సైబర్ చోర్
ABN , Publish Date - May 07 , 2026 | 02:40 AM
అమాయకులు, వృద్ధులు, విశ్రాంత ఉద్యోగులే లక్ష్యంగా సైబర్ నేరగాళ్లు వల విసురుతున్నారు. బెదిరింపులు, హెచ్చరికలతో భయకంపితులను చేసి అందినకాడికి దోచుకుంటున్నారు. తాము సీబీఐ అధికారులం, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నుంచి ఫోన్ చేస్తున్నాం, ఢిల్లీ పోలీసులం.. ఇలా అనేక రకాలుగా వీడియో కాల్‌లో మాట్లాడి డబ్బులు ఊడ్చేస్తున్నారు.
డిజిటల్ అరెస్టు పేరుతో రూ.కోట్లు కొల్లగొడుతున్నారు
ఉమ్మడి ప్రకాశంలో 50కిపైగా కేసులు
బాధితుల్లో విశ్రాంత ఉద్యోగులు, వృద్ధులు అధికం
నకిలీ ఖాతాల పేరుతో మోసం
అమాయకులు, వృద్ధులు, విశ్రాంత ఉద్యోగులే లక్ష్యంగా సైబర్ నేరగాళ్లు వల విసురుతున్నారు. బెదిరింపులు, హెచ్చరికలతో భయకంపితులను చేసి అందినకాడికి దోచుకుంటున్నారు. తాము సీబీఐ అధికారులం, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నుంచి ఫోన్ చేస్తున్నాం, ఢిల్లీ పోలీసులం.. ఇలా అనేక రకాలుగా వీడియో కాల్‌లో మాట్లాడి డబ్బులు ఊడ్చేస్తున్నారు. వారి వద్ద లేకపోయినా బంగారం, ఆస్తులు కుదవపెట్టి అక్రమార్కులకు ముట్టజెప్పి విలవిల్లాడుతున్న కుటుంబాలు అనేకం ఉన్నాయి. ఇప్పటివరకు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 50కిపైగా కేసులు నమోదయ్యాయి. ఇటీవల ఒంగోలు తాలూకా పోలీసు స్టేషన్‌లో రెండు కేసులు నమోదు కాగా, అద్దంకితోపాటు ఇతర ప్రాంతాలలో సైబర్ నేరగాళ్ల ఉచ్చులో మోసపోయిన వారు అనేక మంది ఉన్నారు.
ఒంగోలు క్రైం, మే 6 (ఆంధ్రజ్యోతి) : సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. వారు సృష్టించిన డిజిటల్ అరెస్టు అనే పదం ప్రస్తుతం అమాయకులను వణికిస్తోంది. ఈ పేరుతో కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నారు. వారి వలలో చిక్కి బాధితులు విలవిల్లాడిపోతున్నారు. మొదట వీడియో కాల్ ద్వారా బెదిరించే నేరగాళ్లు భయంకరమైన నాటకమాడతారు. వెంటవెంటనే కాల్ చేసి భయకంపింతులను చేసి అరెస్టు నుంచి బయటపడాలంటే ఎంతోకొంత బ్యాంక్ అకౌంట్‌కు ట్రాన్స్‌ఫర్ చేయాలంటూ పెద్దమొ త్తంలో నగదు దోచుకుంటున్నారు. రోజుల తరబడి సైబర్ నేరగాళ్లు బాధితులను వెంటాడుతున్నారు. ఈ విషయం బయటకు పొక్కితే అరెస్టు చేయడం ఖాయమని బెదిరిస్తున్నారు. వీలైనన్ని సార్లు బాధితుల నుంచి భారీగా సొమ్మును తమ ఖాతాలకు బదిలీ చేయించుకుంటున్నారు. తర్వాత ఫోన్లు పనిచేయకుండా చేసి పత్తాలేకుండా పోతున్నారు. ఇలా ఇప్పటివరకు ఉమ్మడి జిల్లాలో 50 వరకు సైబర్ మోసం కేసులు నమోదైనట్లు అంచనా.
