సైబర్ కేటుగాళ్ల వల
ABN , Publish Date - Mar 11 , 2026 | 11:14 PM
సైబర్ మోసాలు పెరిగిపోతున్నాయి. ముందస్తుగా ప్రజలను పోలీసులు ఎంత అప్రమత్తం చేసినా వారి వలనుంచి తప్పించుకోలేకపో తున్నారు. వెరసి నగదును పోగొట్టుకుంటు న్నారు.
ఇద్దరిని నమ్మించి డబ్బు కాజేసిన వైనం
పొదిలి, మార్చి 11 (ఆంధ్రజ్యోతి) : సైబర్ మోసాలు పెరిగిపోతున్నాయి. ముందస్తుగా ప్రజలను పోలీసులు ఎంత అప్రమత్తం చేసినా వారి వలనుంచి తప్పించుకోలేకపో తున్నారు. వెరసి నగదును పోగొట్టుకుంటు న్నారు. పొదిలిలో బుధవారం జరిగిన రెండు ఘటనల్లో సైబర్‌కేటుగాళ్ల బారిన పడి ఇద్దరు మోసపోయారు. ఒకరు ఎల్‌ఐసీ కార్యాలయం పేరుతో రూ. 33వేలు, మరొకరు తనిఖీ అధికారి పేరుతో రూ.6 వేలు ఫోన్‌పే, స్కాన్ చేసి డబ్బులు పోగొట్టుకున్నారు. వివరాల్లోకి వెళితే.. పొదిలి మండలంలోని రాజుపాలెం గ్రామానికి చెందిన దోసపాటి ఏడుకొండలుకు బుధవారం ఫోన్‌కాల్ వచ్చింది. మేము ‘ఎల్‌ఐసీ కార్యాలయం నుంచి ఫోన్ చేస్తున్నాం. మీఅమ్మ పేరుమీద పాలసీ ఉంది. దాని గడువు ముగిసింది. మీఅమ్మకు నగదు వస్తుంది. అది పంపాలంటే కొంతనగదును ఈస్కాన్ చేయాలని క్యూఆర్‌కోడ్ స్కాన్‌ను పంపించారు. అది నమ్మిన ఏడుకొండలు తన అకౌంట్‌లో నగదు లేకపోవడంతో సోదరుడి అకౌంట్ నుంచి రూ. 33వేలు స్కాన్ చేశారు. ఆ స్కాన్ కూడా ఎలా చేయాలో గుర్తు తెలియని వ్యక్తి ఆపరేట్ చేశాడని బాధితుడు తెలిపారు. డబ్బు పోయిన తరువాత ఫోన్ స్విచ్ ఆగిపోవడంతో తాను మోసపోయానని గుర్తించి బాధితుడు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
ఫుడ్ ఇన్‌స్పెక్టర్ పేరుతో టోకరా
ఫుడ్ ఇన్‌స్పెక్టర్ పేరుతో రూ.60వేలు డిమాండ్ చేసి చివరకు రూ.6వేలు టోకరా వేసిన ఘటన బుధవారం చోటుచేసుకుంది. బుధవారం పట్టణంలో ఫుడ్ ఇన్‌స్పెక్టర్ శివతేజ హోటళ్లు, దుకాణాలలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. విషయం తెలుసుకున్న కేటుగాళ్లు ఆయనపేరు ఉపయోగించి ఓ కిచిడీపాయింట్ యజమాని వెంకటరమణకి 6301919789 నెంబరు నుంచి ఫోన్ చేశాడు. ‘మేము ఫుడ్ ఇన్‌స్పెక్టర్ కార్యాలయం నుంచి ఫోన్ చేస్తున్నాం. మీకు లైసెన్స్ లేదు. గతంలో మీదగ్గరకు వచ్చి నాణ్యత కలిగిన ఆహారాన్ని తయారు చేయాలని, లైసెన్స్ తీసుకోవాలని చెప్పాం కాని తీసుకోలేదు. ప్రస్తుతం పట్టణంలో అధికారులు తనిఖీలు చేస్తున్నారు. వాళ్లు మీదగ్గరకు వస్తే భారీగా జరిమానా వేస్తారు. వారు మీదగ్గరకు రాకుండా ఉండాలంటే నాకు రూ.60వేలు ఫోన్‌పే చేయాలని’ సూచించారు. దీంతో యజమాని కంగారు పడి నా వద్ద అంతడబ్బు లేదు ఆరువేలు మాత్రమే ఉన్నాయని చెప్పాడు. అయితే వెంటనే 9493893913 నెంబర్‌కు ఫోన్‌పే చేయమని సూచించాడు. దీంతో భయానికి గురైన హోటల్ యజమాని రూ.6వేలు ఫోన్‌పే చేశాడు. ఆతరువాత నిమిషాల వ్యవధిలోనే ఆరెండు ఫోన్ నెంబర్లు స్విచ్‌ఆ్‌ఫ అయిపోయాయి. తాను మోసపోయానని గమనించిన యజమాని పట్టణంలో ఉన్న ఫుడ్ ఇన్‌స్పెక్టర్ శివతేజను కలిసి జరిగిన విషయాన్ని తెలియజేశారు. ఇదిసైబర్ నేరగాళ్ల పని అని గుర్తించిన ఆయన బాధితుడిని పోలీ్‌సస్టేషన్‌కు తీసుకెళ్లి ఫిర్యాదు ఇప్పించారు.
రకరకాలుగా సైబర్ మోసాలు
సైబర్ నేరగాళ్లు రకరకాలుగా మోసాలకు పాల్పడుతున్నారని, ప్రజలు అప్పమత్తంగా ఉండాలని సీఐ రాజే్‌షకుమార్ తెలిపారు. రకరకాలుగా ఫోన్‌లు చేసి ఓటీపీలు, మీకు లక్షల్లో లోన్‌లు వచ్చాయని, క్రెడిట్‌కార్డు ఇస్తామని చెబుతుంటారని, వాటిని ఎవరూ నమ్మవద్దని ఆయన తెలిపారు. బ్యాంకులు, కార్యాలయాలు, అధికారులు ఎవరూ ఫోన్ చేసి వివరాలు అడగరనే విషయాన్ని గుర్తించుకోవాలన్నారు. సైబర్ నేరగాళ్లు ఏరూపంలోనైనా మోసం చేయవచ్చని, కొత్తఫోన్ నంబర్ల నుంచి ఎవరైనా ఫోన్ చేస్తే ఎత్తవద్దని, సంబంధం లేని వ్యక్తులతో ఎక్కువగా మాట్లాడవద్దని సూచించారు. మీకు తెలియనివారు ఫోన్‌చేసి మీవ్యక్తిగత వివరాలు, అడ్రస్సులు అడిగితే ఎట్టిపరిస్థితుల్లో చెప్పవద్దని సూచించారు.