Share News

సిలిం‘డర్‌’

ABN , Publish Date - Mar 24 , 2026 | 02:29 AM

జిల్లాలో వంట గ్యాస్‌ కొరత తీవ్రంగా ఉంది. సరఫరాలో అంతరాయం ప్రజలకు తలనొప్పిగా మారింది. ఆ ప్రభావం పలు వ్యాపార సంస్థలు, వీధి దుకాణాలు, టిఫిన్‌ సెంటర్లు, కర్రీపాయింట్‌లు, హోటళ్లపైనా చూపుతోంది. దీంతో కొందరు వ్యాపారులు తాత్కాలికంగా హోటళ్లు, దుకాణాలను మూసివేశారు.

సిలిం‘డర్‌’
గ్యాస్‌ కొరత కారణంగా ధర పెంచినట్లు ఓ కర్రీస్‌ పాయింట్‌ వద్ద అంటించిన పోస్టర్‌

కొనసాగుతున్న ‘బండ’ కష్టాలు..!

వంట గ్యాస్‌ సరఫరాలో అంతరాయం

పలు హోటళ్లు, టిఫిన్‌ సెంటర్‌లలో స్వల్పంగా పెరిగిన ధరలు

అన్ని ఆహార పదార్థాలపై రూ. 5 నుంచి రూ.10 పెంపు

ప్రజలను వెంటాడుతున్న సమస్య

జిల్లాలో వంట గ్యాస్‌ కొరత తీవ్రంగా ఉంది. సరఫరాలో అంతరాయం ప్రజలకు తలనొప్పిగా మారింది. ఆ ప్రభావం పలు వ్యాపార సంస్థలు, వీధి దుకాణాలు, టిఫిన్‌ సెంటర్లు, కర్రీపాయింట్‌లు, హోటళ్లపైనా చూపుతోంది. దీంతో కొందరు వ్యాపారులు తాత్కాలికంగా హోటళ్లు, దుకాణాలను మూసివేశారు. మరికొందరు రేట్లు పెంచి, మెనూను తగ్గించి అమ్మకాలు చేస్తున్నారు. నిమ్మకాయ షోడా నుంచి కర్రీస్‌ పాయింట్‌ల వరకు.. వీధుల్లోని టిఫిన్‌ బండ్ల నుంచి పెద్ద హోటళ్ల వరకు అన్ని ఆహార పదార్థాలపై రూ.5 నుంచి రూ.10 వరకు పెంచేయడంతో సామాన్యులపై భారం పడుతోంది. అలాగే సిలిండర్ల బ్లాక్‌ మార్కెట్‌ కూడా విచ్చలవిడిగా సాగుతోంది. డొమెస్టిక్‌ గ్యాస్‌ సిలిండర్‌ రూ.2వేల వరకు అమ్ముతున్నారు.

ఒంగోలు కార్పొరేషన్‌, మార్చి 23 (ఆంధ్రజ్యోతి): ఇరాన్‌-ఇజ్రాయెల్‌ యుద్ధం ప్రభావం గ్యాస్‌ సరఫరాపై పడింది. ఎక్కడా వంట గ్యాస్‌కు కొరత లేదని ప్రభుత్వాలు ప్రకటిస్తుండగా..సామాన్య, మధ్య తరగతి కుటుంబాలు, వివిధ వ్యాపారాలపైన మాత్రం తీవ్ర ప్రభావం చూపుతోంది. ఒకవైపు గ్యాస్‌ సిలిండర్‌ తీసుకోవడానికి బుకింగ్‌కి బుకింగ్‌కి మధ్య గడువు 25 రోజులు పెంచడంతో వీధి వ్యాపారం భారంగా మారింది. గతంలో గ్యాస్‌ బాయ్‌లు సిలిండర్లను అడిగిన వెంటనే ఇచ్చేవారు. ఇప్పుడు యుద్ధం ప్రభావం కారణంగాసరఫరాలో కోత విధిస్తున్నారు. దీంతో అటు గృహ వినియోగదారులకు, ఇటు ఆహార పదార్ధాల తయారు చేసే హోటల్స్‌, టిఫిన్‌ బండ్లు, టీదుకాణాలు, హోటల్స్‌కి గ్యాస్‌ కష్టాలు ఎక్కువయ్యాయి.

