‌అండ్‌ఆర్ వచ్చేలా కృషి చేస్తామని, మరో ఇరవై రోజుల్లో ముంపు గ్రామాలు ఖాళీ చేసేందుకు సిద్ధం కావాలని కలెక్టర్ సూచించారు. అందరి బిల్లులు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయటం పూర్తవుతుందని, త్వరలోనే మిగిలిన అందరి ఖాతాల్లో నగదు జమ అవుతుందని చెప్పారు. నిర్వాసితుల నుంచి ఇంకా పలు డిమాండ్‌లు తెరపైకి రావటంతో అవన్నీ ఒక కమిటీ వేసి పరిశీలించేందుకు చర్యలు తీసుకుంటే బాగుంటుందని ఎమ్మెల్యే కందుల, ఇన్‌చార్జి ఎరిక్షన్‌బాబు సూచించారు. ఇంకా పలు కాలనీల్లో అర్హులు పరిహారం అందకుండా పోతున్న వారు ఉంటున్నారని ఆ సమస్యలు ఎదురవ్వకుండా చూడాలని వారు కలెక్టర్‌ను కోరారు. ఈ సమావేశంలో కనిగిరి, మార్కాపురం ఆర్డీవో అజయ్‌కుమార్, శివరామిరెడ్డి, వెలిగొండ ప్రాజెక్ట్ ఎస్‌ఈ అబుతలీం పాల్గొన్నారు.