Share News

పరిమితికి లోబడే సాగు చేయాలి

ABN , Publish Date - Sep 29 , 2026 | 12:57 AM

రానున్న సీజన్‌లో పరిమితికి లోబడే పొగాకు పంట సాగు చేయాలని బోర్డు చైర్మన్‌ యశ్వంత్‌కుమార్‌ రైతులకు సూచించారు. సోమవారం ఒంగోలు వచ్చిన ఆయన తొలుత స్థానిక కర్నూలు రోడ్డులోని ఒంగోలు-1ను, అనంతరం టంగుటూరు వేలం కేంద్రాన్ని సందర్శించారు.

పరిమితికి లోబడే సాగు చేయాలి
టంగుటూరులో వేలాన్ని పరిశీలిస్తున్న పొగాకు బోర్డు చైర్మన్‌ యశ్వంత్‌కుమార్‌

పొగాకు వేలాన్ని పరిశీలించిన బోర్డు చైర్మన్‌

మార్కెట్‌లో తాజా పరిస్థితులపై రైతులతో చర్చ

ఇంకా ప్రారంభం కాని అనధికార కొనుగోళ్లు

సూపరింటెండెంట్‌లతో ఆర్‌ఎం సమీక్ష

ఒంగోలు, సెప్టెంబరు 28 (ఆంధ్రజ్యోతి) : రానున్న సీజన్‌లో పరిమితికి లోబడే పొగాకు పంట సాగు చేయాలని బోర్డు చైర్మన్‌ యశ్వంత్‌కుమార్‌ రైతులకు సూచించారు. సోమవారం ఒంగోలు వచ్చిన ఆయన తొలుత స్థానిక కర్నూలు రోడ్డులోని ఒంగోలు-1ను, అనంతరం టంగుటూరు వేలం కేంద్రాన్ని సందర్శించారు. అక్కడ కొనుగోళ్ల తీరును పరిశీలించారు. అనంతరం రైతులతో సమావేశ మయ్యారు. మార్కెట్‌ తీరు, లభిస్తున్న ధరలు, నోబిడ్‌లు తదితర విషయాలను అడిగి తెలుసుకున్నారు. తాజాగా అనధికారిక పొగాకు పంట కొనుగోలుకు కేంద్రం అనుమతి ఇవ్వడం, తదనుగుణంగా బోర్డు తీసుకుంటున్న చర్యలను వివరించారు. అధికంగా పంట ఉత్పత్తి జరిగితే ప్రస్తుత సీజన్‌ వలే వచ్చే ఏడాది కూడా ప్రతికూల పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. రాష్ట్రంలో అనధికార, అధిక పంట ఉత్పత్తి కొనుగోళ్లకు ఎలాంటి అపరాధ రుసుం లేకుండా కేంద్రం అనుమతించి మూడు, నాలుగు రోజులు గడుస్తున్నా ఇంకా ఆ కొనుగోళ్లు ప్రారంభం కాలేదు. కేంద్రం గెజిట్‌ ఇచ్చినా తదనుగుణంగా పొగాకు బోర్డు ద్వారా పలు చర్యలు తీసుకోవాల్సి ఉండటంతో కొంత ఆలస్యమవుతోంది. మరో రెండు, మూడు రోజుల తర్వాత ఆ ప్రక్రియ ప్రారంభంకానున్నట్లు అధికారవర్గాల సమాచారం. దీంతో దక్షిణాదిలో అధికారిక కొనుగోళ్లు పూర్తయిన ఆరు కేంద్రాలు పోను మిగిలిన ఐదు కేంద్రాల్లోనే సోమవారం వేలం కొనసాగింది. ఇప్పటివరకు దక్షిణాదిలో సుమారు 82 మిలియన్‌ కిలోలు కొనుగోలు జరగ్గా సగటున కిలోకు రూ.195 మేర ధర లభించింది. ఇదిలాఉండగా దక్షిణాదిలోని 11వేలం కేంద్రాల వేలం నిర్వహణ అధికారులతో ప్రాంతీయ మేనేజర్‌ జీఎల్‌వీ.ప్రసాద్‌ సోమవారం సాయంత్రం సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం వేలం జరుగుతున్న తీరు, అనధికార పంట కొనుగోలు చర్యలు, వచ్చే సీజన్‌ సాగుకు రెన్యూవల్స్‌ తదితర అంశాలపై సమీక్షించారు.

Updated Date - Sep 29 , 2026 | 12:57 AM