Share News

‘కట్‌’కటా

ABN , Publish Date - Sep 19 , 2026 | 03:18 AM

ఎల్‌నినో ప్రభావం విద్యుత్‌ శాఖకు తగిలింది. వేసవిని తలపించేలా ఎండలు భగభగ మండు తుండటంతో కరెంట్‌ వినియోగం పెరిగింది. దీంతో ఈనెల మొదటివారం నుంచి లోడ్‌ రిలీఫ్‌ పేరుతో కోతలు ప్రారంభమయ్యాయి.

‘కట్‌’కటా

విద్యుత్‌ శాఖకు ఎల్‌నినో సెగ

భారీగా పెరిగిన కరెంటు వినియోగం

ఉమ్మడి జిల్లాలో అప్రకటిత కోతలు

గ్రామాల్లో ఎక్కువైన కష్టాలు

ఇబ్బందులు పడుతున్న ప్రజలు

పరిశ్రమలకు రాత్రుళ్లు బంద్‌

ఒంగోలు క్రైం, సెప్టెంబరు 18 (ఆంధ్రజ్యోతి) : ఎల్‌నినో ప్రభావం విద్యుత్‌ శాఖకు తగిలింది. వేసవిని తలపించేలా ఎండలు భగభగ మండు తుండటంతో కరెంట్‌ వినియోగం పెరిగింది. దీంతో ఈనెల మొదటివారం నుంచి లోడ్‌ రిలీఫ్‌ పేరుతో కోతలు ప్రారంభమయ్యాయి. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాలలో అనధికార కోతలు అధికంగా ఉన్నాయి. దీంతో ప్రజలు అవస్థ పడుతున్నారు. సుమారు 7 నుంచి 8 గంటలపాటు గ్రామాల్లో కోతలు విధిస్తున్నారు. పగలు రాత్రి అనే తేడా లేకుండా సరఫరా నిలిపివేస్తున్నారు. మండల కేంద్రాలలో కనీసం రెండు గంటలు కోత పెడుతున్నారు. పారిశ్రామిక రంగంతోపాటు ఆక్వా రైతులకు సైతం అవస్థలు తప్పడం లేదు. ఒంగోలు నగరంలో కూడా విద్యుత్‌ కోతలు షరామామూలైపోయాయి. శివారు కాలనీలలో తరచూ సరఫ రా నిలిచిపోతుండటంతో జనం ఇబ్బందిపడుతున్నారు. ఒకపక్క ఉక్కపోత, మరోపక్క కరెంటు కోతలతో విలవిల్లాడుతున్నారు. ఎల్‌నినో మూలంగా వర్షాలు లేకపోవడంతో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో రెండు మిలియన్‌ యూనిట్లు అదనంగా విద్యుత్‌ వాడకం పెరిగింది. దీంతో లోడ్‌ రిలీఫ్‌ పేరుతో కోతలు పెట్టి అధికారులు నెట్టుకొస్తున్నారు.

భారీగా పెరిగిన వినియోగం

ఎల్‌నినో ఎఫెక్ట్‌తో జిల్లాలో 40 డిగ్రీల వరకు ఉష్టోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో ఏసీలు, కూలర్లు, ఫ్యాన్ల వినియోగం అధికమైంది. గత ఏడాది కంటే ఈ ఏడాది సెప్టెంబరులో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో రెండు మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ వాడకం పెరిగింది. గతేడాదిలో సెప్టెంబరులో 9.600 మిలియన్‌ యూనిట్లు వినియోగిస్తే ప్రస్తుతం 11.446 మిలియన్‌ యూనిట్లు వాడుతున్నారు. ఇలా ఒక్కసారిగా వినియోగం పెరగడంతో లోడ్‌ రిలీఫ్‌ పేరుతో కోతలు తప్పనిసరి అయ్యాయని విద్యుత్‌ శాఖ అధికారులు చెబుతున్నారు. అయితే ఇలాంటి అప్రకటిత కోతలు లేకుండా వచ్చేనెల నుంచి చర్యలు తీసుకోనున్నట్లు తెలిసింది.

గ్రామాలలో రేయీపగలు

గ్రామీణ ప్రాంతాలలో రాత్రి పగలు ఎడాపెడా కోతలు పెడుతున్నారు. సుమారు 6 నుంచి 7 గంటల పాటు సరఫరా ఉండటం లేదు. రాత్రుళ్లు ఉక్కపోతలతో ప్రజలు విలవిల్లాడుతున్నారు. కరెంటు ఎప్పుడు పోతుందో, ఎప్పడు వస్తుందో తెలియని పరిస్థితి ఉంది. గ్రామీణ ప్రాంతాలలో ఆక్వా సాగుకు కష్టాలు ఎక్కువయ్యాయి. వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్లకు కూడా కోత పెడుతున్నారని రైతులు వాపోతున్నారు.

పరిశ్రమల్లో రాత్రి షిఫ్టులు నిలిపివేత

పరిశ్రమలకు రాత్రుళ్లు కరెంట్‌ కోత విధిస్తున్నారు. రాత్రి 6 గంటలకు పోయిన కరెంటు 12గంటలకు కూడా వస్తుందనే గ్యారెంటీ లేకుండా పోయిందని పరిశ్రమల యజమానులు చెబుతున్నారు. దీంతో రాత్రిషిఫ్టు పనులు నిలిపివేశామని అంటున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే పరిశ్రమలు నడపడం కష్టంగా ఉంటుందని యజమానులు తెలిపారు.

Updated Date - Sep 19 , 2026 | 03:18 AM