నేరగాళ్లు అనుసరించే పద్ధతులు
కొంతమంది ఆధార్, ఫోన్ నంబర్‌తోపాటు ప్రాఽథమిక సమాచారాన్ని సైబర్ నేరగాళ్లు సేకరి స్తారు. అనంతరం వీడియో కాల్ చేస్తారు. మీ ఫోన్ నంబరు లేదా ఆధార్ కార్డు అక్రమ కార్యకలాపాలకు వినియోగించినట్లు గుర్తించామని బెదిరిస్తారు. మీపైన ముంబై లేదా ఢిల్లీ లాంటి పెద్ద నగరాల్లో కేసు నమోదైందని నమ్మిస్తారు. ఇలాంటి కేసులు నుంచి బయటపడాలి అంటే పెద్దమొత్తంలో ఖర్చు అవుతుందని, రోజుల తరబడి వీడియో కాల్స్ చేసి బెదిరిస్తారు. నకిలీ డాక్యుమెంట్లు తయారుచేసి వీడియో కాల్‌లోనే చూపిస్తారు. ఈ విషయం బయటకు చెబితే వెంటనే అరెస్టు చేస్తాం, మీరు ఈ కేసులో నుంచి బయటకు రాలేరు అంటూ ఒత్తిడి చేస్తారు. అధికారుల వలే నటించి పోలీసు యూనిఫాంలో, స్టేషన్ సెటప్‌లో వీడియోకాల్ చేసి చూపిస్తారు. గంటలు లేదా రోజుల తరబడి బాధితుడిని ఒంటరిని చేసి భయభ్రాంతులకు గురిచేస్తారు. చివరగా మీరు ఈ కేసు నుంచి బయటపడాలంటే ఓ మార్గముందని చెబుతూ మీ ఖాతాలో ఉన్న నగదు ప్రభుత్వ ఖాతాకు బదిలీ చేస్తే.. కేసు క్లియరైన తర్వాత మీ ఖాతాలో నగదు మీరు తీసుకోవచ్చని మభ్యపెడతారు. ఆపైనా నగదు వారి ఖాతాలకు చేరిన వెంటనే ఇక కనిపించరు. నంబరు కూడా పనిచేయకుండా చేస్తారు.
ఇటీవల జిల్లాలో జరిగిన ఘటనలు ఇవీ..
జనవరిలో అద్దంకికి చెందిన రిటైర్డ్ ఉద్యోగిని మోసం చేసి రూ.1.23కోట్లు కొల్లగొట్టారు. బాధితుడికి ముంబై పోలీసులమని ఫోన్ చేశారు. మీ పేరుతో ఉన్న పార్శిల్‌లో డ్రగ్స్ దొరికాయి అంటూ భయపెట్టారు. సుమారు వారంరోజులపాటు ఆయన్ను ఇంటి నుంచి బయటకు రానివ్వకుండా డిజిటల్ అరెస్టు పేరుతో బంధించారు. అనంతరం భయపెట్టి భారీగా కొల్లగొట్టారు. చివరకు మోసపోయానని గుర్తించిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదుచేయడంతో విషయం బయటకు వచ్చింది.
ఒంగోలు నగరంలో మంగమూరురోడ్డులో ఓ కాలనీలో నివాసముంటున్న మహిళకు ఈనెల 16న సైబర్ నేరగాళ్లు ఫోన్ చేశారు. మీపై 17 కేసులు నమోదయ్యాయని చెప్పారు. మీ పేరుతో ముంబైలో కెనరా బ్యాంక్ అకౌంట్ ఉందని, అందులో ఉన్న రూ.3కోట్లలో 75శాతం ఇంటర్నేషనల్ గ్యాంగ్‌కు చెందిన సాధిక్‌ఖాన్ మీకు ఇచ్చారని చెప్పారు. మిమ్మల్ని వెంటనే అరెస్టు చేయబోతున్నామని బెదిరించారు. ఈ కేసులో నుంచి మిమ్మల్ని తప్పించాలి అంటే రూ.50లక్షలు నగదు ఇవ్వాలని, ఈ విషయం మీ భర్తకు కూడా తెలియకూడదని బెదిరించారు. దీంతో ఆమె ఈనెల 20న రూ.9లక్షలు నగదు సైబర్ నేరగాళ్ల అకౌంట్‌లో వేశారు. తర్వాత 22న మరో రూ.30లక్షలు మరో అకౌంట్‌లో వేశారు. ఇలా మొత్తం రూ.39లక్షలు సైబర్ నేరగాళ్లు కాజేశారు. అనంతరం ఆమెకు అనుమానం వచ్చి తన భర్తకు తెలియజేసి ఒంగోలు తాలూకా పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఒంగోలు కర్నూలు రోడ్డులోని ఓ కాలనీలో నివాసముంటున్న వృద్ధుడికి గతనెల 4న ఓ ఫోన్ వచ్చింది. మీ పేరుతో ఉన్న సిమ్‌కార్డుతో మనీలాండరింగ్ జరిగిందని చెప్పారు. అంతేకాదు మీరు ఓ క్రిమినల్ కేసులో నిందితులు అని భయపెట్టారు. తాము కేంద్ర సంస్థల అధికారులమని డిజిటల్ అరెస్టు చేశామని చెప్పారు. మీ బ్యాంక్ ఖాతాలు సీజ్ చేస్తున్నామని, మిమ్మల్ని అరెస్టు చేస్తున్నామని బెదిరించారు. బ్యాంకు ఖాతాలో ఉన్న నగదు ఆర్‌బీఐ వద్ద సేఫ్‌గా ఉంటుందని నమ్మించారు. దీంతో ఆయన కెనరా బ్యాంక్‌లో ఉన్న రూ.1.56 కోట్ల నగదును సైబర్ నేరగాళ్లు ఇచ్చిన బ్యాంక్ ఖాతాలకు బదిలీ చేశాడు. తర్వాత తాను సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకున్నానని తెలుసుకొని ఒంగోలు తాలూకా పోలీసులకు ఫిర్యాదు చేశారు.