‘ఉజ్వల’ కోటాలో కోత
ABN , Publish Date - Jun 11 , 2026 | 02:58 AM
ప్రధాన మంత్రి ఉజ్వల యోజన (పీఎంయూవై) లబ్ధిదారులకు కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. వంట గ్యాస్ కోటాను కుదించింది. 2016లో పథకాన్ని ప్రారంభించినప్పుడు సబ్సిడీతో ఏటా 12 సిలిండర్లు ఇచ్చింది. గత ఏడాది ఆ సంఖ్యను తొమ్మిదికి తగ్గించింది.
ఇక నుంచి ఏడాదికి నాలుగు సిలిండర్‌లే!
19,524మంది లబ్ధిదారులపై భారం
ఒంగోలు కలెక్టరేట్, జూన్ 10 (ఆంధ్ర జ్యోతి): ప్రధాన మంత్రి ఉజ్వల యోజన (పీఎంయూవై) లబ్ధిదారులకు కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. వంట గ్యాస్ కోటాను కుదించింది. 2016లో పథకాన్ని ప్రారంభించినప్పుడు సబ్సిడీతో ఏటా 12 సిలిండర్లు ఇచ్చింది. గత ఏడాది ఆ సంఖ్యను తొమ్మిదికి తగ్గించింది. ఇప్పుడు నాలుగుకు పరి మితం చేసింది. దీంతో ఈ పథకం కింద లబ్ధిదా రులుగా ఉన్న పేదలపై పెనుభారం పడనుంది. జిల్లాలో 19,524 మంది లబ్ధిదారులకు ఉజ్వల పథకం కింద గ్యాస్ కనెక్షన్లను ఇచ్చారు. ఇప్పటి వరకు ఈ పథకం కింద గ్యాస్ సిలిండర్లను బుక్ చేసుకున్న లబ్ధిదారులకు ఒక్కో సిలిండర్‌కు రూ.300 సబ్సిడీని ఇస్తుండటంతో కొంతమేర ఊరట లభించేది. ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో ఇప్పటికే రెండు విడతలుగా సిలిండర్ల ధరలను పెంచిన కేంద్రం తాజాగా ఇప్పుడు ఉజ్వల కింద లబ్ధిపొందుతున్న వారికి షాక్ ఇచ్చింది.
అప్పుడు ప్రోత్సాహం.. ఇప్పుడు నిరుత్సాహం
సాధారణంగా ఒక కుటుంబంలో భార్య, భర్త, ఇద్దరు పిల్లలు ఉంటే ఒక సిలిండర్ 45 రోజుల నుంచి 50 రోజుల వరకు వస్తుంది. ఇంకా ఆ కుటుంబంలో తల్లిదండ్రులు ఉంటే 30 నుంచి 35 రోజులకే అయిపోతుంది. జిల్లాలో 19,524 మంది లబ్ధిదారుల కుటుంబం ఒక్కొక్కటి ఏడాదికి 8 నుంచి 12 సిలిండర్లను వినియోగి స్తోంది. అయితే ప్రస్తుతం ఆ పథకం కింద ఇచ్చే సిలిండర్లలో కోత విధించడంతో ఉజ్వల కింద గ్యాస్ వినియోగించే లబ్ధిదారులు నెలకు రూ.53లక్షల చొప్పున ఏడాదికి సుమారు ఆరు కోట్లకుపైగా లబ్ధిదారులు సబ్సిడీని కోల్పోయి ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. పేదలకు ఉచితంగా ఉజ్వల కింద గ్యాస్ కనెక్షన్లు తీసుకోవాలని ప్రోత్సహించి ఇప్పుడు యుద్దం పేరుతో గ్యాస్ సిలిండర్లకు ఇచ్చే సబ్సిడీని పూర్తిగా ఎత్తివేసేందుకు కేంద్రం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.