ఆహార పదార్ధాల ధరల పెంపు

నిన్న మొన్నటివరకు వీధికో టిఫిన్‌ సెంటర్‌ దర్శనమివ్వగా గత పదిహేను రోజుల నుంచి సగానికిపైగా మూతపడ్డాయి. సామాన్యుడికి అవసరమైన టిఫిన్‌ సెంటర్‌లో అతి ముఖ్యమైనవంట గ్యాస్‌ అందుబాటులో లేకపోవడంతో పూర్తిస్థాయిలో వ్యాపారం చేయలేక, తాత్కాలికంగా మూసివేస్తున్నారు. మరికొందరు గ్యాస్‌ దొరికినపుడల్లా రెండు రోజులు దుకాణాలు తెరుస్తున్నారు. ఇకపోతే కొన్ని టీ దుకాణాలు వారం రోజులుగా మూతపడిపోయాయి. ఒంగోలు నగరంలోనూ, ఇతర పట్టణ ప్రాంతాల్లో కాస్తంత పేరున్న హోటల్స్‌ మూసివేయలేక బ్లాక్‌లో సిలిండర్లు కొనుగోలు చేస్తూ టిఫిన్‌ రేట్లను రూ.5 నుంచి రూ.10కి పెంచేశారు. ఇక గతంలో రూ.10 ఉండే టీ ప్రస్తుతం రూ.13కి పెంచారు. భోజన హోటళ్లలో కొన్ని కూరలను మాత్రమే గ్యాస్‌పై వండుతుండగా, అన్నం ఇతర పెద్దమొత్తంలో తయారు చేసే వంటకాలకు కట్టెల పొయ్యి వాడుతున్నారు. గతంలో చిన్న హోటల్స్‌లో రూ.10 నుంచి రూ.15 ఉండే సాదా దోసె ఇప్పుడు రూ.15 నుంచి రూ. 20కి పెంచడంతోపాటు వాటి సైజులు కూడా తగ్గించేశారు. ఇక పెద్ద హోటళ్లలో ఇడ్లీ, దోశ, పూరి, వడ, ఇలా ఏ టిఫిన్‌ అయినా ఒక్కోదానిపై రూ.10 పెంచేశారు. మండుతున్న ఎండలకు శీతల పానీయలైన నిమ్మకాయ షోడా ఇతరత్రా వాటి రేట్లు పెంచేశారు. షోడా బండ్లలో ఉపయోగించే సిలిండర్‌ ధరలు పెరిగాయంటూ ఒక్కో గ్లాస్‌కు రూ.5 పెంచి వసూలు చేస్తున్నారు. అయితే ధర కాస్తంత ఎక్కువైనా ఫర్లేదు అనుకునే ప్రజలకు ఉదయం 10 గంటలకే టిఫిన్‌ అయిపోయిందనే సమాధానం వినిపిస్తోంది. నిత్యం టిఫిన్‌ బండ్లతో రద్దీగా ఉండే ఒంగోలులోని పప్పుబజార్‌లో ప్రస్తుతం ఒకటి రెండుసెంటర్లు మాత్రమే ఉండటం, అవి కూడా రాత్రి 10గంటలకే మూతపడిపోతుండటం గమనార్హం. ఇ పుల్కా, చపాతీ, బోండా, బజ్జీలు నూడిల్స్‌ సెంటర్‌లలో ఆహార పదార్థాలపై రూ.5 నుంచి రూ.10కి పెంచేశారు. గ్యాస్‌ కొరత తీవ్రంగా వేధిస్తుండటంతో ఇంకెన్నాళ్లీ ఈ గ్యాస్‌ కష్టాలు అంటూ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఏజెన్సీల మూత, గోడౌన్‌ల వద్ద బారులు

వంట గ్యాస్‌ సరఫరా సరిపడినంత లేకపోవడంతోపాటు, వినియోగదారుల నుంచి బుకింగ్‌లు ఎక్కువయ్యాయి. ఏజెన్సీలు వినియోగదారులకు సకాలంలో సిలిండర్లు అందించలేని పరిస్థితి ఉంది. దీంతో కొన్ని రోజులుగా తమ ఏజెన్సీలను మూసివేసి, ఏకంగా గోడౌన్‌ల వద్దకు మకాం మార్చేశారు. దీంతో విషయం తెలియని కొందరు షాపు వద్ద గంటల తరబడి పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఉంది. అరకొర సరఫరాతో ఏజెన్సీల నిర్వాహకులు ప్రజలకు సమాధానం చెప్పలేక, సర్దుబాటుతో నెట్టుకొస్తున్నారు. మరోవైపు అవకాశాన్ని ఆసరాగా చేసుకుని కొందరు ప్రైవేటు వ్యక్తులు రూ.950 ఉండే సిలిండర్‌ను ఏకంగా రూ.2వేలకు అమ్మేసుకుంటున్నట్లు సమాచారం.

Updated Date - Mar 24 , 2026 | 02:29 AM