Share News

బెట్టింగులకు కేంద్రంగా దర్శి

ABN , Publish Date - Mar 14 , 2026 | 02:58 AM

బెట్టింగ్‌లకు దర్శి కేంద్రంగా మారింది. అమాయకులైన యువకులను మాయమాటలతో నమ్మించి అక్రమార్కులు ఉచ్చులో దించుతున్నారు. ఇక్కడ క్రికెట్‌ బెట్టింగ్‌లతోపాటు ఏ ఎన్నికలు జరిగినా ఫలితాలపై భారీగా పందేలు పెడతారు. గత కొన్ని సంవత్సరాలుగా దర్శి ప్రాంతంలో ఈ జాడ్యం ఉంది.

బెట్టింగులకు కేంద్రంగా దర్శి
క్రికెట్‌ బెట్టింగ్‌ వేస్తూ పట్టుబడిన వారి వివరాలను వెల్లడిస్తున్న డీఎస్పీ లక్ష్మీనారాయణ

పునరావృతమవుతున్న గత పరిస్థితులు

బానిసలవుతున్న యువత

ఆర్థికంగా చితికిపోతున్న అనేక కుటుంబాలు

దర్శి, మార్చి 13 (ఆంధ్రజ్యోతి): బెట్టింగ్‌లకు దర్శి కేంద్రంగా మారింది. అమాయకులైన యువకులను మాయమాటలతో నమ్మించి అక్రమార్కులు ఉచ్చులో దించుతున్నారు. ఇక్కడ క్రికెట్‌ బెట్టింగ్‌లతోపాటు ఏ ఎన్నికలు జరిగినా ఫలితాలపై భారీగా పందేలు పెడతారు. గత కొన్ని సంవత్సరాలుగా దర్శి ప్రాంతంలో ఈ జాడ్యం ఉంది. పదేళ్ల క్రితం క్రికెట్‌ బెట్టింగ్‌లు ఉధృతంగా జరుగుతున్న సమయంలో జిల్లా పోలీసులు దృష్టి పెట్టి అనేకమందిపై బలమైన కేసులు నమోదు చేశారు. ముమ్మరంగా దాడులు నిర్వహించడంతో నిర్వాహకులు భయపడి తెరమరుగయ్యారు. కొంతకాలం బెట్టింగులు పూర్తిగా తగ్గిపోయాయి. నాలుగు సంవత్సరాలుగా మళ్లీ మొదలయ్యాయి. 2024 ఎన్నికల్లో ఫలితాలపై కోట్లాది రూపాయల పందేలు జరిగాయి. క్రికెట్‌ బెట్టింగ్‌లు కూడా నిరంతరం కొనసాగుతున్నాయి. కొంతమంది ఇక్కడ నిర్వాహకులు బుకీలతో లింకులు పెట్టుకొని ఈ వ్యాపారం చేస్తున్నట్లు సమాచారం. ఇటీవల జరిగిన టీ 20 ప్రపంచ కప్‌ క్రికెట్‌ పోటీల సందర్భంగా ముమ్మరంగా క్రికెట్‌ బెట్టింగ్‌లు జరిగాయి. కొంతమందికి డబ్బులు రాగా అనేకమంది లక్షలాది రూపాయలు పోగొట్టుకొని లబోదిబోమంటున్నారు. గతంలో అనేక మంది యువకులు అప్పులపాలై ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. అనేక కుటుంబాలు ఆర్థికంగా చితికిపోయాయి. కొంతమంది తమ బిడ్డల కోసం ఆస్తులు అమ్మి అప్పులు తీర్చారు. ప్రస్తుతం మళ్లీ ఆ పరిస్థితులు పునరావృతం కానుండటంతో ప్రజలు తీవ్ర ఆందో ళనలు చెందుతున్నారు. రెండురోజుల క్రితం దర్శిలో క్రికెట్‌ బెట్టింగ్‌లు నిర్వహిస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్న విషయం విదితమే. నిర్వాహకులు వినియోగిస్తున్న టెక్నాలజీ చూస్తే అవాక్కయ్యే పరిస్థితి నెలకొంది. పక్కా ప్రణాళికతో అధిక సంఖ్యలో సెల్‌ఫోన్లు దగ్గర పెట్టుకొని బెట్టింగ్‌లు నిర్వహిస్తూ పట్టుబడ్డారు. పోలీసులు ప్రత్యేక దృష్టి సారించి బెట్టింగ్‌ల సంస్కృతిని పూర్తిగా నివారించాలని ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు.

Updated Date - Mar 14 , 2026 | 02:58 AM