ప్రమాదం.. ప్రయాస
ABN , Publish Date - Sep 19 , 2026 | 03:19 AM
మండలంలోని గిరిజన గూడేలను తాగునీటి కష్టాలు వెంటాడుతున్నాయి. ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు కురవకపోవడంతో సెప్టెంబర్‌లో కూడా గొంతెండుతోంది. దీంతో బిందె నీటి కోసం గిరిజనం బండెడు కష్టాలు పడుతోంది.
గుక్కెడు నీటి కోసం గిరిజనుల అవస్థలు
పొలాల్లో బోర్ల వద్దకు వెళ్లి తెచ్చుకుంటున్న ఒక గూడెం వాసులు
వెలిగొండ ఫీడర్ కాలువలోకి దిగి సాహసం చేస్తున్న మరో తాండా ప్రజలు
పెద్దదోర్నాల మండలంలో ఇదీ పరిస్థితి
ఇది వెలిగొండ ఫీడర్ కాలువ. వాలుగా ఉన్న కట్టపై నుంచి లోపలికి దిగి బిందెలు, బకెట్లతో నీటిని పట్టుకొంటున్నారు. ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా నీటిలో గల్లంతే! కానీ తాగునీటి కోసం ఇంతటి సాహసాన్ని చేస్తున్నారు పనుకుమడుగు గిరిజన గూడెం వాసులు.
చంకలో పసిపడ్డ.. నెత్తిన నీటి బిందె.. పొలాల్లో వ్యవసాయ బోర్ల వద్దకు వెళ్లి ప్రయాస. ఇదీ గొంతు తడుపుకునేందుకు అవసరమైన నీటి కోసం గండివీరభద్రస్వామి గూడెం వాసులు పడుతున్న అవస్థ.
పెద్దదోర్నాల, సెప్టెంబరు 18 (ఆంధ్రజ్యోతి): మండలంలోని గిరిజన గూడేలను తాగునీటి కష్టాలు వెంటాడుతున్నాయి. ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు కురవకపోవడంతో సెప్టెంబర్‌లో కూడా గొంతెండుతోంది. దీంతో బిందె నీటి కోసం గిరిజనం బండెడు కష్టాలు పడుతోంది. మండల కేంద్రానికి ఎనిమిది కిలోమీటర్ల దూరంలోని పెద్దబొమ్మలాపురం గ్రామ పరిధిలోని గండివీరభద్రస్వామి చెంచుగూడెంలో 30 కుటుంబాలు నివసిస్తున్నాయి. ఓవర్ హెడ్ ట్యాంకు ఉన్నా ఉపయోగం లేకుండా పోయింది. బోరుకు సంబంధించిన మోటర్ మరమ్మతులకు గురై కొన్ని నెలలైనా పట్టించుకున్న వారులేరని గిరిజనులు ఆరోపిస్తున్నారు. దీంతో దగ్గరలో ఉన్న పొలాల్లోని వ్యవసాయ బోర్ల వద్ద నీటిని తెచ్చుకుంటున్నారు. అదికూడా వారం రోజులు పగలు, వారం రోజులు రాత్రి పూట కరెంటు ఉన్నప్పుడు మాత్రమే వెళ్లి తెచ్చుకోవాల్సి వస్తున్నదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక మండల కేంద్రానికి ఐదు కి.మీ దూరంలో ఉన్న పనుకుమడుగు గిరిజన గూడెంలో 60కుటుంబాలు నివసిస్తున్నాయి. చాన్నాళ్లుగా గూడెంలోని బోరు పనిచేయడం లేదు. దీంతో గ్రామం పక్కనే ఉన్న వెలిగొండ ఫీడర్ కాలువలోకి దిగి నీటిని తెచ్చుకుంటున్నారు. అందుకోసం పెద్ద సాహసాన్ని చేస్తున్నారు. వాలుగా ఉన్న కాలువకట్ట మీదుగా నీటిలోకి దిగి బిందెలతో పట్టుకొంటున్నారు. ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా, కాలుజారినా ఉఽధృతంగా ప్రవహిస్తున్న నీటిలో కొట్టుకుపోయే ప్రమాదం ఉంది. ఇటీవలే ఫీడర్ కాలువలో ఈతకు దిగి ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. వారిలో ఒకరి మృతదేహం లభ్యంకాగా, మరొకరి జాడ ఇప్పటి వరకూ తెలియ లేదు.ప్రభుత్వం, సంబంధిత అధికారులు స్పందించి నీటి కష్టాలు తీర్చాలని గిరిజనులు కోరుతున్నారు.